‘నిషేధం’పై భగ్గుమన్న విపక్షాలు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: కబేళాల కోసం పశువుల క్రయవిక్రయాలను నిషేధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు భగ్గుమన్నాయి. కేంద్ర నిర్ణయాన్ని సమాఖ్య వ్యవస్థపై దాడిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివర్ణించారు. రంజాన్ మాసం ఆరంభంలోనే కేంద్రం తీసుకున్న చర్య తమపై ప్రత్యక్ష దాడిగా మైనారిటీలు భావించే ప్రమాదం ఉందన్నారు. నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాశారు.
ప్రజల ఆహారపు అలవాట్లను నియంత్రించే హక్కు కేంద్రానికి లేదని పుదుచ్చేరి సీఎం వి.నారాయణస్వామి తేల్చిచెప్పారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కేరళలోని ఆందోళనకారులు పలుచోట్ల బీఫ్ వండి తమ నిరసనను తెలియజేశారు. మోదీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం బ్లాక్ డే పాటిస్తామని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రకటించింది. నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని డీఎంకే కోరింది. మరోవైపు కబేళాలకు పశువుల తరలింపుపై నిషేధాన్ని కేంద్రం సమర్థించుకుంది. ఈ నిర్ణయం వల్ల నిబంధనలకు విరుద్ధంగా జరిగే పశువుల అమ్మకాలతో పాటు స్మగ్లింగ్‌ను అరికట్టడం వీలవుతుందని పర్యావరణ శాఖ తెలిపింది.