కన్ఫామ్ : వన్ ప్లస్ 5 లాంచ్ ఆ రోజే
హై-ఎండ్ స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరలో అందిస్తూ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా కంపెనీ వన్ ప్లస్, సరికొత్తగా వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ ను తీసుకురాబోతుంది. ఇప్పటికే ఈ ఫ్లాగ్ షిప్ పై వచ్చిన రూమర్లతో విసుగెత్తిపోయిన కస్టమర్లకు కంపెనీ గుడ్ న్యూస్ అందించింది. తమ అప్ కమింగ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీలను వన్ ప్లస్ అధికారికంగా విడుదల చేసింది. జూన్ 20న ఈ ఫోన్ విడుదల చేస్తున్నట్టు పేర్కొంది.
అదేవిధంగా భారత్ లో కూడా ముంబై ఈవెంట్ గా జూన్ 22న లాంచ్ చేస్తామని వన్ ప్లస్ పేర్కొంది. కంపెనీ వెబ్ సైట్ లో జూన్20న రాత్రి 9.30కు ఆన్ లైన్ లో లైవ్ స్ట్రీమ్ చేస్తూ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ను లాంచ్ చేస్తున్న రోజే న్యూయార్క్ లో పాప్-అప్ ఈవెంట్ ను కంపెనీ నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్ పెయి, మార్కస్ బ్రౌన్లీ, స్పెషల్ గెస్ట్ లు పాల్గొననున్నారు.
ఈ పాప్-అప్ ఈవెంట్లను పారిస్, ఆమ్ స్టర్డామ్, బెర్లిన్, కోపెన్హాగన్ లలో కూడా తర్వాత రోజు గ్రాండ్ గా నిర్వహించనున్నారు. భారత్ లో లాంచ్ ఈవెంట్ ను వేరుగా జరుపనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇక్కడ కూడా ఇండియా సైట్ లో లాంచ్ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమ్ చేయనున్నారు. లీకేజీ వివరాల ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ కు 23మెగాపిక్సెల్ రియర్ సెన్సార్, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండనున్నాయని తెలుస్తోంది.
ఆండ్రాయిడ్ 7.1 నోగట్, 5.5 అంగుళాల డిస్ ప్లే, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 835ఎస్ఓసీ, 8జీబీ ర్యామ్, 64జీబీ, 128జీబీ ఇన్ బిల్డ్ స్టోరేజ్ ఆప్షన్లలో ఇది వస్తుందని సమాచారం. వెనుక వైపు రెండు కెమెరాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది కానీ దీనిపై ఇంకా స్పష్టతలేదు.