టాటా స్టీల్ యూకే ప్లాంట్ల రేసులో ‘లిబర్టీ’...
లండన్: టాటా స్టీల్‌కు చెందిన యూకే వ్యాపారాలను భారత సంతతి వ్యాపార వేత్త సంజీవ్ గుప్తా లిబర్టీ హౌస్‌కు దాదాపు దక్కనున్నాయి. టాటా స్టీల్ యూకే వ్యాపారాల కోసం నేడు(మంగళవారం) లిబర్టీ హౌస్ బిడ్ దాఖలు చేయనున్నది. ఈ విషయాన్ని కమోడిటీ ట్రేడింగ్ సంస్థ లిబర్టీ హౌస్ ధ్రువీకరించిందని ద ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక పేర్కొంది. టాటా స్టీల్ యూకే వ్యాపారాల కొనుగోలు విషయంలో సంజీవ్ గుప్తాకు జాన్ బోల్టన్ వంటి టాటా స్టీల్ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు సలహాలు ఇస్తున్నారని ఆ పత్రిక తెలిపింది.
స్కాట్లాండ్‌లోని లిబర్టీ హౌస్ స్టీల్ వ్యాపార నిర్వహణ బాధ్యతలు చూడ్డం కోసం గత నెలలో బోల్టన్ టాటా స్టీల్ నుంచివైదొలగి లిబర్టీ హౌస్‌లో చేరారు. ఇంగ్లాండ్‌లోని టాటా స్టీల్ ప్లాంట్‌లను కొనుగోలు చేయడానికి అవసరమయ్యే నిధులను లిబర్టీ హౌస్‌కు అందించడానికి మాక్వెరీ క్యాపిటల్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ సంస్థతో పాటు ఎస్‌బీఐ, డెలాయిట్, గ్రాంట్ థార్న్‌టన్ తదితర సంస్థలతో లిబర్టీ హౌస్ సంప్రదింపులు జరపుతోంది. ఇక షెఫీల్డ్‌లో ఉన్న టాటా స్పెషాల్టీ స్టీల్స్ యూనిట్‌ను టోనీ పెడ్డర్ నేతృత్వంలోని అల్బియన్ స్టీల్ కంపెనీ బిడ్ చేయనున్నదని సమాచారం.