Liberty House
-
భూషణ్ స్టీల్ రేసు నుంచి లిబర్టీ హౌస్ అవుట్
న్యూఢిల్లీ: భూషణ్ స్టీల్ టేకోవర్ కోసం లిబర్టీ హౌస్ దాఖలు చేసిన బిడ్‌ను రుణదాతల కమిటీ (సీఓసీ) తిరస్కరించింది. బిడ్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఈ నెల 8 అని, కానీ ఇంగ్లండ్‌కు చెందిన లిబర్టీ హౌస్ ఈ నెల 20న బిడ్‌ను దాఖలు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అందుకే రుణదాతల కమిటీ లిబర్టీ బిడ్‌ను తిరస్కరించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇక భూషణ్ స్టీల్ రేసులో టాటా స్టీల్, జీఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీలే మిగిలాయి. బుధవారం జరిగిన సమావేశంలో ఈ రెండు కంపెనీల బిడ్ల వివరాలను సీఓసీకి నివేదించడం జరిగిందని, న్యాయ సలహాదారులు ఈ బిడ్లను మదింపు చేస్తున్నారని సమాచారం. వచ్చే నెల 6న జరిగే సీఓసీ సమావేశంలో భూషణ్ స్టీల్ ఎవరి పరమయ్యేది వెల్లడవుతుంది. అయితే సంబంధిత పరిణామాలపై వ్యాఖ్యానించడానికి రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్పీ) మహేందర్ కుమార్ నిరాకరించారు. భూషణ్ పవర్ అండ్ స్టీల్ కంపెనీ రుణ దాతలకు రూ.45,000 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. రుణ దాతలకు రూ.17,000 కోట్లు, భూషణ్ స్టీల్ కార్యకలాపాల కోసం రూ.7,200 కోట్లు ఇవ్వడానికి టాటా స్టీల్ ఆఫర్ చేసిందని సమాచారం. -
టాటా’ స్పెషాలిటీ స్టీల్స్ లిబర్టీ హౌస్‌కు
100 మిలియన్ పౌండ్ల విక్రయానికి ఒప్పందం న్యూఢిల్లీ: టాటా స్టీల్ యూకే తనకు చెందిన స్పెషాలిటీ స్టీల్స్‌ను లిబర్టీ హౌస్ గ్రూపునకు 100 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.840 కోట్లు)కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. టాటా స్టీల్ స్పెషాలిటీ స్టీల్ విభాగంలో 1,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆటోమోటివ్, ఆయిల్, గ్యాస్, ఏరోస్పేస్ రంగాలకు కావాల్సిన ఉత్పత్తులను ఇది అందిస్తోంది. విక్రయ ఒప్పందంలో భాగంగా టాటా స్టీల్ యూకేకు చెందిన సౌత్ యార్క్‌షైర్‌లోని ఆస్తులు, రోతర్హామ్లోని బార్ మిల్, ఎలక్ట్రిక్ ఆర్క్స్టీల్, స్టాక్స్బ్రిడ్జ్లోని స్టీల్ శుద్ధి కేంద్రం, బ్రిన్స్వర్త్లోని మిల్లు, బోల్టన్, వెన్స్బరీ, బ్రిటన్, చైనాలోని సుజూ, గ్జియాన్‌లో ఉన్న సేవా కేంద్రాలు లిబర్టీ హౌస్ గ్రూపు సొంతం అవుతాయి. నియంత్రణపరమైన అనుమతులకు లోబడి లావాదేవీ పూర్తి కావడం ఆధారపడి ఉంటుందని టాటా స్టీల్ తెలిపింది. ఇది టాటా స్టీల్‌కు, స్పెషాలిటీ స్టీల్స్‌కు సైతం సానుకూలమైన చర్యగా టాటా స్టీల్ యూకే విభాగం సీఈవో బిమ్లేంద్రజా అభివర్ణించారు. స్పెషాలిటీ స్టీల్స్ పనితీరును మెరుగుపరిచేందుకు కార్మిక సంఘాలు, ఉద్యోగులు, యాజమాన్యం ఎంతో కష్టించి పనిచేశాయని, ప్రస్తుతం ఈ వ్యాపారం మెరుగైన స్థితిలోకి వచ్చిందన్నారు. పలు ప్రతిపాదనలపై చర్చ నిర్మాణాత్మక సమస్యలను తగ్గించుకుని, యూకే వ్యాపారానికి మరింత సుస్థిరమైన భవిష్యత్‌ను తీసుకొచ్చేందుకు పలు ప్రతిపాదనలపై ఉద్యోగులతో చర్చిస్తున్నట్టు టాటా స్టీల్ యూకే తెలిపింది. మరోవైపు యూకే వ్యాపారానికి, స్థిరమైన భవిష్యత్తు కోసం తీసుకునే చర్యలకు తమ మద్దతు కొనసాగుతుందని టాటా స్టీల్ సైతం వెల్లడించింది. 2007లో కోరస్‌ను కొనుగోలు చేసిన తర్వాత యూకేలో స్టీల్ వ్యాపారంపై 1.5 బిలియన్ పౌండ్ల (దాదాపు రూ.12,600 కోట్లు)ను పెట్టుబడులుగా పెట్టినట్టు వెల్లడించింది. -
టాటా స్టీల్ యూకే ప్లాంట్ల రేసులో ‘లిబర్టీ’...
లండన్: టాటా స్టీల్‌కు చెందిన యూకే వ్యాపారాలను భారత సంతతి వ్యాపార వేత్త సంజీవ్ గుప్తా లిబర్టీ హౌస్‌కు దాదాపు దక్కనున్నాయి. టాటా స్టీల్ యూకే వ్యాపారాల కోసం నేడు(మంగళవారం) లిబర్టీ హౌస్ బిడ్ దాఖలు చేయనున్నది. ఈ విషయాన్ని కమోడిటీ ట్రేడింగ్ సంస్థ లిబర్టీ హౌస్ ధ్రువీకరించిందని ద ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. టాటా స్టీల్ యూకే వ్యాపారాల కొనుగోలు విషయంలో సంజీవ్ గుప్తాకు జాన్ బోల్టన్ వంటి టాటా స్టీల్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు సలహాలు ఇస్తున్నారని ఆ పత్రిక తెలిపింది. స్కాట్లాండ్లోని లిబర్టీ హౌస్ స్టీల్ వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూడ్డం కోసం గత నెలలో బోల్టన్ టాటా స్టీల్ నుంచివైదొలగి లిబర్టీ హౌస్‌లో చేరారు. ఇంగ్లాండ్‌లోని టాటా స్టీల్ ప్లాంట్లను కొనుగోలు చేయడానికి అవసరమయ్యే నిధులను లిబర్టీ హౌస్‌కు అందించడానికి మాక్వెరీ క్యాపిటల్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థతో పాటు ఎస్బీఐ, డెలాయిట్, గ్రాంట్ థార్న్టన్ తదితర సంస్థలతో లిబర్టీ హౌస్ సంప్రదింపులు జరపుతోంది. ఇక షెఫీల్డ్‌లో ఉన్న టాటా స్పెషాల్టీ స్టీల్స్ యూనిట్‌ను టోనీ పెడ్డర్ నేతృత్వంలోని అల్బియన్ స్టీల్ కంపెనీ బిడ్ చేయనున్నదని సమాచారం.