డబ్బులడిగే డీలర్లపై క్రిమినల్ కేసులు
- అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం
అనంతపురం అర్బన్ : రేషన్‌కార్డు లబ్ధిదారులకు డీలర్లు సరుకులను అప్పుగా ఇవ్వాలని, కాదని అక్రమంగా డబ్బు వసూలు చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, తక్షణం సస్పెండ్ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం ఆదేశించారు. శనివారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో డీఎస్ఓ ప్రభాకర్‌రావు, ఏఎస్‌ఓలతో సరుకుల పంపిణీపై సమీక్షించారు.
జిల్లాలో నిత్యావసర సరుకుల పంపిణీ వేగవంతం చేయాలని ఆదేశించారు. బ్యాంక్ ఖాతా లేని కార్డుదారులకు డీలరు, గ్రామ కార్యదర్శి సహకారంతో ఖాతా తెరిపించాలన్నారు. ఉజ్వల యోజన కింద అర్హులైన లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఏఎస్ఓలు సౌభాగ్య లక్ష్మి, సౌభాగ్య, ప్రేమ్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
విస్తృత తనిఖీలు నిర్వహించండి
ఆహార కల్తీ, తక్కువ తూకాలపై విస్తృత తనిఖీలు నిర్వహించాలని అధికారులను జేసీ ఆదేశించారు. తన చాంబర్లో ఎన్ఫోర్స్మెంట్ సమావేశం నిర్వహించిన ఆయన ఆహార కల్తీ నిరోధక, ఔషధ నియంత్రణ, తూనికలు కొలతలు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు జరిగిన తనిఖీలు, నమోదు చేసిన కేసుల నివేదికలను పరిశీలించారు.