Lease farmer suicide
-
బావిలో దూకి కౌలు రైతు ఆత్మహత్య
సాక్షి, అద్దంకి (ప్రకాశం): వ్యవసాయంలో ఎదురైన నష్టాలో అప్పుల పాలైన కౌలు రైతు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని ధేనువుకొండలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. ధేనువుకొండ గ్రామానికి చెందిన వింజం చింపిరయ్య(45)కు పాతికేళ్ల కిందట మోదేపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు. ఏడేళ్ల కిందట ధేనువుకొండ గ్రామం గుండ్లకమ్మ డ్యామ్ నిర్మాణంలో ముంపు గ్రామంగా ప్రకటించటంతో ప్రభుత్వ అందజేసిన నష్ట పరిహారం రూ.2 లక్షలతో అత్తగారి ఊరు మోదేపల్లి చేరుకుని అక్కడ ఇల్లు కొనుక్కొన్నాడు. అక్కడే రెండెకరాల అత్తగారి పొలంతోపాటు మరో మూడెకరాలను కౌలుకు తీసుకుని ఐదేళ్లుగా మిరప, పత్తి పంటలు సాగు చేస్తూ వచ్చాడు. ఏటా నష్టాలే ఎదురుకావడంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు వడ్డీతో సమా రూ.10 లక్షల వరకు తేలాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం పశువులను తొలుకుని పొలాల్లోకి వెళ్లిన చింపిరయ్య సాయంత్రం ఇంటికి చేరలేదు. తరచూ పశువులను పొలంలో వదిలి స్వగ్రామం వెళ్లటం అలవాటుగా వున్న చింపిరయ్య అక్కడివెళ్లి వుంటాడని భార్య, కుటుంబసభ్యులు భావించారు. గురువారం మధ్యాహ్నం ధేనువుకొండ గ్రామ సమీపంలోని బావిలో పశువుల కాపరులకు శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
కరీంనగర్: ఓ కౌలురైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి మండలం, పుట్టపల్లిలో మంగళవారం వెలుగుచూసింది. పంటకోసం చేసిన అప్పుల బాధలు భరించలేక రైతు ఈ బలవనర్మణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
పంట ఎండిందని ప్రాణం తీసుకున్నాడు..
దోమ: ఆరుగాలం కష్డపడి సాగు చేసిన వరిపంట కళ్ల ముందే ఎండిపోవడంతో అప్పులు తీరేమార్గం లేదని మనోవేదనకు గురైన ఓ అన్నదాత బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా దోమ మండల పరిధిలోని బొంపల్లి చిన్నతండాలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు రాములు నాయక్(35) బొంపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని గత మూడేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిపంట వేశాడు. పెట్టుబడికి, కుటుంబ అవసరాల కోసం దోమ ఎస్బీహెచ్లో రూ.30 వేలు, ప్రైవేట్‌గా మరో రూ.1.70 లక్షల వరకు అప్పు చేశాడు. ఇటీవల విద్యుత్ కోతల కారణంగా పంటకు నీరందక పూర్తిగా ఎండిపోయింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని రాములునాయక్ మానసిక వేదనకు గురయ్యాడు. అప్పులు తీరేమార్గం లేదని మనస్తాపం చెందిన ఆయన మంగళవారం మధ్యాహ్నం పొలంలో తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత పొలానికి వెళ్లిన చిన్న కుమారుడు సేవ్యా తండ్రి మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మీబాయితో పాటు కుమారులు శంకర్, సేవ్యా, కుమార్తె సావిత్రి ఉన్నారు. రైతు మృతితో కుటుంబీకులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. మృతుడి తండ్రి రూప్సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.