ఖాళీ చేయండి
లెనిన్సెంటర్లోని షాపుల యజమానులకు నోటీసులు
కాలువగట్ల సుందరీకరణలో భాగమే..
{పత్యామ్నాయం చూపాలంటున్న వ్యాపారులు
చేతులెత్తేసిన ప్రజాప్రతినిధులు
విజయవాడ సెంట్రల్ : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్న చందంగా తయారైంది చిరు వ్యాపారుల పరిస్థితి. నగర సుందరీకరణలో భాగంగా కాల్వగట్ల పక్కన ఆక్రమణల తొలగింపుపై అధికారులు దృష్టిసారించారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని బందరు, ఏలూరు, రైవస్ కాల్వగట్లపై ఆక్రమణల్ని ఖాళీ చేయాల్సిందిగా ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. ఈ పరిణామాలతో ఏళ్ల తరబడి అక్కడ వ్యాపారాలు చేస్తున్నవారు బెంబేలెత్తిపోతున్నారు. లెనిన్ సెంటర్లో కాల్వగట్టుపై 46 వస్త్ర దుకాణ షాపులు, 34 పుస్తకాల దుకాణాలతో పాటు మరో 30కిపైగా చెప్పులు, వెల్డింగ్, మోటారు రిపేరింగ్ వర్క్స్ వంటివి ఉన్నాయి. ఉన్న పళంగా వీటిని తొలగించాల్సిందిగా ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అకస్మాత్తుగా ఖాళీ చేయమనడంతో లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేస్తున్నవారు భవిష్యత్ అర్థంకాక ఆందోళన చెందుతున్నారు.
ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు
ప్రత్యామ్నాయ స్థలాలు చూపకుండా తమను ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తామని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే వాదనతో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ పొట్టకొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలోనే తాము నోటీసులు జారీ చేస్తున్నామని అధికారులు స్పష్టం చేయడంతో ఏం చేయాలో పాలుపోక ప్రజాప్రతినిధులు కంగుతింటున్నారు. ప్రస్తుతం నోటీసులే వచ్చాయి కాబట్టి వేచిచూద్దామనే ధోరణిలో వ్యాపారులు ఉన్నారు. పరిస్థితి చేయి దాటితే ఆందోళనకు సన్నద్ధం కావాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఖాళీ చేయాల్సిందే : ఇరిగేషన్ ఎస్ఈ
నగర సుందరీకరణలో భాగంగా కాల్వగట్లపై ఆక్రమణల్ని తొలగించమని ప్రభుత్వం ఆదేశించిందని, అందుకే నోటీసులు ఇచ్చామని ఇరిగేషన్ ఎస్ఈ సీహెచ్ రామకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఆక్రమణలు ఎలా వచ్చాయనేది తనకు తెలియదని, నోటీసులు అందుకున్న వ్యాపారులు ఖాళీ చేయాల్సిందేనని చెప్పారు.