తెలుగులో పాట పాడిన లతా రజనీకాంత్!
తమిళంలో ‘కొచ్చడయాన్’గానూ, తెలుగులో ‘విక్రమసింహ’గానూ రూపొందుతోన్న రజనీకాంత్ తాజా చిత్రం కోసం దక్షిణాది ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాలీవుడ్ సినిమా ‘అవతార్’ తరహాలో త్రీడీ మోషన్ కాప్చరింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందుతోన్న తొలి దక్షిణాది చిత్రం ఇదే కావడంతో అందరిలోనూ ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంది. ‘రోబో’ తర్వాత రజనీ చేస్తున్న సినిమా ఇదే. రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య దర్శకురాలు కావడం ఒక విశేషం కాగా, రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ ఇందులో ఒక పాట పాడడం మరో విశేషం.
లతా రజనీకాంత్ సినిమా పాట పాడటం ఇదే ప్రథమం కాదు. గతంలో ఇళయరాజా స్వరసారథ్యంలో ఓ తమిళ సినిమాకు పాడారు. ఆ తర్వాత మళ్లీ ఆమె పాడలేదు. ఈసారి మాత్రం తమిళ వెర్షన్‌తో పాటు, తెలుగు వెర్షన్‌కి కూడా ఆమె పాడటం విశేషం. అనంత శ్రీరామ్ రాసిన ‘ఏదేమైనా సఖా’ అనే పాటను లతా పాడారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలందించారు. ఈ నెల 9న తమిళంలోనూ, 10న తెలుగులోనూ పాటలు విడుదల కానున్నాయి.