సభాపతులు అమ్ముడుపోయారు!
శాసనమండలి ప్రతిపక్ష నేత రామచంద్రయ్య
సాక్షి, అమరావతి: పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో చట్టసభలను కాపాడే బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్స్‌పై ఉందని, కానీ సభాపతులు అమ్ముడుపోయారని శాసనమండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడుతూ... ఒక పార్టీ టిక్కెట్‌పై ఎన్నుకు న్న ప్రజాప్రతినిధులు వేరే పార్టీకి కేటాయించిన సీట్లలో కూర్చుంటే ఆహ్వానిస్తున్నా రని, ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేశారని చెప్పారు.
ఏపీలో ఉండే చట్టసభల్లో ఇద్దరు ప్రిసైడింగ్ అధికారులు వినీవిననట్లు ఉంటున్నారని, ఇది తప్పని ప్రతిపక్ష నాయకునిగా తాను చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్టెన్షన్లు వస్తాయని దిగజారుడుతనంతో ప్రజాస్వామ్యాన్ని సర్వనాశనం చేస్తున్నారన్నారు. ప్రిసైడింగ్ అధికారి నిర్ణయాలను ఎన్నికల కమిషన్ కాని, పార్లమెంటరీ కమిటీ కాని రివ్యూ చేసే అధికారాలు ఇవ్వాలని పార్లమెంట్ స్పీకర్‌కు, రాష్ట్రపతికి లేఖ రాస్తున్నామన్నారు.