చిన్న ఉద్యోగం ఊడింది... పెద్ద ఉద్యోగం వచ్చింది!
డాగుసరి
ఒక దారి మూసుకుపోతే వంద దారులు తెరుచుకునే ఉంటాయనడానికి ఈ డాగిలమే మంచి ఉదాహరణ అదేమిటో చూద్దామా... గ్రెవెల్ అనే పేరుగల ఈ జర్మన్ షెప్పర్డ్ డాగ్‌ను పోలీసు ఆఫీసర్‌గా చూడాలని బుజ్జిపప్పీగా ఉన్నప్పటినుంచే దీన్ని పెంచిన వాళ్లు కలలు కన్నారట. వాళ్ల కాళ్లూ వీళ్ల గడ్డాలూ పట్టుకుని లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్‌లో చిన్న పోస్ట్ ఇప్పించారట. ముద్దొచ్చే ముఖంతో, చిలిపి చేష్టలతో కొత్తాపాతా లేకుండా కలసిపోయి చక్కగా ఆడుకుంటోంది. అయితే, అదే గ్రెవెల్ పాలిట శాపమైంది. అసలు వాచ్ డాగ్ అంటే... కొత్తవాళ్లని చూసి మొరగాలి కదా... ఇదేమో మొరగటం మానేసి తోకూపుకుంటూ ముఖమంతా నాకేస్తూ ఆడుకుంటోందట. చిన్న పిల్ల కదా, పెద్దయ్యాక చూద్దాంలే అని చూసీచూడనట్టు ఊరుకున్నారు పై వాళ్లు.
నెలలు గడుస్తున్నకొద్దీ దాని ప్రవర్తన మారకపోగా, మరింత సోషలైజ్ అయిపోతుండడంతో ఇలా లాభం లేదని, దాన్ని కాస్తా ఉద్యోగం నుంచి తప్పించేశారు అధికారులు. అయితే అదే వరంగా మారింది గ్రెవెల్కు. దాని పర్సనాలిటీ చూసి ముచ్చటపడి క్వీన్స్లాండ్ గవర్నర్ పాల్ డీ జెర్సీకి వ్యక్తిగత కాపలాదారు అదేనండీ, అక్కడి భాషలో చెప్పాలంటే వైస్ రీగల్ డాగ్ ఉద్యోగం వరించింది. గవర్నర్ ఆఫీసుకు వచ్చిన వాళ్లని రిసీవ్ చేసుకోవడం, మర్యాదలు చేయడం గ్రెవల్ విధులు. త్వరలోనే గ్రెవెల్ గారు గవర్నర్ అతిథులందరికీ తలలో నాలుకగా మారిపోయింది. అతిథులందరూ గ్రెవెల్ను ప్రత్యేకంగా చూడటం మొదలు పెట్టారు.
దాంతో గవర్నర్ వద్ద గ్రెవల్ లెవల్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రత్యేక సమావేశాల్లో, ఆంతరంగిక చర్చల్లో కూడా గ్రెవల్కు స్థానం లభించింది. దానికి కూడా అధికారిక కోట్ తొడిగి మరీ కుర్చీల్లో కూచోబెట్టడం మొదలెట్టారు సిబ్బంది. గవర్నర్ సతీమణి, ఆవిడ స్నేహితులు కూడా దాన్ని ముద్దు చేయడం మొదలెట్టారు. మొత్తం మీద గ్రెవెల్ లెవల్ మరింతగా పెరిగిపోయింది.