ఆయుధ’ చిక్కులు!
విస్తరిస్తున్న నయా కల్చర్
ఆయుధ పూజలో లెసైన్స్డ్ వెపన్స్‌తో కాల్పులు
తెలిసీ తెలియక చట్టం ఉల్లంఘన
సుమోటో కేసుకు అవకాశం ఉన్నా పట్టని వైనం
మంత్రి, ఎంపీ వివాదాల్ని పరిశీలిస్తున్నాం: కాప్స్
సిటీబ్యూరో:దసరా నేపథ్యంలో చేసే ఆయుధ పూజ కొత్త సంస్కృతికి నాంది పలుకుతోంది. తెలిసీ తెలియక ఆయుధ చట్టాన్ని ఉల్లంఘిస్తూ సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులూ వివాదాలకు కేంద్ర బిందువులు అవుతున్నారు. గత బుధవారం జరిగిన ఆయుధ పూజ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్‌లో, మహబూబ్‌నగర్ ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఆయుధాలు ప్రదర్శించడం, గాల్లోకి కాల్పులు జరిపారంటూ కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వివాదాస్పమైన ఈ రెండు అంశాలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.
పూర్తి బాధ్యుడు లెసైన్స్ హోల్డరే...
ఓ వ్యక్తికి పొంచి ఉన్న ముప్పు, నిర్వహించే వ్యాపార లావాదేవీలను పరిగణలోకి తీసుకున్న తరువాతే పోలీసు విభాగం ఆయుధ లెసైన్సు మంజూరు చేస్తుంది. సాధారణంగా నేర చరిత్ర, దుందుడుకు స్వభావం ఉన్న వారికి మంజూరు చేయరు. లెసైన్స్ పొంది ఆయుధాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి దాని పూర్తి రక్షణకు బాధ్యుడు అవుతాడు. లెసైన్స్ హోల్డర్‌కు చెందిన తుపాకీని మరో వ్యక్తి నిర్వహించడం, చేత్తో పట్టుకుని సంచరించడం ఆయుధ చట్టం ప్రకారం నేరాలే. దీనికి ఆ ఆయుధాన్ని పట్టుకున్న వ్యక్తితో పాటు లెసైన్స్ కలిగిన వ్యక్తి బాధ్యుడు అవుతాడు.
ప్రాణహాని ఉంటేనే కాల్పులు...
లెసైన్స్ హోల్డర్ కేవలం తనకు ప్రాణహాని ఉన్న సందర్భాల్లో మాత్రమే తుపాకీని వినియోగించి కాల్పులు జరపాల్సి ఉంటుంది. సరదా కోసమో, ఆర్భాటంలో భాగంగానో, ఆనవాయితీ పేరుతోనో కాల్పులకు దిగడం చట్ట ప్రకారం నేరమే. లెసైన్స్ హోల్డర్ ఖరీదు చేసే, ఖర్చు పెట్టే ప్రతి తూటాకీ కచ్చితంగా లెక్కచెప్పాలి. ప్రతి ఏటా పోలీసులు చేసే ఆడిట్‌తో పాటు లెసైన్స్ రెన్యూవల్ సమయంలో ఈ వివరాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. అధికారులు ఈ వ్యవహారాల్లో ఏమాత్రం అనుమానాస్పదంగా ఉన్నవి గుర్తించినా రెన్యూవల్ చేయకుండా లెసైన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. ఆయుధ పూజ నేపథ్యంలో కొందరు తమ ఆయుధాలను ప్రదర్శిస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారు. ఇలా ప్రదర్శించడం చట్ట ప్రకారం తప్పు కాకపోయినప్పటకీ వారితో పాటు వారి సంబంధీకులూ ఆ ఆయుధాలను చేతపట్టుకోవడం మాత్రం ఉల్లంఘన కిందికే వస్తుంది.
సుమోటో కేసుకీ అవకాశం...
అకారణంగా ఆయుధాన్ని వినియోగించడం, ఎదుటి వారిని భయభ్రాంతులకు గురి చేయడం, అవసరం లేకుండా కాల్పులు జరపడం ఇవన్నీ ఆయుధ చట్టం ఉల్లంఘనల కిందికే వస్తాయి. ఈ తరహా ఉదంతాలు జరిగినప్పుడు పోలీసులు ఫిర్యాదుతో సంబంధం లేకుండా సుమోటోగా కేసు నమోదు చేస్తారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు నోటీసులు జారీ చేసి..అవసరమైతే లెసైన్స్ సైతం రద్దు చేస్తారు. గతంలో సికింద్రాబాద్‌లోని ఓ పత్రిక కార్యాలయం వద్ద హల్చల్ చేసిన సిటీ నటుడు, బంజారాహిల్స్‌లోని రాజ కీయ పార్టీ కార్యాలయం వద్ద గాల్లోకి కాల్పులు జరిపిన నేత విషయంలో సుమోటో కేసులు నమోదు చేశారు.
ఆ రెండు వివాదాలూ పరిశీలిస్తున్నాం: పోలీసులు
ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, బంజారాహిల్స్‌లో ఎంపీ జితేందర్‌రెడ్డిల ఆయుధాల ప్రదర్శన వివాదాలను పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. వీటిలో ఆయుధ చట్ట ఉల్లంఘనలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్థారణైతే చట్ట ప్రకారం తదుపరి చర్యలకు ఉపక్రమిస్తామని స్పష్టం చేస్తున్నారు.
వాస్తవం కాదు...
తనపై వచ్చిన వివాదానికి సంబంధించి ఎంపీ జితేందర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఆయుధంతో ఎవరినీ భయభ్రాంతులకు గురి చేయలేదు. శాంతిభద్రతలకు భంగం కలిగేలా ప్రవర్తించలేదు. కేవలం సంప్రదాయం లో భాగంగానే ఆయుధాలను చేతపట్టుకున్నా’ అని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రాజేష్ మాట్లాడుతూ... ‘దుర్గాష్టమి నేపథ్యంలో ఆయు ధ పూజ తరువాత ఆయుధాన్ని చేతపట్టుకోవడమనేది ఏళ్ళుగా జరుగుతున్న ఆనవాయితీ. అందులో భాగంగానే మంత్రి తన ఆయుధాన్ని పట్టుకున్నారు. గాల్లోకి కాల్పులు జరిపారన్నది అవాస్తవం’ అని పేర్కొన్నారు.
రివాల్వర్‌తో బెదిరించాడని ఫిర్యాదు
బంజారాహిల్స్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రహ్మత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కుమారుడు బండపల్లి భవానీ శంకర్ తనను రివాల్వర్ చూపి బెదిరించాడంటూ రహ్మత్‌నగర్‌కు చెందిన రఘునాథ్ అనే యువకుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భవానీ శంకర్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 21వ తేదీ రాత్రి భవానీశంకర్ దుర్గామాత మండపం వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా స్థానికంగా నలుగురు యువకులు ఆయనను అడ్డగించి వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో భవానీశంకర్ కోపం పట్టలేక తన జేబులో ఉన్న రివాల్వర్ బయటకు తీసి చంపేస్తానంటూ బెది రించాడని, దుర్గామాత మండపం వద్ద కుర్చీలు, లైట్లు ధ్వంసం చేశాడని రఘునాథ్ అనే యువకుడు ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు భవానీశంకర్‌పై ఐపీసీ సెక్షన్ 506, 427 కింద కేసు నమోదు చేశారు. ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేయాలా వద్ద అన్నదానిపై న్యాయ సలహా కోరి నట్లు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకట్‌రెడ్డి తెలిపారు. న్యాయ పరిశీలన అనంతరం ఏ సెక్షన్ నమోదు చేయాలన్నది తేలుస్తామని ఆయన తెలిపారు.