మళ్లీ స్కెచ్చేస్తున్నారు..!
►ఒంగోలులో రూ..5 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
►గతంలో ఇచ్చిన పట్టాలు రద్దుచేసిన నాటి జేసీ
►ముస్లిం కమ్యూనిటీ హాలుకు ఇవ్వాలని ఆనాడే ఉత్తర్వులు
►అదే స్థలాన్ని కబ్జాదారులకు కట్టబెట్టేందుకు మళ్లీ సన్నాహాలు
►పావులు కదుపుతున్న అధికార పార్టీ నేతలు
ధనార్జనే పరమావధిగా పెట్టుకున్న అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులు ప్రభుత్వ భూములు ఎక్కడ కనిపిస్తే అక్కడ గద్దల్లా వాలుతున్నారు. ఒంగోలు నగరంలో అత్యంత ఖరీదైన స్థలాలపై కన్నేసి, వాటిని కాజేసేందుకు పన్నాగం పన్నుతున్నారు. అర్హత లేకున్నా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఓ కబ్జాదారు తాజాగా తన కుటుంబ సభ్యుల పేరుతో రూ.5 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు పావులు కదుపుతున్నాడు. అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత సైతం గురువారం ఆ స్థలాన్ని సందర్శించి, దానిని కబ్జాదారునికే కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాని సమాచారం.
ఒంగోలు క్రైం: ఒంగోలు పాతగుంటూరు రోడ్డులో ఉన్న బిలాల్‌నగర్‌లోని పోతురాజుకాలువ పక్కనే టీఎస్ నంబర్–116/1ఏ/1ఏ లో 42 గదుల ప్రభుత్వ భూమి ఉంది. మూడు వైపుల రోడ్డు సౌకర్యం ఉన్న ఈ భూమి అత్యంత ఖరీదైంది. దీనిపై అధికార పార్టీకి చెందిన ‘బొట్టు’ శ్రీను అనే వ్యక్తి కన్నుపడింది. గతంలో ఆ స్థలాన్ని రెండు ప్లాట్లుగా విభజించి నిబంధనలకు విరుద్ధంగా అతడి తల్లి, అత్త పేరుతో రెండు పట్టాలు పొందాడు. ప్లాట్ నంబర్ ఒకటిని నెలకుర్తి సుబ్బులు, రెండోది వేమూరి లక్ష్మమ్మ పేరుతో పట్టాలు తీసుకున్నాడు. అయితే అప్పట్లో బిలాల్‌నగర్‌కు చెందిన ముస్లింలు ఆ స్థలం కమ్యూనిటీ హాలుకు కావాలని అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని, ఒంగోలు వచ్చిన నాటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డిని కోరారు.
ఆస్థలాన్ని కమ్యూనిటీ హాలుకు కేటాయిస్తామని వారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ స్థలంపై కొందరు పట్టాలు పొందారని తెలిసి కొందరు ముస్లింలు 2009లో నాటి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన అప్పటి జాయింట్ కలెక్టర్ ఎ.దినకరబాబు అదే ఏడాది డిసెంబర్ 4న వీరిద్దరి పట్టాలను రద్దు చేస్తూ ఆర్సి నంబర్ ఈ3–3684/2009తో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్లో ఆ స్థలాన్ని కమ్యూనిటీ హాలుకు కేటాయిస్తున్నట్టు కూడా స్పష్టంగా పేర్కొన్నారు.
ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ప్రయత్నం..
అనంతరం సుబ్బులు, లక్ష్మమ్మలకు ఒంగోలు నగరంలో ఎక్కడెక్కడ సొంత ఇళ్లున్నాయో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అప్పటి తహశీల్దార్ చిరంజీవిని ఆదేశించారు. దీంతో విచారణ జరిపిన తహశీల్దార్ వారిద్దరికీ ఉన్న శాశ్వత భవనాలకు సంబంధించిన ఆధారాలతో సహా నివేదిక సమర్పించారు. 2010 ఫిబ్రవరి 11న ఆర్సీ బి/1053/2009 నంబర్‌తో కూడిన నివేదికను తహశీల్దార్ చిరంజీవి జేసీ దినకరబాబుకు సమర్పించారు. ఆ నివేదికలో వాళ్లిద్దరికి సంబంధించిన ఆర్సీసీ భవనాల వివరాలతో సహా అందజేశారు. అయినా మళ్లీ ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాజేసేందుకు వాళ్లే రంగంలోకి దిగడం గమనార్హం.