పదవిలో ఉండి ప్రాణాలు కోల్పోయిన నేతలెవరంటే...
న్యూఢిల్లీ: పదవీ బాధ్యతల్లో ఉండి ప్రాణాలుకోల్పోయినవారి జాబితా భారత్లో కొంచెంకొంచెం పెరుగుతూ వస్తోంది. గతంలో ప్రధాని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి ఇలా వరుసగా దాదాపు అన్ని స్థాయి పదవుల్లో ఉన్న నేతలు.. దురదృష్టవశాత్తు బాధ్యతల్లో ఉండగానే ఏదో ఒక ప్రమాదరూపంలో చనిపోతున్నారు. గురువారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మఫ్తీ మహ్మద్ సయీద్ ఎయిమ్స్ లో కన్ను మూశారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే చనిపోయారు. ఈ నేపథ్యంలో పదవిలో ఉండి ప్రాణాలుకోల్పోయిన నేతల వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
జవహార్ లాల్ నెహ్రూ (నవంబర్ 14, 1889-మే 27, 1964)
భారత స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన నేత జవహార్ లాల్ నెహ్రూ. ఆయన స్వాతంత్ర్య భారతావనికి తొలి ప్రధాని. ఆయన పదవిలో ఉండగానే 1962లో అస్వస్థతకు గురై కశ్మీర్లో చికిత్స పొందుతూ మెల్లగా కోలుకున్నారు. ఆ తర్వాత పదవిలో ఉండగానే 1964 మే 27న గుండెపోటుతో చనిపోయారు.
లాల్ బహదూర్ శాస్త్రి (అక్టోబర్ 2, 1904-జనవరి 11, 1966)
జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేత లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన నెహ్రూ అనంతరం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. నెహ్రూ ప్రారంభించిన విధానాలను ఆయన అమలుచేసేందుకు పూనుకున్నారు. అయితే, పదవిలో ఉండగానే జనవరి 10, 1966లో గుండెపోటుతో తాష్కెంట్లో కన్ను మూశారు. విదేశాల్లో చనిపోయిన తొలి భారత ప్రధాని కూడా ఈయనే.
జాకీర్ హుస్సేన్(ఫిబ్రవరి 8, 1897-మే 3, 1969)
భారత్కు తొలి ముస్లిం రాష్ట్రపతిగా అతితక్కువకాలం పనిచేసి పదవిలో ఉండగానే చనిపోయారు జాకీర్ హుస్సేన్. జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాకీర్ ఆ వర్సిటీకి వీసీగా కూడా పనిచేశారు. అనంతరం భారత స్వాతంత్ర్య పోరులో కీలకంగా పనిచేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి(జూలై 8, 1949-సెప్టెంబర్ 2, 2009)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత వైఎస్ రాజశేకర్ రెడ్డి. అందరూ ఆయనను ప్రేమగా వైఎస్ఆర్ అని పిలుచుకుంటారు. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా ఎదిగిన ఆయన అఖండ ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఏ నాయకుడు ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తొలిసారి 2004 నుంచి 2009వరకు సీఎంగా పనిచేసిన వైఎస్సార్ రెండోసారి కూడా సీఎంగా ప్రమాణం చేసిన (2009) కొద్ది రోజులకే అనూహ్యంగా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయారు.
డోర్జీ ఖండూ(19 మార్చి 1955-30 ఏప్రిల్ 2011)
కాంగ్రెస్ పార్టీకి చెందిన డోర్జీ ఖండూ అరుణాచల్ ప్రదేశ్ కు ఆరో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కానీ, దురదృష్టవశాత్తు ఏప్రిల్ 30, 2011న హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయారు.