కౌలు ధరలకు రెక్కలు
ఎకరాకు భూముల వారీగా రూ. 25 వేల నుంచి 50 వేలు
ఖరారవుతున్న ఒప్పందాలు.. ఖరీఫ్‌పై చిగురిస్తున్న ఆశలు
పశ్చిమ డెల్టాలో కౌలు ధరలకు రెక్క లొచ్చాయి. భూముల వారీగా ఎకరాకు రూ.25 వేల నుంచి రూ. 50 వేల వరకు కౌలు ఖరారు చేస్తున్నారు. ఖరీఫ్‌లో పంటల సాగుకు ప్రకృతి అనుకూలిస్తుందన్న భరోసా, అపరాలకు మార్కెట్ ధర ఆశాజనకంగా ఉంటుందన్న విశ్వాసం రైతుల్ని సాగుకు సమాయత్తం చేస్తోంది. ముఖ్యంగా నల్లరేగడి, వాణిజ్య పంటలు పండే మెట్ట భూముల్లో కౌలు రేట్లు హెచ్చుగా ఉంటున్నాయి.
తెనాలి : గత ఏడాది జిల్లాలోని రైతులు ఎన్నడూ లేని విధంగా నష్టాలు చవిచూశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా జలశయాలు వట్టిపోయి పంటల సాగుకు నానా కష్టాలు ఎదుర్కొన్నారు. సాగునీటి కొరత కారణంగా ప్రధానమైన వరి పైరును జిల్లా వ్యాప్తంగా 2.20 లక్షల ఎకరాల్లో సాగుచేయలేకపోయారు. ఈ విస్తీర్ణం సగం పశ్చిమ డెల్టాలోనే ఉంది. అపరాలకు మార్కెట్ ధరలు బాగుండటం రైతులకు కలిసొచ్చింది. పెసర క్వింటాలు రూ.6550-రూ.7600 మధ్య నడిచింది. ప్రస్తుతం రూ.5200 పలుకుతున్నాయి. మినుములు రూ.5800తో ప్రారంభించి, రూ.12,500 వరకు అమ్మకాలు సాగాయి. ఇప్పటికీ రూ.11 వేల వరకు ధర ఉండటం ఆశాజనకంగా ఉంది. ఈ ఏడాది సగటు వర్షపాతానికి మించి వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ సూచనలు రైతుల్లో ఆశావహ దృక్పథానికి దారితీసింది.
భూముల వారీగా ధరలు ఇలా....
ప్రస్తుత పరిస్థితుల మేరకు కౌలు రేట్లు కొంచెం హెచ్చించి ఒప్పందాలు చేసుకుంటున్నారు. మొక్కజొన్న పండే చేలపై వేచిచూసే ధోరణిలో ఉంటూ మినుము/ పెసలుకు అనుకూలమైన నల్లరేగడి భూములకు హెచ్చు ధరను పెడుతున్నారు. ప్రధానంగా అమృతలూరు, చుండూరు మండలాల్లో ఎకరాకు నగదు కౌలు రూ.25-30 వేల వరకు ఖరారు చేసుకుంటున్నారు. చుండూరు మండలం మండూరులో ఇటీవల దేవాలయ భూములు బహిరంగ వేలంలో రూ.33 వేల వరకు పాట పలకటం డిమాండును తెలియజేస్తుంది. కొల్లిపరలో మాగాణి కౌలు ఇంకా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఇక్కడి మెట్ట భూముల్లో కౌలు ధర రూ.45-55 వేలు పలుకుతోందని రైతులు చెబుతున్నారు. పసుపు, అరటి, కంద వేసే చేలల్లో పసుపు ఊట ఎక్కువగా వస్తుందన్న భావన కలిగితే గరిష్టంగా రూ.55 వేల కౌలుకు వెనుకాడటం లేదు. తెనాలి మండలంలో ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. మాగాణికి గరిష్టంగా రూ.25 వేలు, పసుపు పండే మెట్టకయితే రూ.30 వేల వరకు కౌలు ఒప్పందాలు కుదురుతున్నాయి. కూరగాయ పంటలు ఆకుకూరలు సాగుకు అనుకూలమైన చేలల్లో విద్యుత్ మోటారు షెడ్డు ఉంటే ఎకరాకు రూ.50 వేలు, లేకుంటే రూ.45 వేలకు కౌలు చెల్లింపులు ఖరారు చేసుకుంటున్నారు.