సమస్యలను పరిష్కరించాలని ఆందోళన
కైకలూరు, న్యూస్‌లైన్ : తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కైకలూరులోని జాతీయ రహదారిపై బుధవారం మానవహారం నిర్వహించారు. కైకలూరు, కలిదిండి మండలాల సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు 300 మంది హాజరయ్యారు. తొలుత పట్టణంలో ర్యాలీ జరిపారు.
ఈ సందర్భంగా సీఐటీయూ మండల కార్యదర్శి కె.లాజర్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తల జీతాలను రూ.12,500కు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అంగన్వాడీల సంఘం మండల అధ్యక్షురాలు పోలవరపు సుజాత మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని, ఎటువంటి షరతులు లేకుండా సెంటర్ అద్దెలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘ నేతలు రమణ, రమాదేవి, గంగాజలం, ఝాన్సీ, విజిత, లీలావతి తదితరులు పాల్గొన్నారు.
డీఎన్నార్ సంఘీభావం
ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు సంఘీభావం ప్రకటించారు. వైఎస్సార్ సీపీ అధికారం చేపట్టిన తర్వాత అంగన్వాడీల న్యాయమైన కోర్కెలను తప్పకుండా తీరుస్తామని హామీ ఇచ్చారు.
అంగన్వాడీల మౌన ర్యాలీ
మండవల్లి : ప్రభుత్వం తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఐసీడీఎస్ మండవల్లి ప్రాజెక్ట్ పరిధిలోని మండవల్లి, ముదినేపల్లి మండలాల అంగన్వాడీ కార్యకర్తలు మౌనంగా బుధవారం ర్యాలీ నిర్వహించారు. నోటికి నల్ల రిబ్బనులు కట్టుకుని వీధుల్లో ప్రదర్శన జరిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లీడర్ సిహెచ్.వాణి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలననుసరించి జీతాలు పెంచాలని కోరారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. మండవల్లి, వడాలి, ముదినేపల్లి, కొత్తపల్లి సెక్టార్ల లీడర్లు కె.అరుణకుమారి, కృష్ణవేణి, మణి పాల్గొన్నారు.