కల్తీ మద్యం 22 మంది ప్రాణాలు తీసింది
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో కల్తీ మద్యం తాగి ఇద్దరు మహిళలు సహా 22 మంది మృతిచెందారు. ఈ ఘటన పాకిస్తాన్లోని హైదరాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నట్టు మంగళవారం అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. కల్తీ మద్యం తాగిన మొత్తం 36 మంది అస్వస్థతకు గురవడంతో వారిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొంది.
అయితే బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా, 11 మందిని డిశ్చార్జి అయినట్టు లియాఖ్వాత్ యూనివర్సిటీ ఆస్పత్రి మెడికల్ సూపరిడెంట్ వాజిద్ మెమోన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, పాకిస్తాన్లోని ముస్లింలు.. మద్యం సేవించడం, మద్యం అమ్మడం నిషేధించారు. కానీ, ముస్లిమేతరులకు మాత్రం లైసెన్స్ కలిగిన లిక్కర్ షాపుల్లో మద్యం కొనేందుకు అనుమతి ఉంది.