కౌలు రైతుకు చేయూత ఏది?  | no help for lease farmers from government | Sakshi
Sakshi News home page

కౌలు రైతుకు చేయూత ఏది? 

Feb 12 2018 5:19 PM | Updated on Feb 12 2018 5:22 PM

no help for lease farmers from government - Sakshi

బజార్‌హత్నూర్‌(బోథ్‌) : ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీరి కోసం చట్టాలున్నా అమలుకాని పరిస్థితి. ప్రభుత్వం ఇటీవల ‘పెట్టు బడి’ సాయం కూడా పట్టాదారుడికే ఇస్తామని ప్రకటించింది. కనీసం రుణ అర్హత కార్డులు సైతం లేక కౌలు రైతులు అప్పుల కోసం తిప్పలు పడుతున్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో అధిక వడ్డీకి ప్రైవేట్‌ వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాలతో పంట నష్టపోతే పరిహారం సైతం భూయజమానికే వస్తుండడంతో కౌలు రైతు అప్పుల ఊబిలోనే కొట్టుమిట్టాడుతున్నాడు.  


ప్రభుత్వం మొండి చేయి  


ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 69వేల మంది కౌలు రైతులు ఉన్నారు. సొంతంగా సాగుభూమి లేకపోవడంతో పట్టదారుల నుంచి భూమిని కౌలుకు తీసుకొని వివిధ పంటలు పండిస్తున్నారు వీరంతా. 2011లో కౌలు రైతుల కోసం రూపొందించిన చట్టం సైతం వారిని ఆదుకోవడం లేదు. కౌలు రైతులను గుర్తించి వారికి రుణ అర్హత కార్డులు ఇవ్వాల్సి ఉండగా జిల్లాలో ఎక్కడ కూడా అలాంటి దాఖలాలు కానరావడం లేదు. బ్యాంకు రుణం పొందాలంటే కౌలు రైతుకు భూయజమాని పత్రం ఇవ్వాల్సి ఉంది. కానీ హామీ పత్రం ఇస్తే ఏం జరుగుతుందో అనే భయంతో పట్టాదారులు వెనుకడుగు వేస్తున్నారు. ఫలితంగా కౌలు రైతులు పెట్టుబడి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మూడేళ్లలో కౌలు ధరలు నాలుగింతలు పెరిగాయి. మూడేళ్ల కింద పత్తి సాగు కోసం ఎకరం చేను రూ.8వేల లోపు ఉండగా ప్రస్తుతం ఆదిలాబాద్‌ జిల్లా తాంసీ, తలమడుగు, జైనథ్, బేల మండలాల్లో ఈ మొత్తం రూ.15వేలు దాటింది. ఎరువులు, పురుగుమందులు, విత్తనాల ధరలు, కూలీల ఖర్చులు రెట్టింపయ్యాయి. పెరిగిన ధరలకు తోడు పండించిన దిగుబడులకు గిట్టుబాటు ధర రాక ఏటా కౌలు రైతులు కష్టాల్లో చిక్కుకుంటున్నారు. 


దరఖాస్తులు బుట్టదాఖలు... 


కౌలు రైతులను గుర్తించి రుణ అర్హత కార్డులును ఇవ్వాలని మూడేళ్ల కిందట ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో 60వేల మంది గుర్తింపు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో అధికారులు వాటిని పక్కన పెట్టేశారు. అప్పులు తెచ్చి భూమిని కౌలుకు తీసుకొని సాగు చేయడం తప్ప సర్కారు నుంచి తమకు ఎలాంటి సహకారం అందడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం స్పందించి రుణ అర్హత కార్డులు ఇవ్వడంతో పాటు పెట్టుబడి సాయం రూ.4వేలు సాగు చేస్తున్న కౌలు రైతులకే అందివ్వాలని కోరుతున్నారు. 


అప్పుల పాలవుతున్నాం.. 


బలన్‌పూర్‌ శివారులో ఇద్దరి పొత్తులో రూ.80వేలకు ఏడెకరాల చేను కౌలుకు తీసుకున్నాం. నాలుగెకరాల్లో పత్తి , మూడెకరాల్లో సోయ పంట వేశాం. కౌలు కాక రూ.1లక్ష 95వేల పెట్టుబడి అయింది. పత్తికి గులాబీరంగు పురుగు సోకి 25 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. సోయా దిగుబడి 18 క్వింటాళ్లు వచ్చింది. పత్తికి రూ.4,700 చొప్పున రూ.1,17,500, సోయకు రూ.2,800 చొప్పున రూ.50,400 రెండు కలిపి రూ.1,67,900 ఆదాయం వచ్చింది. 2,75,000 ఖర్చుచేస్తే 1,07,100 నష్టం వాటిల్లింది. 
తాండ్ర  శ్రీనివాస్, కౌలురైతు, బజార్‌హత్నూర్‌ 

ప్రభుత్వం ఆదుకోవాలి 


ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఎకరానికి రూ.4వేలను కౌలు రైతులకు కూడా ఇవ్వాలి.  ప్రకృతి వైపరిత్యాల వల్ల కౌలు రైతు నష్టపోతే పరిహారం పట్టా రైతులకు ఇస్తున్నారు. కౌలు డబ్బులు తీసుకునే పట్టాదారు సాగుకు దూరంగా ఉంటాడు. పరిహారం కౌలు రైతుకే ఇవ్వాలి. ప్రభుత్వం త్వరగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అందించాలి.  
సంగెపు బొర్రన్న, రైతు స్వరాజ్‌ వేదిక జిల్లా అధ్యక్షుడు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement