భగవంతుడి ఆస్తులకే రక్షణ కరువు
దేవాలయ ఆస్తులకు 30 ఏళ్ల లీజు అనర్ధదాయకం
ఏసీ కార్యాలయం ముట్టడించిన హిందు ధర్మరక్షణ సమితి నాయకులు
స్వల్ప ఉద్రిక్తత, తొక్కిసలాట
రాజమహేంద్రవరం కల్చరల్ : రాష్ట్ర దేవాదాయ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని, భగవంతుడి ఆస్తులకే రక్షణ కరుమైందని హిందు ధర్మరక్షణ సమితి నాయకులు వాపోయారు. హిందు ధర్మరక్షణ సమితి ఆధ్వర్యంలో సీటీఆర్ఐ సమీపంలోని ఏసీ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళానికి చెందిన ఉత్తరాది సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ దేవాదాయ ఆస్తులను దీర్ఘకాలం లీజుకు ఇవ్వడం వలన, వాటిని తిరిగి స్వా«ధీనం చేసుకునేటప్పుడు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని తెలిపారు. అవినీతి చర్యలకు పాల్పడుతున్న సహాయ కమిషనర్ రమేష్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు నుంచి వచ్చిన హిందు ధార్మిక సంస్థల అధ్యక్షుడు కేఏఎస్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విజయవాడలో రోడ్ల విస్తీర్ణత పేరిట 37 దేవాలయాలను కూల్చివేశారని, ఈ ఆలయాలను పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకుండా పోయిందన్నారు. హిందు ధర్మరక్షణసమితి రాష్ట్ర అధ్యక్షుడు గవరయ్య మాట్లాడుతూ దేవాదాయశాఖలో జరుగుతున్న అకృత్యాలను చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. హిందు ధర్మరక్షణ సమితి సభ్యుడు వీవీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేవాలయాల పాలనను ధార్మిక సంస్థలకు అప్పగించాలని కోరారు. ఏసీ కార్యాలయం ఎదుట బైఠాయింంచి, ఏసీ తమ వద్దకు రావాలని నినాదాలు చేశారు. ఏసీ అందుబాటులో లేకపోవడంతో, పోలీసులు వచ్చి, ఆందోళనకారులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో స్వల్ప ఉద్రిక్తత, తొక్కిసలాట చోటు చేసుకున్నాయి.. డీఎస్పీ చంద్రశేఖర్ ఆందోళనకారులతో చర్చించారు. శుక్రవారం ఏసీ ఆందోళనకారులతో మాట్లాడతారని ఆయన తెలిపాక, ఆందోళనకారులు ఉద్యమాన్ని విరమించారు. విజయనగరానికి చెందిన సత్యానంద భారతి, సత్యానందస్వామి, కేతనానందస్వామి, ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.