ఎకరా కౌలు రూ.42వేలు | Crop Land Lease Prices Rise in Prakasam | Sakshi
Sakshi News home page

కౌలు ధరలకు రెక్కలు!

Published Mon, Jun 8 2020 1:01 PM | Last Updated on Mon, Jun 8 2020 1:01 PM

Crop Land Lease Prices Rise in Prakasam - Sakshi

దుక్కులు చేసి సాగుకు సిద్ధం చేసిన భూములు

కారంచేడు: వ్యవసాయంపై గతంలో ఎన్నడూ లేనంత భరోసా. నేను విన్నాను.. నేను ఉన్నాను అనే మాటపై ఉన్న ధీమా రైతుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. సాగుపై ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయాల్సిన పని లేదనే ధీమా నేడు జిల్లా రైతాంగాన్ని ఉరకలెత్తిస్తోంది. సాగు చేశామంటే వెనుదిరిగి చూసే ప్రసక్తే లేదనే ధీమాతో రైతులు ఈ ఏడాది వరి, మిరప, అపరాల సాగుకు ముందడుగు వేస్తున్నారు.

ఇదీ పరిస్థితి
జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలోని పంట భూముల కౌలు ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కౌలు ధరలు ఎగిసిపడటానికి రైతుల్లో నెలకొన్న పోటీనే అని పలువురు రైతులు వ్యాక్యానిస్తున్నారు. ఈ విషయం రైతుల్లో ఆనందాన్ని ఇస్తున్నా కౌలు రైతుల్లో మాత్రం కొంత ఆందోళన కలిగించే విషయమే. అయినా ఎంత ఖర్చు చేశామో అంత పెట్టుబడితోపాటు, అధిక లాభాలు కూడా ఆర్జించవచ్చనే ధైర్యంతోనే రైతులు సాగుకు వెనుకడుగు వేయడం లేదు. దీంతో ఈ ప్రాంత వ్యవసాయ భూములకు మంచి డిమాండ్‌ పెరిగింది. అత్యధికంగా మిరప సాగు చేసే భూములకు కౌలు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో మిరపకు అనుకూలమైన భూములకు ఇప్పటికే కౌలు ధరలు నిర్ణయించుకొని, ఖజానాలు సైతం అయిపోయాయంటే భూములకు నేడు ఎంత డిమాండ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. మాగాణి ప్రాంతంగా పేరొందిన కారంచేడులో గత ఏడాది నుంచి రైతులు మెట్ట పైర్ల వైపు కూడా ఆసక్తి కనపరుస్తున్నారు.

వరికి తగ్గిన డిమాండ్‌
గతంతో పోల్చుకుంటే వరి సాగుకు కొంత డిమాండ్‌ తగ్గిందనే చెప్పాలి. గతంలో కారంచేడు మండలంలో సుమారు 40 వేల ఎకరాల సాగు భూములుంటే వీటిలో 25వేల ఎకరాల్లో వరి, 15 వేల ఎకరాల్లో మెట్టపైర్లు సాగు చేసేవారు. ప్రస్తుతం సుమారు 20 వేల ఎకరాలకు పైగా మెట్ట పైర్లు సాగు చేసే పరిస్థితి వచ్చింది.

మిరపకు డిమాండ్‌
ప్రస్తుతం మిరప పంటకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. మిరప పంటకున్న «గిట్టుబాటు ధరలకు తోడు మిరప సాగు చేసే భూములకు కౌలు రైతులు అధిక కౌలు ఇచ్చి మరీ తీసుకుండటంతో డిమాండ్‌ పెరిగింది.
ఎకరా కౌలు రూ.38 వేల నుంచి రూ.42వేలు
ప్రస్తుతం కౌలు రైతులు ఏ పంట సాగు చేసుకున్నా సంబంధం లేకుండా ఎకరా కౌలు మాత్రం రూ.38వేల నుంచి రూ.42 వేలు వరకు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మాగాణి సాగుకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. కారణం ధాన్యానికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు కల్పించడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది క్వింటా ధాన్యం పాతవి రూ.2500, కొత్తవి క్వింటా రూ.1700 వరకు ధర పలుకుతున్నాయి.
అపరాలకు గిట్టుబాటు ధర  గతంలో ఎన్నడూ లేని విధంగా అపరాల ధర ఆశాజనకంగా ఉంది. దీంతో మెట్ట పైర్ల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. కారంచేడు ప్రాంతంలో మాగాణి భూముల్లో సైతం మెట్ట పైర్లు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. రైతులు కౌలుకు చేసేందుకు మొగ్గు చూపుతుండటంతో ధరలు కూడా రెట్టింపయ్యాయి. పెద్ద రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. సన్న, చిన్నకారు రైతులు మాత్రం కౌలు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం ఆదుకుంటుందనే ధైర్యం  
గతంతో పోల్చుకుంటే సాగు భూములకు కౌలు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. నేను 15 సంవత్సరాలకు పైగా సాగు చేస్తున్నా. ఇంత ఎక్కువ కౌలు ధరలు చూడలేదు. రైతుల మధ్య పోటీతోనే కౌలు ధరలు పెరుగుతున్నాయి. నేటి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందనే ధైర్యం మాకుంది. ఆ ధైర్యంతోనే ముందుకు సాగుతున్నాం.– అంజమ్మ, కౌలురైతు, ఆదిపూడి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement