వెంటాడి మరీ కాల్చి చంపారు..
పట్నా: బీహార్లో ఓ వైపు ఎన్నికలు సమీపిస్తోంటే.. మరోవైపు బీజేపీ నేత హత్య స్థానికంగా కలకలం రేపింది. రాజధాని నగరం పట్నా నడిబొడ్డులో పట్టపగలు బీజేపీ నేత అవినాష్ కుమార్ను దుండగులు వెంటాడి కాల్చి చంపిన ఘటన ఉద్రిక్తతను రాజేసింది. గురువారం ఉదయం అవినాష్ కుమార్ మార్నింగ్ వాక్ చేస్తుండగా అతనిపై ముగ్గురు దుండగులు దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
దీంతో అతను అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనపై బీహార్ అసెంబ్లీ అట్టుడికింది. బీజేపీ ఎమ్మెల్యేలు దీనిపై సభలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని, దానికి బీజేపీ నేత హత్యే అద్దం పడుతోందని ఆరోపించారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో అసెంబ్లీని వాయిదావేశారు.
ఇక పోలీసులు కథనం ప్రకారం సమీపంలో ఉన్న దేవాలయంలోని సీసీ టీవీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. ముగ్గురు వ్యక్తులు కుమార్ను వెంబడించి కాల్పులు జరపగా... అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. పరారీలో ఉన్నవారి కోసం గాలింపుచర్యలు చేపట్టామని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
మరోవైపు కుమార్ హత్య దావానలంలా వ్యాపించడంతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రహదారులను దిగ్భంధించి, టైర్లను తగుల బెట్టారు. బాధితుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీల ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాల్సి ఉండగా స్థానిక నేత కుమార్ హత్యకు గురికావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.