శివలింగలో రితికానే హీరో!
శివలింగ చిత్రంలో తన పాత్ర చంద్రముఖి చిత్రంలోని జ్యోతిక పాత్రకు ధీటుగా ఉంటుందని నటి రితికాసింగ్ పేర్కొన్నారు. కన్నడంలో విజయం సాధించిన శివలింగ చిత్రం అదే పేరుతో తమిళంలో పునర్నిర్మాణం అయిన విషయం తెలిసిందే. కన్నడంలో దర్శకత్వం వహించిన పి.వాసు తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మించిన ఈ చిత్రంలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా నటించారు.
ఆయనకు జంటగా నటి రితికాసింగ్ నటించగా, ప్రధాన పాత్రల్లో శక్తివేల్‌వాసు, రాధారవి,వడివేలు, వీటీవీ.గణేశ్, జయప్రకాశ్, భానుప్రియ, ఊర్వశి, మధువంతి, సాయిప్రియ నటించారు. సురేశ్మురారి ఛాయాగ్రహణం, ఎస్ఎస్.తమన్ సంగీతాన్ని అందించిన శివలింగ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నటుడు రాఘవ లారెన్స్ మాట్లాడుతూ శివలింగ చిత్రంలో పి.వాసు దర్శకత్వంలో నటించడం మంచి అనుభవం అన్నారు.
అయితే విభిన్న హారర్, కామెడీ కథా చిత్రంగా రూపొందిన ఇందులో తాను కథానాయకుడిని కాదని, నటి రితికాసింగ్నే హీరో అని పేర్కొన్నారు. తాను ఎక్కువగా పాటలకే పరిమితం అవుతానని అన్నారు. నటి రితికాసింగ్ మాట్లాడుతూ శివలింగ చిత్రంలో చాలా మంచి పాత్రలో నటించే అవకాశాన్ని దర్శకుడు పి.వాసు కల్పించారని, ఇది చంద్రముఖి చిత్రంలో జ్యోతిక పాత్రకు ధీటుగా ఉంటుందని అన్నారు. ఇందులో ముందుగా రజనీకాంత్‌ను నటింపజేయడానికి దర్శకుడు ప్రయత్నించారు. ఆయన ఇతర చిత్రాలను కమిట్ అవడంతో నటించలేకపోయారనే ప్రచారం జరిగింది.