పొదుపే పెట్టుబడి
* నయా పైసా ఖర్చు లేకుండానే వీధుల్లో ఎల్ఈడీ దీపాలు
* విద్యుత్ పొదుపుతో మిగిలే నిధులే పెట్టుబడి
* రుణ సాయం, పథకం అవులుకు అంగీకరించిన ఈఈఎస్ఎల్... త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: నయా పైసా ఖర్చు లేకుండానే వీధుల్లో ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతోంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) భాగస్వామ్యంతో పైలట్ ప్రాజెక్టును అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని సంప్రదాయ వీధి దీపాలను తొలగించి తక్కువ విద్యుత్‌తో అధిక వెలుగులు ఇచ్చే ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేయూలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెలైట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 12 నగరాలు, పురపాలక సంస్థలను ఇప్పటికే అధికారులు ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఈ నగరాలు, పట్టణాల్లో నిర్ణీత పరిధిలోని ఓ ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడి పాత వీధి దీపాలను తొలగించి ఎల్ఈడీ దీపాలను అమర్చనున్నారు.
దీనికి రూ.2 కోట్ల నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఎల్ఈడీ దీపాల విద్యుత్ లైన్‌కు ప్రత్యేక మీటర్‌ను బిగించి.. గతంతో పోల్చితే వీటి వినియోగం వల్ల జరిగిన విద్యుత్ పొదుపును ప్రతి నెలా సమీక్షిస్తారు. విద్యుత్ పొదుపునకు అనుగుణంగా కరెంటు చార్జీలూ తగ్గనున్నాయి. ఇలా ప్రతి నెలా పొదుపు చేసే నిధులనే రుణ వారుుదాలుగా ఈఈఎస్ఎల్ సంస్థ స్థానిక నగర/పురపాలక సంస్థల నుంచి స్వీకరించనుంది. మొత్తం పెట్టుబడి తిరిగి వచ్చిన తర్వాత ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగించనుంది.
అప్పటి వరకు ప్రాజెక్టు నిర్వహణను పూర్తిగా ఈఈఎస్ఎల్ పర్యవేక్షిస్తుంది. ఈ మేరకు ఈఈఎస్ఎల్ అధికారులు సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపారు. త్వరలో ఈ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ మేరకు ఒప్పందం చేసుకోనుంది. కేంద్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈఈఎస్ఎల్.. విద్యుత్ పొదుపును ప్రోత్సహించడానికి లాభాపేక్ష లేకుండా ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది. ఇది చేపట్టే ప్రాజెక్టులకు వడ్డీ లేకుండా రుణ సహాయాన్ని అందిస్తోంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే విడతల వారీగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ ప్రాజెక్టును ఇదే తరహాలో అమలు చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నెల 9న మేయుర్లు, చైర్మన్లతో భేటీ
ఎల్ఈడీ వీధి దీపాల పెలైట్ ప్రాజెక్టు కింద ఎంపికైన నగరాలు, పట్టణాల మేయర్లు, చైర్మన్లు, కమిషనర్లతో ఈఈఎస్ఎల్ అధికారులు ఈ నెల 9న పురపాలక శాఖ కమిషనరేట్ కార్యాలయంలో సమావేశం కానున్నారు. ప్రాజెక్టు అమలు చేయనున్న ప్రాంతంలో గత ఏడాది కాలంలో వినియోగించిన విద్యుత్‌కు సంబంధించిన బిల్లులతో ఈ సమావేశానికి హాజరు కావాలని సంబంధిత కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.