తిరుమలలో లిడార్ వాహనంతో సర్వే
తిరుమల: మొదటి, రెండో ఘాట్రోడ్లతోపాటు తిరుమలలోని రోడ్లు, వాటి సామర్థ్యం, తరచూ తలెత్తుతున్న లోటుపాట్లు, సురక్షితమైన వాహనాల ప్రయాణంపై బుధవారం సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు, టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు లిడార్ వాహనంతో సర్వే నిర్వహించారు. ఘాట్రోడ్లలోని సమస్యలను తెలుసుకునేందుకు అత్యాధునిక పరికరాలతో ఈ సర్వే నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శ్రీకారం చుట్టారు. జర్మనీ సంస్థ విక్టోరా జియో స్పెక్ట్రల్కు చెందిన అత్యాధునిక సాంకేతిక పరికరాలు కల్గిన లిడార్ వాహనాన్ని మంగళవారం రాత్రి తిరుమలకు తీసుకువచ్చారు.
అధికారులు గంగోపాధ్యాయ, పూర్ణిమ పరిద, దేవేష్, రవిశంకర్ తదితర అధికారులు బుధవారం ఉదయం లేపాక్షి సర్కిల్ నుంచి సర్వేను ప్రారంభించారు. ప్రత్యేకించి మొదటి ఘాట్రోడ్డులో ఎక్కువగా ఉన్న మలుపులను తగ్గించి ప్రమాదాలు నివారించాలనే ముఖ్య లక్ష్యంతో వీరి బృందం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. అయితే వీరి బృందం నగదు తీసుకోకుండా స్వామికి ఉచితంగా సేవ చేయడం గమనార్హం.