అపురూప చిత్రాల నిర్మాత అస్తమయం
శంకరాభరణం, సాగరసంగమం, సీతాకోక చిలుక, సితార, స్వాతిముత్యం, స్వయం కృషి ఇలాంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలను వెండితెర మీద ఆవిష్కరించిన సాహసి ఆయన. ఆర్ట్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు వేరు వేరుగా ఉంటాయన్న అపవాదును చెరిపేస్తూ మంచి కథాబలం ఉన్న సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని నిరూపించిన నిర్మాత. కథ కోసం హీరోలు కావాలి గాని, హీరోల కోసం కథలు రాయకూడదని నమ్మిన అసలుసిసలు సినీ జ్ఞాని. ముప్పై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో కేవలం పది చిత్రాలను మాత్రమే నిర్మించినా.. వేయ్యేళ్ల పాటు చెరగని కీర్తి సంపాదించుకున్న సినీ శిఖరం. ఆ మహోన్నత వ్యక్తే పూర్ణోదయ బ్యానర్ పై ఎన్నో కళాత్మక చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు.
నటుడు కావాలన్న ఆలోచనతో కాలేజీ రోజుల్లోనే నాటకాలు వేసిన నాగేశ్వరరావు, సినీ రంగంలో అడుగుపెట్టి 25కు పైగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు. ఆ తరువాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొంత మంది నటులకు గాత్ర దానం చేశారు. 'నేను చిన్నతనం నుంచి విలువల కోసమే బతికాను. ఆ విలువలతోనే సినిమాలు నిర్మిస్తున్నాను` అన్న ఏడిద నాగేశ్వరరావు సినీ నిర్మాణం వ్యాపారాత్మకంగా మారిన తరువాత సినిమాలకు దూరమయ్యారు.
ఏడిద నాగేశ్వరరావు 1934 ఏప్రిల్ 24 న తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో జన్మించారు. సత్తిరాజు నాయుడు, పాపలక్ష్మీ ఆయన తల్లిదండ్రులు. కాలేజీ రోజుల నుంచే నాటకాలు వేయటం ప్రారంభించిన నాగేశ్వరావు తరువాత సినీ రంగం వైపు అడుగులు వేశారు. అదే సమయంలో ప్రముక దర్శక నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి కళా ప్రపూర్ణ రాఘవ కళా సమితిని స్థాపించి ఎన్నో నాటకాలను ప్రదర్శించారు. ఇలా నాటకరంగంలో ఆయనకు ఉన్న అనుభవమే తరువాత సినీ రంగంలో ఉపయోగపడింది. అలా నాటకాలలో ఉన్న అనుభవం వల్ల సినిమాల్లో నటించేందుకు మద్రాసు చేరారు నాగేశ్వరరావు. అయితే అనుకున్నట్టుగా ఆయనకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. తిరిగి ఊరు వెళ్లి మొహం చూపించే పరిస్థితి లేదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో ఆల్ ఇండియా రేడియో లో ఏగ్రేడ్ ఆర్టిస్ట్ గా ఆడిషన్ లభించింది. తరువాత ఆ సర్టిఫికేట్ తోనే సినీరంగంలోకి అడుగుపెట్టారు.
ఆ తరువాత కొంత కాలం డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, అనంతరం నటుడిగా కొనసాగారు. అయినా ఏదో వెలితి. సినిమా రంగంలోనే ఇంకా ఏదో సాధించాలనే ఆశయంతో నలుగురు మిత్రలతో కలిసి తమిళ సినిమాలను అనువాదం చేసి రిలీజ్ చేయటం ప్రారంభించారు. అలా నిర్మాతగా మారారు ఏడిద నాగేశ్వరరావు. మరికొంత మంది మిత్రులతో కలిసి కె.విశ్వనాధ్ దర్శకత్వంలో తొలి ప్రయత్నంగా సిరిసిరిమువ్వ సినిమాను నిర్మించారు. తొలి సినిమాతోనే సంచలన విజయం సాదించారు. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. శంకరాభరణం, సీతాకోకచిలుక, సాగరసంగమం, సితార, స్వాతిముత్యం, స్వయంకృషి, ఆపద్బాంవుడు ప్రతి సినిమా ఓ సంచలనం. మరే నిర్మాత తాకడానికి కూడా సాహసం చేయని ప్రయోగాత్మక కథలు.. అయినా అన్ని సినిమాలు కమర్షియల్ సక్సెస్ లు.. అందుకే ఆయన ప్రస్థానం తెలుగు సినిమా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం.
ఏడాది నాగేశ్వరావు ఈ రోజు (ఆదివారం కన్నుమూశారు) భౌతికంగా దూరమైనా ఆయన గత 17 ఏళ్లుగా తెలుగు సినిమాకు దూరంగానే ఉంటూ వస్తున్నారు. కళాత్మకంగా ఉండాల్సిన సినిమా వ్యాపారంగా మారిన తరువాత ఆయన సినిమాలు తీయడం మానేశారు. అయితే ఆయన చేసిన పది సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో పది అపూర్వఘట్టాలు.. కళాత్మక సినిమా నిర్మించే అభిరుచి మాత్రమే కాదు సాహసం కూడా ఉన్న ఏడిద నాగేశ్వరరావు లాంటి నిర్మాతలు మళ్లీ వస్తారని ఆశించటం కూడా అత్యాశే అవుతుందేమో.. తెలుగు సినీ అభిమానుల కోసం అపురూప చిత్ర రాజాలను అందించిన ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం.