Legal Service Authority
-
1,518 సివిల్ కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టుల్లో 1,518 సివిల్ కేసుల పరిష్కారమయ్యాయి. బాధితులకు రూ.24,70,81,376 నష్ట పరిహారం అందజేశారు. నగరంలోని సివిల్ కోర్టులలో మొత్తం పది బెంచీలు ఏర్పాటు చేసి ఆదివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించినట్లు సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి , జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్ రేణుకా యారా తెలిపారు. ఈ సందర్భంగా 324 మోటార్ ప్రమాదం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కేసులను కూడా పరిష్కరించామని, బాధితులకు రూ.21 కోట్ల నష్టపరిహారాన్ని అందజేశామని వివరించారు. పర్మినెంట్ లోక్ అదాలత్‌లోని ప్రజా సేవల రంగంలోని ప్రీలిటిగేషన్ కేసులు, 1,092 ఎస్బీఐ బ్యాంక్ కేసులను కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో రేణుక యారా మాట్లాడుతూ.. కాలయాపన లేకుండా సత్వర న్యాయం పొందటం కేవలం లోకదాలత్ లోనే సాధ్యమవుతుందన్నారు. కక్షిదారులు ఇలాంటి జాతీయ లోక్ అదాలత్‌లో తమ కేసుల సత్వర పరిష్కారానికి ముందుకు రావాలని సూచించారు. రెండవ అదనపు చీఫ్ జడ్జి కె ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. లోక్ అదాలత్ తీర్పుకు అప్పీలు ఉండదని, అంతేకాక అది శాశ్వత పరిష్కారం అవుతుందని వివరించారు. న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.మురళీమోహన్ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ లో పరిష్కారమైన సివిల్ కేసులలో కక్షిదారులకు వారు చెల్లించిన కోర్టు ఫీజు వాపసు చెల్లిస్తారన్నారు. బార్ అసోసియేషన్ నూతన కార్యదర్శి నాగభూషణం, మాట్లాడారు. సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ న్యాయస్థానంలోని లోక్ అదాలత్ బెంచ్‌లకు చీఫ్ జడ్జి రేణుకా యారా, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జి నిర్మల గీతాంబ, రెండవ అదనపు చీఫ్ జడ్జ్ కె ప్రభాకర్ రావు, అదనపు జిల్లా న్యాయమూర్తులు ఉమాదేవి, అపర్ణ , సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ మహి, జూనియర్ సివిల్ జడ్జి అరుణ్ కుమార్ తదితరులు నేతృత్వం వహించగా.. సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టులో అదనపు చీఫ్ జడ్జి జీవన్ కుమార్ నేతృత్వం వహించారు. రాచకొండలో 99,476 కేసుల పరిష్కారం రాచకొండ కమిషరేట్ పరిధిలో పెండింగ్ లో ఉన్న 99,476 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో..93,930 కేసులు డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కేసులు కాగా..3,293 కేసులు ఐపీసీ కేసులు, 2.253 డ్రంకెన్ డ్రైవ్ కేసులు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా సెషన్స్ జడ్జి సీ హరే కృష్ణ భూపతి, రంగారెడ్డి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ) సెక్రటరీ ఏ శ్రీదేవి, యాదాద్రి జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి వీ బాల భాస్కర్ రావులు లోక్ అదాలత్ లను నిర్వహించి కేసులను పరిష్కరించారు. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, అదనపు సిపి జీ సుధీర్ బాబు తదితర పోలీస్ అధికారులు పాల్గొని లోక్ అదాలత్ నిర్వహణను పర్యవేక్షించారు. (చదవండి: మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లపై ఆంక్షలు) -
పర్యావరణ ప్రమాణాలు కాపాడాలి
ముత్తుకూరు : తీరప్రాంతంలోని థర్మల్ విద్యుత ప్రాజెక్టులు పర్యావరణ ప్రమాణాలు పాటించడం ద్వారా ప్రజలు, జీవరాసులు జీవించే హక్కు కాపాడాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, జడ్జి ఎం.రామకృష్ణ అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మునుకూరు రామచంద్రారెడ్డి, సీనియర్ న్యాయవాదులతో కలసి ఆదివారం నేలటూరులోని ఏపీజెన్కో విద్యుత్ ప్రాజెక్టు, దాని యాష్‌పాండ్, పైనాపురంలోని టీపీసీఐఎల్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం ముసునూరువారిపాళెంలో మునుకూరు జనార్దనరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వ్యర్థ జలాలు విడుదల చేసి జలవనరులు పాడైపోకుండా చూడాలన్నారు. కాలుష్యం వ్యాపించకుండా పెద్ద ఎత్తున మొక్కలు పెంచాలన్నారు. భూములుకోల్పోయిన రైతు కుటుంబాలకు సకాలంలో పరిహారం ఇవ్వడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. 20 ఏళ్ల క్రితం సేకరించిన భూములకు సంబంధించిన పరిహారం కోర్టులో ఉందన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ చొరవ తీసుకుని, బాధిత రైతులకు వెంటనే పరిహారం దక్కేలా కృషి చేయాలన్నా రు. తమ పరిధిలో రైతు కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. టీపీసీఐఎల్ యాష్‌పాండ్ చూపనేలేదు టీపీసీఐల్ పవర్ ప్రాజెక్టు నిర్వాహకులు తమకు యాష్‌పాండ్ చూపించనేలేదని సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి ఈ సమావేశంలో మం డిపడ్డారు. గ్రామాల సమీపంలో ఉన్న జెన్కో యాష్‌పాండ్‌ను మరోచోట మార్చాలని డిమాండ్ చేశారు. మొక్కల పెంపకం సక్రమంగా లేదన్నారు. ఉద్యోగాల కల్పనలో స్థానికులకు అవకాశం కల్పిస్తూ, రిజర్వేషన్లు పాటించాలని ప్రాజెక్టుల నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తరచూ ప్రాజెక్టుల్లో కాలుష్యం వ్యాపించకుండా తనిఖీలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎన్.శ్రీనివాసులురెడ్డి, అబ్బయ్యరెడ్డి, రామిరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ సభ్యులు, మాజీ సర్పంచ్ ఈపూరు శేషారెడ్డి పాల్గొన్నారు. -
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
గజ్వేల్: బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని లీగల్ సర్వీస్ అథారిటీ జిల్లా కార్యదర్శి కనకదుర్గ పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో బాలల న్యాయ సలహా కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాలబాలికలు హింసకు గురికాకుండా ఈ కేంద్రం ద్వారా భద్రత కల్పిస్తామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారు కేంద్రాన్ని సందర్శించి న్యాయాన్ని పొందాలని సూచించారు. లీగల్ సెల్ అథారిటీ, జడ్జి, పోలీసుల సమన్వయంతో కేంద్రం పనిచేస్తుందన్నారు. రైతు ఆత్మహత్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. క్షణికావేశంలో రైతులు ఆత్మహత్యల బారిన పడుతున్నారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు లీగల్ సర్వీస్ అథారీటీ అండగా ఉంటుందన్నారు. ఎవరైనా నేరుగా వచ్చి సమస్యలను చెప్పుకోవచ్చని తెలిపారు. సమావేశంలో గజ్వేల్ సీఐ అమృతరెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎస్ఐ జార్జి, ఎస్ఐ-2 స్వామి, నగర పంచాయతీ కౌన్సిలర్లు నరేందర్‌రావు, బోస్, శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు నారాయణరెడ్డి, ఆకుల దేవేందర్, రామచంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. బాల్యవివాహలు చేస్తే చట్ట ప్రకారం చర్యలు జగదేవ్‌పూర్: ప్రస్తుత సమాజంలో ఆడపిల్లలంటే అందరూ చిన్నచూపు చూస్తున్నారని, దేశం ఎంత ప్రగతి సాధించినా సామాజిక రుగ్మతలు కొనసాగుతున్నయని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కనకదుర్గ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలో ఐసీడీఎస్ అధ్వర్యంలో జరిగిన బేటీ బచావో-బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కనకదుర్గ మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు బాలికల నిష్పత్తి తగ్గుతోందన్నారు. తప్పుడు భావనలే ఇందుకు మూలమన్నారు. ఆడపిల్ల పుట్టక ముందే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారన్నారు. దీనిని ఆరికట్టడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఆడపిల్లల రక్షణ కోసమే ప్రభుత్వాలు ఆడపిల్లను బతికిద్దాం..ఆడపిల్లను చదవిద్దాం అనే పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పేదరికం వల్ల గ్రామాల్లో బాలికలను బడికి పంపకుండా, చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేస్తున్నారన్నారు. బాల్యవివాహాలు చేసినా, లింగవివక్షకు పాల్పడినా చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. బాలల హక్కులను సంరించేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. చదువుతోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. అందుకే ఆడ మగ తేడా లేకుండా తల్లిదండ్రులు చదివించాలని సూచించారు. కార్యక్రమంలో గజ్వేల్ జూనియర్ సివిల్ జడ్జి సంతోష్‌కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాస్కర్, ఎస్ఐ వీరన్న, డిసిఎ రత్నం, ఐసిడిఎస్ అధికారి విమల, అంగన్వాడి మండల సూపర్వైజర్లు వర్దనమ్మ, రమణ, జెడ్పీటీసీ రాంచ్రందం, తహశీల్దార్ శ్రీనివాసులు, సర్పంచ్ కరుణకర్, ఎంఈఓ సుగుణకర్‌రావు, ఎంపీటీసీలు వెంకటయ్య, బాలేషం, అన్ని గ్రామాల అంగన్వాడి కర్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.