కాన్వాయ్ వద్దని.. బస్సులో వెళ్లిన ప్రధాని
సింగపూర్ దేశంలో వ్యక్తిగత వాహనాల కంటే ప్రజారవాణా చాలా ఎక్కువ. అక్కడ వ్యక్తిగత వాహనాలు ఉపయోగించడానికి ఉండే అవకాశం చాలా తక్కువ. అందుకేనేమో.. ఆ దేశ ప్రధానమంత్రి లీ సైన్ లూంగ్ భారతదేశంలో ఐదు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చినా.. ఆయన తన కోసం కేటాయించిన భారీ వీఐపీ కాన్వాయ్ వద్దని.. ఒక ప్రత్యేక బస్సులో తాను బస చేయాల్సిన హోటల్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయనను స్వాగతించేందుకు వచ్చిన అధికారులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఐదు రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా లూన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు నేతలతో సమావేశమై చర్చలు జరుపుతారు. ప్రధానంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల గురించి ఈ చర్చలు ఉంటాయని అంటున్నారు. పలు ఒప్పందాలపై కూడా ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో సంతకాలు జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఉన్న సింగపూర్ వాసుల గౌరవార్థం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏర్పాటుచేసే విందులో కూడా సింగపూర్ ప్రధాని పాల్గొంటారు. లూంగ్‌తో పాటు ఆయన భార్య హో షింగ్, పలువురు కీలక మంత్రులు, సీనియర్ అధికారులు వచ్చారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కూడా ఈనెల 5, 6 తేదీలలో సింగపూర్ ప్రధాని పర్యటిస్తారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఆయనకు విందు ఇవ్వనున్నారు.