విశాఖలో రూ.75 కోట్లతో లీ ఫార్మా యూనిట్
కంపెనీ వ్యవస్థాపకులు ఎ.వెంకటరెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగంలో ఉన్న లీ ఫార్మా విశాఖ జిల్లా అచ్యుతాపురం వద్ద రూ.75 కోట్లతో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. 2016 జూన్‌కల్లా ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే సంస్థకు హైదరాబాద్‌లో 2, విశాఖలో 1 యూనిట్ ఉంది. యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్, ఇంటర్మీడియేట్స్, పెల్లెట్స్, గ్రాన్యూల్స్‌ను తయారు చేస్తోంది. ఈ ఉత్పత్తులను 48 దేశాలకు ఎగుమతి చేస్తోంది. మైలాన్, డాక్టర్ రెడ్డీస్, ర్యాన్‌బాక్సీ, ఇంటాస్, టెవా, గ్లెన్‌మార్క్, టోరెంట్ వంటి కంపెనీలు క్లయింట్లుగా ఉన్నాయి.
టర్నోవరు రూ.200 కోట్లుంది. వచ్చే ఏడాది ఫినిష్డ్ ప్రొడక్ట్స్ విభాగంలోకి ప్రవేశిస్తామని లీ ఫార్మా ఫౌండర్ ఎ.వెంకటరెడ్డి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఫినిష్డ్ ప్రొడక్టులను యూఎస్ మార్కెట్లోనూ విడుదల చేస్తామని పేర్కొన్నారు. బ్యాక్టీరియాను ఎదుర్కొనే ‘లెనోజిలైడ్’ అనే ఔషధాన్ని నూతన విధానంలో కనుగొన్నామని చెప్పారు. దీనికి యూరప్ పేటెంట్ పొందామని వివరించారు. ఇతర దేశాల్లోనూ ఔషధాన్ని నమోదు చేస్తామని చెప్పారు. పెద్ద బ్రాండ్లతో పోలిస్తే 25 శాతం ధరకే ఈ మందును విక్రయిస్తామని తెలిపారు.