భారత్‌లో 20,000 ఉద్యోగాలే లక్ష్యం: షావోమి
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా భారత్‌లో భారీగా ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియా తమకు చాలా కీలకమైన మార్కెట్ అని, ఇక్కడ వచ్చే మూడేళ్లలో 20,000 మందికి ఉపాధి కల్పిస్తామని షావోమి వ్యవస్థాపకుడు లీ జున్ తెలిపారు. ఆయన ఎకనమిక్ టైమ్స్ గ్లోబల్ బిజినెస్ సమిట్–2017లో పాల్గొన్నారు. ఇండియన్ ఆన్లైన్ మార్కెట్లో విజయవంతమైన తాము ఆఫ్‌లైన్ మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించామని తెలిపారు.
భారత్‌లో విక్రయమౌతోన్న ఫోన్లలో 95 శాతం మేడిన్ ఇండియావేనని పేర్కొన్నారు. కాగా షావోమి కంపెనీ 2014 జూలైలో ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. 2015 ఆగస్ట్‌లో తొలి ప్లాంట్‌ను ప్రారంభించింది. 2016 మార్చి నాటికి కంపెనీకి చెందిన 75 శాతం ఫోన్లు దేశీయంగానే తయారవుతున్నాయి. కాగా షావోమి కంపెనీ ఫాక్స్‌కాన్‌తో కలిసి ఏపీలో రెండో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.