మార్చిలోగా బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాలు
అవసరమైతే నిర్మాణాలకు ఆర్థిక సాయం చేయండి
స్వచ్ఛభారత్ మిషన్‌సెక్రటరీ పరమేశ్వర్‌నాయర్
ముకరంపుర: స్వచ్ఛభారత్ మిషన్ పథకం కింద ఎంపికైన జిల్లాల్లో మార్చిలోగా వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలవిసర్జనరహిత జిల్లాలుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛభారత్ మిషన్(గ్రామీణ) సెక్రటరీ పరమేశ్వరన్ నాయర్ అన్నారు. ఢిల్లీ నుంచి మొదటివిడతలో ఎంపికైన కలెక్టర్లతో ఐఎస్ఎల్ ప్రగతిపై వీడియో కాన్ఫరెన్స్ బుధవారం ద్వారా సమీక్షించారు. నెలవారీగా లక్ష్యాన్ని నిర్ణయించుకుని గడువులోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్మాణాలకు నిధుల కొరత లేదన్నారు. నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే బిల్లులు చెల్లిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. అవసరమైన వారికి ఆర్థికసాయం అందించి త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. స్వశక్తిసంఘ మహిళలు, వాలంటీర్లను నియమించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
ఎక్కువ నిధులు విడుదల చేయండి..
జిల్లాలో 6,75,802 మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 5,57,020 నిర్మించామని, మిగిలినవాటిని వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. ప్రతీ నెలా 17వేల చొప్పున ఐఎస్ఎల్లు నిర్మించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పారు. జిల్లాలో 13 నియోజకవర్గాలుండగా.. అక్టోబర్ 2వరకు కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, రామగుండం నియోజకవర్గాలను బహిరంగ మలవిసర్జనరహిత నియోజకవర్గాలుగా ప్రకటించనున్నామని తెలిపారు. మొదటి విడత జిల్లాలకు ఎక్కువ నిధులు విడుదల చేయాలని కోరారు. జెడ్పీ సీఈవో సూరజ్‌కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ ప్రకాశ్‌రావు, డీఆర్డీఏ పీడీ అరుణశ్రీ తదితరులున్నారు.