వెరీ బోల్డ్!
రాధికా ఆప్టే దక్షిణాది ప్రేక్షకులకు పక్కా హోమ్లీ హీరోయిన్‌గానే తెలుసు. కానీ, ఉత్తరాది ప్రేక్షకులకు ఆమెలో మరో కోణం కూడా తెలుసు. షార్ట్ ఫిల్మ్ ‘అహల్య’ కోసం హాట్‌గా నటించడం, ఆ మధ్య విడుదలైన ‘బద్లాపూర్’లోనూ మొహమాటపడకుండా గ్లామరస్‌గా నటించడం ద్వారా హాట్ టాపిక్‌గా మారారు. ఇప్పుడు ‘పార్ష్డ్’ అనే హిందీ చిత్రంలో ఓ అడుగు ముందుకేశారు. లీనా యాదవ్ దర్శకత్వంలో హీరో అజయ్ దేవగన్ నిర్మించిన ఈ చిత్రం ఇంకా మన దేశంలో విడుదల కాలేదు.
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై అందరి మన్ననలు అందుకుంది. యూఎస్, ఫ్రాన్స్‌లో చిత్రం విడుదలైంది. ఇందులో ఆదిల్ హుస్సేన్, రాధికా ఆప్టేలకు సంబంధించిన రొమాంటిక్ సీన్ తాలూకు ఫొటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ ఫొటోలో రాధిక టాప్‌లెస్‌గా కనిపించడం చర్చనీయాంశమైంది. ‘‘ఈ ఫొటో ఎలా బయటికొచ్చిందో అర్థం కావడంలేదు. యూఎస్, ఫ్రాన్స్‌లో విడుదలైంది కాబట్టి, అక్కడి వాళ్లెవరైనా బయటపెట్టి ఉంటారనుకుంటున్నా. ఇంటర్నెట్లో ఫొటోలు వేగంగా దూసుకెళుతున్నాయి.
వాటిని తీయించేయమని సైబర్ సెల్‌ని కోరాను’’ అని చిత్రనిర్మాతల్లో ఒకరైన అసీమ్ బజాజ్ అన్నారు. ఏదేమైనా కథను నమ్మితే రాధిక వెనకాడకుండా బోల్డ్ సీన్స్‌లో నటిస్తారని స్పష్టమవుతోంది. ఆమె నటన అభ్యంతరకరంగా ఏమీ లేదనీ, చాలా అద్భుతంగా చేసిందని విదేశాల్లో సినిమా చూసినవాళ్లు కితాబులిస్తున్నారు. ఇందులో రాధిక మద్యానికి బానిస అయిన భర్త పెట్టే చిత్రహింసలకు గురయ్యే అమ్మాయిగా నటించారు. ‘పార్ష్డ్’ అంటే.. దాహం అని ఓ అర్థం. ఆత్మీయ స్పర్శ కోసం ఆరాటపడే అమ్మాయి పాత్రను రాధిక చేశారు.