ఆమెకు మేం మాత్రమే న్యాయం చేయగలం
త్రివేండ్రం: కేరళలో ఇటీవల సామూహిక అత్యాచారానికి గురై, దారుణ హత్యకు గురైన దళిత న్యాయ విద్యార్థినికి తప్పక న్యాయం జరుగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. శుక్రవారం అట్టింగళ్లో ఎన్నికల ప్రచారంలో రాజ్నాథ్ మాట్లాడుతూ.. ఎల్డీఎఫ్ లేదా యూడీఎఫ్ ఆమెకు న్యాయం చేయలేవని, బీజేపీ మాత్రమే చేయగలదని చెప్పారు. మహిళల రక్షణకు కేరళ సురక్షిత ప్రాంతమని పేరుండేదని.. అయితే ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కేరళ గౌరవాన్ని ప్రశ్నార్థకం చేశాయని విమర్శించారు.
గత నెల 28న ఎర్నాకుళం జిల్లా పెరంబవూర్లో న్యాయ విద్యార్థిని ఆమె ఇంట్లోనే దుండగులు నిర్భయ ఘటనలాగా చిత్రహింసలు పెట్టి దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె కుటుంబానికి న్యాయం చేసేందుకు ఎవరూ ముందుకురాలేదు. ఈ వార్త మీడియాలో రావడం, తోటి విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం, కేరళ వ్యాప్తంగా ఆందోళన చెలరేగడం, ఆ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సుమెటో కేసును నమోదు చేసి విచారణకు ఆదేశించిన తర్వాత రాజకీయ నాయకులు స్పందించారు. చివరకు ఈ ఘటనను రాజకీయ పార్టీలు ఓ ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నాయి.
శాంతిభద్రతలను కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, మహిళలకు రక్షణ లేదని విపక్షాలు విమర్శించగా, కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బుధవారం బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. బాధితురాలి సోదరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చాందీ హామీ ఇచ్చారు.