ప్రతి అడుగులో.. కొత్తదనం
ఎస్పీబీఎంతో మహానగరానికి కొత్త హంగులు
ఉద్యోగుల సహకారంతో జనానికి మెరుగైన సేవ
వారంలో రెండు రోజులు పాతబస్తీ వాసుల కోసమే
సాక్షి ఇంటర్వూ ్యలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
సాక్షి, సిటీబ్యూరో ప్రతినిధి : ‘అనేక ఆశలు, ఆకాంక్షలు, సమస్యలు, సవాళ్లు నేడు హైదరాబాద్ జనం మదిలో మెదిలే ప్రధాన అంశాలు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత ముందుకు తీసుకువెళ్లే దిశగా కేసీఆర్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అన్నింటా కృషి చేస్తుంది. ప్రతి అడుగులో అభివృద్ధి, సంక్షేమంతో కూడిన కొత్తదనం నింపుతూ రేపటి భవిష్యత్తుకు బాటలు వేస్తాం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ చెప్పారు.
తెలంగాణ తొలి ప్రభుత్వంలో కీలక రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖల మంత్రిగా నియమితులైన మహమూద్ గురువారం సాక్షి ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రేపటి హైదరాబాద్ కోసం తమ ప్రభుత్వం చేపట్టబోయే పథకాలు, తమ ముందున్న లక్ష్యాలు, సవాళ్లను ఆయన వివరించారు.
అవేంటో ఆయన మాటల్లోనే..
హైదరాబాద్‌కు సరికొత్త ఇమేజ్ తెస్తాం హైదరాబాద్‌కు ప్రపంచ చిత్రపటంలో ఇప్పటికే ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వం కలిగిన అతికొద్ది నగరాల్లో భాగ్యనగరి అగ్రభాగంలో ఉంది. అయితే ఇక్కడ స్థిరపడుతున్న వారి సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో 1930వ దశకంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వరంలో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు ద్వారా ఏర్పాటు చేసిన రహదారులు, నాలాలు, మంచినీటి పైపులైన్లే ఇప్పటికీ పెద్ద దిక్కు.
శివార్లలో అయితే మంచినీరు, రహదారి, వీధిలైట్ల పరిస్థితి తక్షణం మెరుగవ్వాల్సి ఉంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో హైదరాబాద్‌కు సరికొత్త ఇమేజ్ తెచ్చే దిశగా కార్యాచరణ మొదలైంది. నగర మంత్రిగా నాకూ ఆ కార్యాచరణలో భాగం పంచుకునే అవకాశం దక్కింది. రోడ్లు, మంచినీరు, విద్యుత్, పక్కా ఇళ్ల (సడక్, పానీ, బిజిలీ, మకాన్- ఎస్పీబీఎం)పై దృష్టి సారించి నగరాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం.
సత్వర సేవలకు యాక్షన్‌ప్లాన్
రెవెన్యూ శాఖతో పాటు మహానగర పరిధిలో అన్నింటా పౌరులు, పారిశ్రామికవేత్తలకు సత్వర సేవలు అందించేందుకు ప్రత్యేక యాక్షన్‌ప్లాన్‌ను ప్రభుత్వం రూపొందించబోతోంది. ఉదాహరణకు నేను ఇటీవల సింగపూర్‌కు వెళ్లినప్పుడు 21 అంతస్తుల భవన నిర్మాణానికి గంటల్లో అన్ని అనుమతులు వచ్చేశాయి. మన హైదరాబాద్‌లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. అలాగే నూతన పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ పలు అవాంతరాలున్నాయి.
ఇక ముందు సత్వర సేవలను అందించేదుకు కేసీఆర్ ప్రభుత్వం వినూత్న ప్రణాళికలను ముందుకు తేబోతుంది. అయితే కొత్తగా ఏర్పాటైన కొత్త రాష్ట్రం అన్నింటా ముందుకు వెళ్లాలంటే అంతటా బాధ్యతాయుతమైన వాతావరణం ఉండాలి. అందుకే నగరాభివృద్ధిలో కీలకమైన ఉద్యోగులు, సిబ్బందిని మేము మా కుటుంబసభ్యులుగానే భావిస్తూ వారితో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాం. ఇటీవల సీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశంలోనూ రెండు కోట్ల జనానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రణాళిక రూపొందించమని అధికారులను ఆదేశించ డం జరిగింది.
ప్రభుత్వ భూముల పరిరక్షణే లక్ష్యం
నిజాం నవాబు.. నగరంలోని వేల ఎకరాల భూములు, భవంతులు అప్పటి ప్రభుత్వానికి అప్పగించారు. ఆ భూములు, భవనాలు ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకుని, వాటిని ప్రజా అవసరాలకు వినియోగించడం, మిగిలిన వాటిని పరిరక్షించడం చేయాలన్నది మా లక్ష్యం. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదు. న్యాయ వివాదాల్లో ఉన్న భూముల వివరాలు తెలుసుకుని ఉన్నత న్యాయస్థానాలకు అప్పీళ్లు వేస్తాం. మహానగర పరిధిలో రెవెన్యూ శాఖలో జవాబుదారీతనం, పారదర్శకత, సత్వర సేవల కోసం యంత్రాంగాన్ని సన్నద్ధం చేసి వీలైనంత త్వరలో లోపాలు లేని సుపరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.
ప్రజలకు అందుబాటులో ఉంటా..
పద్నాలుగా సంవత్సరాల పోరాటం అనంతరం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రంలోనూ ప్రజలు కోరుకున్న ప్రభుత్వమే కొలువుదీరింది. ఇంతటితో ప్రజల పని అయిపోయింది. మేమిక వారి సంక్షేమం, అభివృద్ధి చూసుకోవాలి. అధికారం వచ్చింది కదా అని ప్రజలకు దూరం వెళ్లాలనుకోవటం లేదు. సౌభ్రాతృత్వం - సమానత్వం, దాపరికం లేని పరిపాలన అనే ఎజెండాతో మహానగర ప్రజలకు నేను నిత్యం అందుబాటులో ఉంటా. ఈ ఆదివారం బాధ్యతలు తీసుకుంటా. అధికారులతో సమావేశాలు, సమీక్షల సమయం మినహాయిస్తే మిగిలిన సమయమంతా నగర ప్రజలకే కేటాయిస్తాం. శని, ఆదివారాల్లో అయితే ఆజంపురాలోనే పాతనగర వాసుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తాం.