ఎవరి మేలుకోసం లైసెన్సు మేళా
ధర్మవరం: లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపరాదు.. ప్రతి వాహనదారుడూ అన్ని రికార్డులూ కలిగి ఉండాలి.. వాహనదారుల ప్రయోజనార్థం గ్రామ స్థాయిలో లైసెన్స్ మేళాలు నిర్వహిస్తున్నాం.. ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, పాలకులు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఆచరణలో లైసెన్సు మేళాతో ఎవరికి మేలు జరుగుతోందని వాహనదారులు చర్చించుకుంటున్నారు. ఆన్లైన్లోనే అన్ని సేవలు అని చెప్పే అధికారులు వాహనదారుల నుంచి దరఖాస్తులు తీసుకొని ముళ్ల కంపల్లో పడేయడం విమర్శలకు తావిస్తోంది. ముదిగుబ్బ మండలంలోని గుంజేపల్లిలో రోడ్డు రవాణా సంస్థ అధికారులు, పోలీసులు సంయుక్తంగా లైసెన్సు మేళా నిర్వహించారు.
గుంజేపల్లి పంచాయతీ పరిధిలోని వాహనదారులు మేళాకు వచ్చి, లర్నింగ్ లైసెన్స్‌లకు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న అధికారపార్టీ నాయకులు టూవీలర్ లైసెన్స్‌కు రూ.360, ఫోర్‌వీలర్ లైసెన్స్‌కు రూ.500 చొప్పున వసూలు చేశారు. వాస్తవానికి లైసెన్స్ మేళా అంటే ఆన్లైన్లోనే సేవలు అన్నీ. లైసెన్స్ కోరే వాహనదారుడు ఆధార్, ఫొటో, ఇతర వివరాలన్నింటినీ ఆర్టీఏ అధికారులు అక్కడికక్కడే ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకుంటారు. అయితే వారు నేరుగా అన్లైన్ ద్వారా నమోదు చేసుకుంటే తమకేమీ వస్తుందని భావించిన అధికారపార్టీ నేతలు, ఆర్టీఏ ఏజెంట్లు లైసెన్స్‌ల కోసం వచ్చిన వారితో ఆయా వివరాలను దరఖాస్తు రూపంలో తీసుకున్నారు. అందరితో అవసరాన్ని బట్టి రేటు ఫిక్స్ చేసి, వసూలు చేసుకున్నారు. అంతా బాగానే ఉన్నా.. పని అయిపోయిందని దరఖాస్తులన్నీ మేళా నిర్వహించిన ప్రాంతంలోనే ముళ్ల కంపల్లో పడేసి వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోవిస్తోంది.