టాటా’ స్పెషాలిటీ స్టీల్స్‌ లిబర్టీ హౌస్‌కు | Tata Steel signs deal with Liberty House for sale of speciality steels biz | Sakshi
Sakshi News home page

టాటా’ స్పెషాలిటీ స్టీల్స్‌ లిబర్టీ హౌస్‌కు

Feb 10 2017 12:37 AM | Updated on Sep 5 2017 3:18 AM

టాటా’ స్పెషాలిటీ స్టీల్స్‌ లిబర్టీ హౌస్‌కు

టాటా’ స్పెషాలిటీ స్టీల్స్‌ లిబర్టీ హౌస్‌కు

టాటా స్టీల్‌ యూకే తనకు చెందిన స్పెషాలిటీ స్టీల్స్‌ను లిబర్టీ హౌస్‌ గ్రూపునకు 100 మిలియన్‌ పౌండ్ల (సుమారు రూ.840 కోట్లు)కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది.

100 మిలియన్‌ పౌండ్ల విక్రయానికి ఒప్పందం
న్యూఢిల్లీ: టాటా స్టీల్‌ యూకే తనకు చెందిన స్పెషాలిటీ స్టీల్స్‌ను లిబర్టీ హౌస్‌ గ్రూపునకు 100 మిలియన్‌ పౌండ్ల (సుమారు రూ.840 కోట్లు)కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని టాటా స్టీల్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. టాటా స్టీల్‌ స్పెషాలిటీ స్టీల్‌ విభాగంలో 1,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆటోమోటివ్, ఆయిల్, గ్యాస్, ఏరోస్పేస్‌ రంగాలకు కావాల్సిన ఉత్పత్తులను ఇది అందిస్తోంది. విక్రయ ఒప్పందంలో భాగంగా టాటా స్టీల్‌ యూకేకు చెందిన సౌత్‌ యార్క్‌షైర్‌లోని ఆస్తులు, రోతర్‌హామ్‌లోని బార్‌ మిల్, ఎలక్ట్రిక్‌ ఆర్క్‌స్టీల్, స్టాక్స్‌బ్రిడ్జ్‌లోని స్టీల్‌ శుద్ధి కేంద్రం, బ్రిన్స్‌వర్త్‌లోని మిల్లు, బోల్టన్, వెన్స్‌బరీ, బ్రిటన్, చైనాలోని సుజూ, గ్జియాన్‌లో ఉన్న సేవా కేంద్రాలు లిబర్టీ హౌస్‌ గ్రూపు సొంతం అవుతాయి.

నియంత్రణపరమైన అనుమతులకు లోబడి లావాదేవీ పూర్తి కావడం ఆధారపడి ఉంటుందని టాటా స్టీల్‌ తెలిపింది. ఇది టాటా స్టీల్‌కు, స్పెషాలిటీ స్టీల్స్‌కు సైతం సానుకూలమైన చర్యగా టాటా స్టీల్‌ యూకే విభాగం సీఈవో బిమ్లేంద్రజా అభివర్ణించారు. స్పెషాలిటీ స్టీల్స్‌ పనితీరును మెరుగుపరిచేందుకు కార్మిక సంఘాలు, ఉద్యోగులు, యాజమాన్యం ఎంతో కష్టించి పనిచేశాయని, ప్రస్తుతం ఈ వ్యాపారం మెరుగైన స్థితిలోకి వచ్చిందన్నారు.   

పలు ప్రతిపాదనలపై చర్చ
నిర్మాణాత్మక సమస్యలను తగ్గించుకుని, యూకే వ్యాపారానికి మరింత సుస్థిరమైన భవిష్యత్‌ను తీసుకొచ్చేందుకు పలు ప్రతిపాదనలపై ఉద్యోగులతో చర్చిస్తున్నట్టు టాటా స్టీల్‌ యూకే తెలిపింది. మరోవైపు యూకే వ్యాపారానికి, స్థిరమైన భవిష్యత్తు కోసం తీసుకునే చర్యలకు తమ మద్దతు కొనసాగుతుందని టాటా స్టీల్‌ సైతం వెల్లడించింది. 2007లో కోరస్‌ను కొనుగోలు చేసిన తర్వాత యూకేలో స్టీల్‌ వ్యాపారంపై 1.5 బిలియన్‌ పౌండ్ల (దాదాపు రూ.12,600 కోట్లు)ను పెట్టుబడులుగా పెట్టినట్టు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement