ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ
హిమాయత్‌నగర్: ఈ నెల 8న ఎల్బీస్టేడియంలో నిర్వహించనున్న మహా బతుకమ్మ ఏర్పాట్లపై మంగళవారం జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో రాష్ట్ర మంత్రులు సమావేశం నిర్వహించారు. గిన్నిస్‌బుక్‌లో నమోదవనున్న బతుకమ్మ మహా ప్రదర్శనపై అందరూ శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా మంత్రులు కోరారు. నగర మహిళలు భారీ ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఒకేసారి పది వేలమంది మహిళలు బతుకమ్మ ఆడడం అద్భుత విషయమన్నారు. కార్యక్రమంలో 20 వేల మంది మహిళలు పాల్గొనేలా కార్పొరేటర్లు కృషి చేయాలని కోరారు. ఈసందర్భంగా ఎల్బీ స్టేడియంలో ఇరవై అడుగుల ఎత్తుతో ప్రత్యేక బతుకమ్మను ఏర్పాటు చేయనున్నట్లు హోం మంత్రి తెలిపారు.
సమావేశంలో సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మేయర్ రామ్మోహన్, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, పర్యాటక సంస్థ ఎండీ క్రిస్టినా చోంగ్తు, టూరిజం శాఖ కమిషనర్ సునీతా భగవత్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ హరికృష్ణ, సాంస్కృతికశాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.