తిరుమల మిల్క్ ఫ్రెంచ్ కంపెనీ చేతికి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద డెయిరీ సంస్థగా ఉన్న ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్... దేశీయ పాల ఉత్పత్తుల వ్యాపారంలోకి ప్రవేశించింది. రాష్ట్రానికి చెందిన తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్‌ను రూ.1,750 కోట్లకు (275 మిలియన్ డాలర్లు) లాక్టాలిస్ కొనుగోలు చేసింది. నలుగురు ప్రమోటర్లకు చెందిన 76 శాతం వాటాతో పాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ కార్లీ గ్రోత్ క్యాపిటల్ ఫండ్ చేతిలో ఉన్న 24 శాతం వాటాను కూడా లాక్టాలిస్ కొనుగోలు చేస్తోంది. ఈ ఒప్పందాన్ని ప్రమోటర్లలో ఒకరైన బొల్లా బ్రహ్మ నాయుడు ధృవీకరించారు. అయితే ఒప్పందం వివరాలు, విలువను తెలియచేయడానికి ఆయన నిరాకరించారు. లాక్టాలిస్ అధికార ప్రతినిధి మైకెల్ నాలెట్ మాత్రం ఈ ఒప్పందాన్ని జాతీయ మీడియాకి నిర్ధారించారు. 2010లో కార్లే గ్రోత్ ఫండ్ తిరుమల మిల్క్‌లో 24 శాతం వాటాను 22 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇపుడు అదే వాటా కోసం లాక్టాలిస్ 85 మిలియన్ డాలర్లు చెల్లించింది. అంటే మూడేళ్లలో కార్లీ గ్రోత్ ఫండ్‌కు 225 శాతానికి పైగా లాభాలొచ్చాయి.
దేశీయ డెయిరీ పరిశ్రమపై దృష్టి
దాదాపు 150కిపైగా దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న లాక్టాలిస్ అమ్మకాల పరిమాణం రూ.1.40 లక్షల కోట్లు. రూ.60,000 కోట్ల పాల ఉత్పత్తుల మార్కెట్ కలిగిన ఇండియాలోకి లాక్టాలిస్ తొలి అడుగు కూడా ఇదే. ప్రపంచ పాల ఉత్పత్తిలో దాదాపు 20 శాతం వాటా కలిగిన ఇండియా అంతర్జాతీయ డెయిరీ కంపెనీలకు ప్రధానమైన మార్కెట్‌గా కనిపిస్తోంది. రూ.1,500 కోట్ల అమ్మకాలతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల తయారీ సంస్థగా ఉన్న తిరుమల డెయిరీని కోనుగోలు చేయడం ద్వారా ఇండియాలో అడుగు పెట్టడమే కాకుండా మరింతగా విస్తరిచే యోచనలో ఈ ఫ్రెంచ్ కంపెనీ ఉంది. లాక్టాలిస్ రంగ ప్రవేశంతో ఇప్పటి వరకు ఇండియాలో నంబర్ వన్‌గా ఉన్న ‘అమూల్’కి గట్టి పోటీ తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రూ.2.25 లక్షలతో ఆరంభమైన తిరుమల...
ఆటో మొబైల్ ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్న నలుగురు స్నేహితులు కలిసి రూ.2.25 లక్షల మూలధనంతో 1998లో తిరుమల డెయిరీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తిరుమల డెయిరీ... రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్నాటకల్లో బాగా విస్తరించింది. పాల ప్యాకెట్లు, టెట్రా ప్యాకెట్లు, పాలపొడి, స్వీట్లు, పన్నీర్, నెయ్యి, వెన్న వంటి ఉత్పత్తులను ఇది అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1427 కోట్ల వ్యాపారంపై రూ.70 కోట్ల లాభాన్ని తిరుమల మిల్క్ ప్రకటించింది.