Lease farmers
-
ఎకరా కౌలు రూ.42వేలు
కారంచేడు: వ్యవసాయంపై గతంలో ఎన్నడూ లేనంత భరోసా. నేను విన్నాను.. నేను ఉన్నాను అనే మాటపై ఉన్న ధీమా రైతుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. సాగుపై ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయాల్సిన పని లేదనే ధీమా నేడు జిల్లా రైతాంగాన్ని ఉరకలెత్తిస్తోంది. సాగు చేశామంటే వెనుదిరిగి చూసే ప్రసక్తే లేదనే ధీమాతో రైతులు ఈ ఏడాది వరి, మిరప, అపరాల సాగుకు ముందడుగు వేస్తున్నారు. ఇదీ పరిస్థితి జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలోని పంట భూముల కౌలు ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కౌలు ధరలు ఎగిసిపడటానికి రైతుల్లో నెలకొన్న పోటీనే అని పలువురు రైతులు వ్యాక్యానిస్తున్నారు. ఈ విషయం రైతుల్లో ఆనందాన్ని ఇస్తున్నా కౌలు రైతుల్లో మాత్రం కొంత ఆందోళన కలిగించే విషయమే. అయినా ఎంత ఖర్చు చేశామో అంత పెట్టుబడితోపాటు, అధిక లాభాలు కూడా ఆర్జించవచ్చనే ధైర్యంతోనే రైతులు సాగుకు వెనుకడుగు వేయడం లేదు. దీంతో ఈ ప్రాంత వ్యవసాయ భూములకు మంచి డిమాండ్ పెరిగింది. అత్యధికంగా మిరప సాగు చేసే భూములకు కౌలు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో మిరపకు అనుకూలమైన భూములకు ఇప్పటికే కౌలు ధరలు నిర్ణయించుకొని, ఖజానాలు సైతం అయిపోయాయంటే భూములకు నేడు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మాగాణి ప్రాంతంగా పేరొందిన కారంచేడులో గత ఏడాది నుంచి రైతులు మెట్ట పైర్ల వైపు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు. వరికి తగ్గిన డిమాండ్ గతంతో పోల్చుకుంటే వరి సాగుకు కొంత డిమాండ్ తగ్గిందనే చెప్పాలి. గతంలో కారంచేడు మండలంలో సుమారు 40 వేల ఎకరాల సాగు భూములుంటే వీటిలో 25వేల ఎకరాల్లో వరి, 15 వేల ఎకరాల్లో మెట్టపైర్లు సాగు చేసేవారు. ప్రస్తుతం సుమారు 20 వేల ఎకరాలకు పైగా మెట్ట పైర్లు సాగు చేసే పరిస్థితి వచ్చింది. మిరపకు డిమాండ్ ♦ ప్రస్తుతం మిరప పంటకు మార్కెట్లో డిమాండ్ ఉంది. మిరప పంటకున్న «గిట్టుబాటు ధరలకు తోడు మిరప సాగు చేసే భూములకు కౌలు రైతులు అధిక కౌలు ఇచ్చి మరీ తీసుకుండటంతో డిమాండ్ పెరిగింది. ♦ ఎకరా కౌలు రూ.38 వేల నుంచి రూ.42వేలు ♦ ప్రస్తుతం కౌలు రైతులు ఏ పంట సాగు చేసుకున్నా సంబంధం లేకుండా ఎకరా కౌలు మాత్రం రూ.38వేల నుంచి రూ.42 వేలు వరకు డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మాగాణి సాగుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కారణం ధాన్యానికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు కల్పించడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది క్వింటా ధాన్యం పాతవి రూ.2500, కొత్తవి క్వింటా రూ.1700 వరకు ధర పలుకుతున్నాయి. ♦ అపరాలకు గిట్టుబాటు ధర గతంలో ఎన్నడూ లేని విధంగా అపరాల ధర ఆశాజనకంగా ఉంది. దీంతో మెట్ట పైర్ల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. కారంచేడు ప్రాంతంలో మాగాణి భూముల్లో సైతం మెట్ట పైర్లు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులు కౌలుకు చేసేందుకు మొగ్గు చూపుతుండటంతో ధరలు కూడా రెట్టింపయ్యాయి. పెద్ద రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. సన్న, చిన్నకారు రైతులు మాత్రం కౌలు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందనే ధైర్యం గతంతో పోల్చుకుంటే సాగు భూములకు కౌలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నేను 15 సంవత్సరాలకు పైగా సాగు చేస్తున్నా. ఇంత ఎక్కువ కౌలు ధరలు చూడలేదు. రైతుల మధ్య పోటీతోనే కౌలు ధరలు పెరుగుతున్నాయి. నేటి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందనే ధైర్యం మాకుంది. ఆ ధైర్యంతోనే ముందుకు సాగుతున్నాం.– అంజమ్మ, కౌలురైతు, ఆదిపూడి -
రైతు కుటుంబాన్ని ఆదుకునేదెన్నడు?
మెదక్ జిల్లా కొండపాక మండలం జప్తి నాంచారం గ్రామానికి చెందిన రైతు చింతల మహేందర్ గౌడ్‌కు 30 గుంటల భూమి ఉంది. దీనికి తోడు 4 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసేవాడు. నీటి వసతి కోసం 3 బోర్లు వేయగా మూడింటిలో ఒక్కదానిలో కూడా చుక్క నీరు పడలేదు. బోర్లు విఫలం కావటం, కౌలుకు కూడా అప్పుతెచ్చి చెల్లించడం, వరుసగా రెండేళ్లు పంట పూర్తిగా నష్టపోవటం వల్ల అప్పులపాలయ్యాడు. అప్పులు తీర్చడానికి మహేందర్ కొన్ని రోజులు లారీ డ్రైవర్‌గా కూడా పనిచేశాడు. భార్య నగలను కుదువపెట్టి కొంత అప్పు తీర్చాడు. అయినా అప్పుల ఒత్తిడి తట్టుకోలేక 2016 సెప్టెంబర్ 11న ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి భార్య లక్ష్మి, పిల్లలు నికితేస్(4), భవ్యశ్రీ(19 నెలలు) ఉన్నారు. తండ్రి చనిపోయేనాటికి భవ్యశ్రీ తల్లి కడుపులోనే ఉంది. ఈ కౌలు రైతు కుటుంబానికి ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయమూ అందలేదు. -
‘పెట్టుబడి’ కౌలురైతులకే దక్కాలి
తిరుమలాయపాలెం : రైతులకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. వారి ఇబ్బందులను తొలగించేందుకు నేరుగా ఉపయోగపడేలా రూప కల్పన చేసిన పథకం ‘రైతుబంధు’ అని, భూమిని నమ్ముకుని కష్టపడుతున్న కౌలు రైతులకు పెట్టు బడి సహాయం దక్కేలా భూ యజమానులు సహకరించాలని రాష్ట్రరోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని తెట్టెలపాడులో రైతుబంధు చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలు, కరువు కాటకాలతో చితికిపోయిన రైతులను ఆదుకునేందుకే కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని చెప్పారు. ఇప్పటికిప్పుడు కౌలు రైతులను గుర్తించడం కష్టమని, భూ యజమానులు ఎవరికి కౌలుకు ఇస్తారో తెలియదని, అందుకే భూమి ఉన్నవారికే సాయం అందేలా నిర్ణయం తీసుకున్నామని వివరించారు. కౌలు రైతులు సంఘటితంగా ఉంటే భూ యజమానులు దిగిరాక తప్పదన్నారు. గ్రామంలోని కాలనీలకు సీసీరోడ్లు, మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తెట్టెలపాడు నుంచి గోపాలపురం వరకు బీటీ రోడ్డు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నగేష్, ఆర్డీఓ పూర్ణచందర్రావు, ఎంపీపీ కొప్పుల అశోక్, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడిఓ వెంకటపతిరాజు, మండల వ్యవసాయాధికారి శరత్‌బాబు, సర్పంచ్ ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు పుసులూరి నరేందర్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మద్దినేని మధు, తిరుమలాయపాలెం సొసైటీ చైర్మన్ పుసులూరి పుల్లయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యు డు జియాఉద్దిన్, గ్రామ సర్పంచ్ సోమనబోయిన లింగయ్య, ఎంపీటిసి ఎల్లమ్మ, సొసైటీ డైరెక్టర్ కొండబాల వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎ.ఆంజనేయులు పాల్గొన్నారు. -
కౌలు రైతుకు చేయూత ఏది?
బజార్హత్నూర్(బోథ్) : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరి కోసం చట్టాలున్నా అమలుకాని పరిస్థితి. ప్రభుత్వం ఇటీవల ‘పెట్టు బడి’ సాయం కూడా పట్టాదారుడికే ఇస్తామని ప్రకటించింది. కనీసం రుణ అర్హత కార్డులు సైతం లేక కౌలు రైతులు అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అధిక వడ్డీకి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్టపోతే పరిహారం సైతం భూయజమానికే వస్తుండడంతో కౌలు రైతు అప్పుల ఊబిలోనే కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రభుత్వం మొండి చేయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 69వేల మంది కౌలు రైతులు ఉన్నారు. సొంతంగా సాగుభూమి లేకపోవడంతో పట్టదారుల నుంచి భూమిని కౌలుకు తీసుకొని వివిధ పంటలు పండిస్తున్నారు వీరంతా. 2011లో కౌలు రైతుల కోసం రూపొందించిన చట్టం సైతం వారిని ఆదుకోవడం లేదు. కౌలు రైతులను గుర్తించి వారికి రుణ అర్హత కార్డులు ఇవ్వాల్సి ఉండగా జిల్లాలో ఎక్కడ కూడా అలాంటి దాఖలాలు కానరావడం లేదు. బ్యాంకు రుణం పొందాలంటే కౌలు రైతుకు భూయజమాని పత్రం ఇవ్వాల్సి ఉంది. కానీ హామీ పత్రం ఇస్తే ఏం జరుగుతుందో అనే భయంతో పట్టాదారులు వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగా కౌలు రైతులు పెట్టుబడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మూడేళ్లలో కౌలు ధరలు నాలుగింతలు పెరిగాయి. మూడేళ్ల కింద పత్తి సాగు కోసం ఎకరం చేను రూ.8వేల లోపు ఉండగా ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా తాంసీ, తలమడుగు, జైనథ్, బేల మండలాల్లో ఈ మొత్తం రూ.15వేలు దాటింది. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరలు, కూలీల ఖర్చులు రెట్టింపయ్యాయి. పెరిగిన ధరలకు తోడు పండించిన దిగుబడులకు గిట్టుబాటు ధర రాక ఏటా కౌలు రైతులు కష్టాల్లో చిక్కుకుంటున్నారు. దరఖాస్తులు బుట్టదాఖలు... కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులును ఇవ్వాలని మూడేళ్ల కిందట ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో 60వేల మంది గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో అధికారులు వాటిని పక్కన పెట్టేశారు. అప్పులు తెచ్చి భూమిని కౌలుకు తీసుకొని సాగు చేయడం తప్ప సర్కారు నుంచి తమకు ఎలాంటి సహకారం అందడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి రుణ అర్హత కార్డులు ఇవ్వడంతో పాటు పెట్టుబడి సాయం రూ.4వేలు సాగు చేస్తున్న కౌలు రైతులకే అందివ్వాలని కోరుతున్నారు. అప్పుల పాలవుతున్నాం.. బలన్‌పూర్ శివారులో ఇద్దరి పొత్తులో రూ.80వేలకు ఏడెకరాల చేను కౌలుకు తీసుకున్నాం. నాలుగెకరాల్లో పత్తి , మూడెకరాల్లో సోయ పంట వేశాం. కౌలు కాక రూ.1లక్ష 95వేల పెట్టుబడి అయింది. పత్తికి గులాబీరంగు పురుగు సోకి 25 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సోయా దిగుబడి 18 క్వింటాళ్లు వచ్చింది. పత్తికి రూ.4,700 చొప్పున రూ.1,17,500, సోయకు రూ.2,800 చొప్పున రూ.50,400 రెండు కలిపి రూ.1,67,900 ఆదాయం వచ్చింది. 2,75,000 ఖర్చుచేస్తే 1,07,100 నష్టం వాటిల్లింది. తాండ్ర శ్రీనివాస్, కౌలురైతు, బజార్హత్నూర్ ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎకరానికి రూ.4వేలను కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. ప్రకృతి వైపరిత్యాల వల్ల కౌలు రైతు నష్టపోతే పరిహారం పట్టా రైతులకు ఇస్తున్నారు. కౌలు డబ్బులు తీసుకునే పట్టాదారు సాగుకు దూరంగా ఉంటాడు. పరిహారం కౌలు రైతుకే ఇవ్వాలి. ప్రభుత్వం త్వరగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించాలి. సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్ వేదిక జిల్లా అధ్యక్షుడు -
అప్పు ముప్పు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలోని కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో అసలు ఎంత వర్తిస్తుందో తెలియని స్థితిలో కొందరుంటే, బ్యాంకుల నుంచి రుణాలు అందక బయట అప్పులు చేసిన వారు.. తమ పరిస్థితి ఏంటని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వ్యవసాయ రంగంలో వస్తున్న సంక్షోభానికి ప్రత్యక్షంగా ఇబ్బంది పడుతోంది, అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటోంది కౌలురైతులే. జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల మంది రైతులుంటే అందులో లక్షన్నర వరకూ కౌలు రైతులున్నారు. వీరిలో కేవలం ఆరువేల మంది కౌలు రైతులకు మాత్రమే రుణాలు దక్కాయి. అందులో కూడా జేఎల్‌జీ (జాయింట్ లయబులిటీ గ్రూప్) ద్వారా రుణాలు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి లక్షన్నర రూపాయల రుణం మాఫీ చేస్తామని ప్రకటించింది. అయితే కౌలు రైతులు గ్రూపుగా తీసుకున్న రుణాల గురించి మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. గ్రూపును యూనిట్‌గా తీసుకుని మాఫీ చేస్తే కౌలు రైతుకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. జేఎల్జీలో ఐదుగురు సభ్యులుంటారు. దీని ప్రకారం చూస్తే ఒక్కొక్కరికి ముప్పై వేలకు మించి ప్రయోజనం ఉండ దు. దీనివల్ల కౌలు రైతులు ఇంకా అప్పుల్లోనే ఉంటారు. కౌలురైతులు గ్రూపు ద్వారా వచ్చిన పదివేలో, 20 వేలో పెట్టుబడి సరిపోక బంగారం కుదువ పెట్టి అప్పులు తీసుకున్నారు. చాలా మంది ప్రైవేటు వ్యక్తుల నుంచి రుణాలు తీసుకుని వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో కౌలు రైతుల అన్ని అప్పులను మాఫీ చేయాలన్న డిమాండ్‌తో ఈ నెల 20న ఆందోళనకు రైతుసంఘాలు సిద్ధమవుతున్నాయి. కౌలు రైతులపై చిన్నచూపు: కౌలు రైతులకు రుణాలిచ్చే విషయంలో బ్యాంకులు మొదటి నుంచి చిన్నచూపు చూస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. 2011లో కౌలురైతుల రక్షణకు చట్టాలు వచ్చినా అవి అమలు కావడం లేదు. 2011లో 24 వేల గ్రూపుల ఏర్పాటు కోసం దరఖాస్తులు వచ్చాయి. అయితే ఆ తర్వాత రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్ల నిర్లక్ష్యంతో వీటి ఏర్పాటు ముందుకు సాగలేదు. కేవలం 14,733 మందికి మాత్రమే రుణ అర్హత కార్డులు వచ్చాయి. అయితే రుణాలు మాత్రం రాలేదు. జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల రుణాలు తీసుకోవడానికి కౌలు రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఖరీఫ్ కోసం జూన్‌లో రుణాలిస్తారు. అయితే జిల్లాలో ఖరీఫ్ ఆగస్టు, సెప్టెంబర్‌లో జరుగుతుంది. దీంతో ఆ సమయానికి రైతుతో ఒప్పందాలు పూర్తి కాకపోవడంతో కౌలురైతులకు రుణం తీసుకునే అవకాశం లేకుండా పోతోంది. ఎవరైనా కౌలు చేస్తుంటే గ్రామసభ పెట్టి భూ యజమానికి ఇష్టం ఉన్నా లేకపోయినా జేఎల్‌జీ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. చట్టం గురించి కింది స్థాయిలో రెవెన్యూ సిబ్బందికి అవగాహన లేకపోవడంతో స్థల యజమాని నుంచి సంతకం కావాలని అడుగుతున్నారు. అయితే ఇవే పొలాలపై యజమానులు రుణాలు తీసుకోవడం వల్ల కౌలు రైతులకు రుణాలు అందని పరిస్థితి ఏర్పడుతోంది. జిల్లాలో వ్యవసాయం, బంగారం, డ్వాక్రా రుణాలు ఐదు వేల కోట్లకు పైగా ఉంటే రూ.2800 కోట్లు మాఫీ అవుతాయని ప్రచారం జరుగుతోంది. ఇందులో కౌలు రైతుల రుణాలు మాఫీ అయ్యేది కేవలం ఏడు కోట్ల రూపాయలు మాత్రమేనని సమాచారం. ఇప్పటికైనా కౌలురైతులను ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది.