Life donors
-
కోలుకున్నారా..? మేలు చేయండి
శ్రీకాకుళం, పాలకొండ రూరల్: ప్లాస్మా థెరపీ.. కరోనాపై పలు రకాల మందులు ప్రయోగిస్తున్న తరుణంలో వైద్యుల నమ్మకం సంపాదించిన వైద్య విధానం. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి తీసుకున్న ప్లాస్మాను అత్యవసర స్థితిలో ఉన్న మరో కరోనా రోగికి ఇచ్చి బతికిస్తున్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలను అందిస్తుండడంతో వైద్యులు ఈ ప్రక్రియపై దృష్టి సారిస్తున్నారు. అనేక దేశాల్లో వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ ప్రస్తుతం అవి ప్రయోగ దశల్లోనే ఉండడంతో ప్లాస్మా థెరపీపైనే వారంతా దృష్టి సారించారు. ఆయా దేశాలతోపాటు మనదేశంలోని అనేక రాష్ట్రా ల్లో ప్లాస్మా థెరపీ ప్రారంభమైంది. మన రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఇంకా ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంది. ఏ గ్రూపు వారికి ఆ గ్రూపే.. రక్తం ఏ గ్రూపు వారికి ఆ గ్రూపు రక్తాన్ని ఎక్కించినట్లుగానే ప్లాస్మాను కూడా ఎక్కించాల్సి ఉంటుంది. కోలుకున్న వ్యక్తుల నుంచి 350 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తే దాని నుంచి 300 మిల్లీలీటర్ల వరకు ప్లాస్మాను వేరు చేయవచ్చు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు 500 మిల్లీలీటర్ల ప్లాస్మాను ఎక్కిస్తే సంబంధిత వ్యక్తి కోలుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్లాస్మాను ఎక్కించిన వారిలో 85 నుంచి 90 శాతం వరకు కోలు కుంటున్నట్లు అనేక దేశాల్లోను, మనదేశంలోను రుజువైంది. ప్రస్తుతం ప్లాస్మా థెరపీ తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలవుతోంది. ప్లాస్మా థెరపీ అంటే.. ప్లాస్మా థెరపీ అంటే కరోనా నుంచి కోలుకున్న రోగి నుంచి రక్తాన్ని సేకరించి దాని నుంచి ఎర్ర రక్తకణాలను వేరు చేస్తే మిగిలిన దాన్ని ప్లాస్మాగా పిలుస్తారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో రెండు రకాల యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. ఐజీఎం అనే యాంటీబాడీ 7 నుంచి 10 రోజులు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇది సంబంధిత వ్యక్తి పూర్తిగా కోలుకునేందుకు ఉపయోగపడతాయి. వీటిని స్వల్పకాలిక యాంటీబాడీలుగా పిలుస్తారు. రెండో రకాన్ని ఐజీజీగా పిలుస్తారు. ఇది దీర్ఘకాలిక యాంటీబాడీలు. ఈ యాంటీబాడీల వల్లనే రోగి రెండోసారి వ్యాధి బారిన పడకుండా తనను తాను రక్షించుకోగలుగుతాడు. అయితే ప్లాస్మా ఇవ్వడానికి ఈ రోగులు ముందుకు రావడం వల్ల సంబంధిత వ్యక్తులకు ఎలాంటి హాని ఉండదు. రక్తాన్ని ఇచ్చినప్పటికీ ఇంకా సంబంధిత వ్యక్తిలో ఐజీజీ యాంటీబాడీలు ఉంటాయి. అందువల్ల ఎలాంటి హానీ ఉండదు. ఎవరి నుంచి సేకరిస్తారు..? ఇప్పటికే మన దేశంలో (ఐసీఎంఆర్) అనుమతులు ఇవ్వ టంతో ఈ ప్రక్రియపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. అందరికి ప్లాస్మా ఉపయోగించి వ్యాధులు అరికట్టవచ్చు అనుకుంటాం. కానీ ఈ ప్లాస్మా సేకరణకు కొన్ని నిబంధనలున్నాయి. ముఖ్యంగా దాత వయస్సు, తాజా ఆరోగ్య స్థితిని పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా వయస్సు 18 –60 ఏళ్ల మధ్య ఉండాలి. దాతలు వ్యాధి నుంచి కోలుకుని రెండు వారాల సమయం గడవాలి. దాతకు హెచ్ఐవీ, హెపసైటిస్–బి, సీ, సెఫిలిస్ వంటి వ్యాధులు ఉండకూడదు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి శరీరానికి ప్లాస్మెపెరిసిస్ అనే పరికరం అమర్చి ప్లాస్మా ఎక్సే్చంజ్ ద్వారా దీన్ని సేకరిస్తారు. అలా సేకరించిన స్లాస్మాను నేరుగా రోగి శరీరంలోకి ఎక్కించవచ్చు. లేదా –30డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఏడాది కాలం భద్రపరుస్తారు. ప్రోత్సాహకాన్ని అందజేస్తున్న ప్రభుత్వం రక్తదానం చేసినట్లుగానే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు రక్తదానం చేస్తే వారికి రూ. 5వేల ప్రోత్సాహకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించి దీన్ని ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పుడు రూ. 2వేలను సహాయంగా అందజేస్తుండగా ప్లాస్మా దానం చేస్తే మరో రూ. 5వేలను పొందేందుకు వీలవుతుంది. ఈ ప్రోత్సాహం గురించి కాకపోయినా ప్లాస్మా దానం చేస్తే ఒకరికి ప్రాణం దానం చేసినట్లుగానే అవుతుంది. ప్లాస్మా బ్యాంకుల కోసం జిల్లా అధికారుల కృషి.. కలెక్టర్ నివాస్ శ్రీకాకుళంలో కూడా ప్లాస్మా బ్యాంకు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారు. కోవిడ్ ఆస్పత్రులైన రిమ్స్, జెమ్స్లతోపాటు రెడ్క్రాస్లలోని రక్త నిధుల్లో ప్లాస్మా తయారుచేసే సౌకర్యాలున్నాయి. అందువల్ల ఆయా ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేయాలని కలెక్ట ర్ యోచిస్తున్నారు. జిల్లాలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని యంత్రం ద్వారా పిచికారీ చేయించడంతోపాటు కరోనా పరీక్షలు ఇతర జిల్లాల్లో కంటే ఎక్కువ చేయించడం, మరె న్నో పకడ్బందీ చర్యలను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన వద్ద చేపట్టినట్లుగానే ప్లాస్మా థెరపీ కూడా తొలిదశలో చేపట్టిన జిల్లాగా పేరుండిపోతుంది. యువత ముందుకు వస్తే జిల్లాలోని ఎందరో ప్రాణాలను కాపాడగలుగుతారు. వ్యాక్సిన్ కంటే ఉపయోగకరం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కంటే ప్లాస్మా థెరపీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తీవ్రస్థాయిలో బాధపడుతున్న కరోనా రోగికి 500 ఎంఎల్ ప్లాస్మాను ఎక్కిస్తే తీవ్రత తగ్గి త్వరగా కోలుకోవడానికి వీలుంటుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు యువత ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేస్తే ప్రాణదాతలవుతారు. – డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్, ఆర్థోపెడిక్ సర్జన్, రిమ్స్ అపోహలు అవసరం లేదు ప్లాస్మా అందించటంతో ఎలాంటి ఇబ్బందులు లేవు. దీనిపై అపోహలు వీడాలి. కోవిడ్ బారిన పడి కోలుకున్న యువత, సంపూర్ణ ఆరోగ్యవంతులు ముందుకు రావాలి. దీని వల్ల మీ కుటుంబ సభ్యులకు లేక ఇతరులకు ప్రాణదాతలు కావవచ్చు. ప్లాస్మా థెరపీతో మరణాలను తగ్గించవచ్చు. ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని ప్రకటించటం హర్షణీయం. అలాగే ప్లాస్మా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రజల్లో మరింత చైతన్యం తెచ్చే లా అవగాహన కార్యక్రమాలపై ప్రచారం చేయాలి. – డాక్టర్ బి.శ్రీనివాసరావు, ఎండీ జనరల్ మెడిషన్, ఏరియా ఆసుపత్రి, పాలకొండ -
నీళ్లు.. మహిళలు
నీరు ప్రాణం జలం అయితే, మహిళలు ప్రాణదాతలు. కుటుంబం కోసం నాలుగు రాళ్లు సంపాదించుకురావడం కన్నా కూడా, కుటుంబం కోసం బిందెడు నీళ్లు మోసుకురావడం పెద్ద బాధ్యత అయింది నేటి ప్రపంచంలో! నీళ్లు ఎక్కడబడితే అక్కడ దొరకడం లేదు. మంచినీళ్లు అసలే దొరకడం లేదు. మైళ్లకు మైళ్లు వెళ్లాలి. నీళ్ల కోసం ఈరోజు ఒక చోటుకు వెళితే, మళ్లీ అక్కడికే వెళ్లి తెచ్చుకునే పరిస్థితి లేదు. రాత్రికి రాత్రి నీళ్లు ఇంకిపోతున్నాయి! కొత్త చెలమను, కొత్త బావిని వెతుక్కుంటూ పోవాలి. కారణాలు ఏమైనా గుక్కెడు నీళ్లు దొరకడం గగనమైపోయింది. ఇవాళ్ల ‘వరల్డ్ వాటర్ డే’. ఈ సందర్భంగా.. నీళ్ల గురించి, మహిళల గురించి కొన్ని వాస్తవాలు, విశేషాలు. ∙ప్రపంచంలో ఎక్కువ భాగం కుటుంబానికి నీళ్లు అందిస్తున్నది మహిళలు, బాలికలే! నీళ్ల కోసం మహిళలు, బాలికలు రోజుకు ప్రయాణిస్తున్న దూరం సగటున 3.7 ఏడు మైళ్లు. ∙ప్రపంచవ్యాప్తంగా మహిళలు నీళ్ల కోసం వినియోగిస్తున్నవి రోజుకు 20 కోట్ల పని గంటలు. ∙నీళ్ల బిందెలను తలపై మోయడం వల్ల మహిళలు మెడనొప్పి, నడుమునొప్పి, ఇతర శారీరక బాధలకు గురవుతున్నారు. ఆ బరువు ప్రభావం తుంటి ఎముకలపై పడి, ప్రసవ సమస్యలు తలెత్తుతున్నాయి. ∙ప్రపంచంలోని అంధులలో 70 శాతం మంది మహిళలే. వీళ్లలో ఎక్కువమంది.. నీటికి అందుబాటులో లేని నివాస ప్రాంతాలలో ఇన్ఫెక్షన్ను కలిగించే బ్యాక్టీరియా వల్ల కంటిచూపు పోగొట్టుకున్నవాళ్లే. ∙ఇంట్లో మరుగుదొడ్లు, ఇంటికి సమీపంలో మరుగు లేనందువల్ల నీటి సదుపాయం ఉన్నచోటికి వెళ్లేందుకు ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలు రోజుకు 26 కోట్ల 60 లక్షల గంటలను వెచ్చించవలసి వస్తోంది. భారతదేశంలో పురుష కౌన్సిలర్లు ఉన్న ప్రాంతాలతో పోలిస్తే, మహిళలు కౌన్సిలర్లుగా ఉన్న ప్రాంతాలలో తాగునీటి సౌకర్యం 60 శాతానికి పైగా ఉంది -
రక్తదానం చేసి ప్రాణదాతలు కండి
గతంలో పోలిస్తే ప్రజల్లో రక్తదానం పట్ల అవగాహన, చైతన్యం పెరిగింది. ప్రాణాపాయంలో ఉన్నవారికి అత్యవసరంగా రక్తం అవసరమైతే అనేక మంది యువకులు రక్తదానం చేయడానికి ముందుకు వస్తున్నారు. మనం ఇచ్చే కొద్దిపాటి రక్తం ఎంతో మంది అభాగ్యులు, వారి కుటుంబాల్లో వెలుగు నింపుతుంది. రక్తదానం పట్ల పట్టణ ప్రాంతాల్లో కొంత మేరకు అవగాహన ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంత ప్రజలలో మాత్రం నేటికీ అపోహలు ఉన్నాయి. రక్తం ఇస్తే బలహీనమైపోతామేమోనన్న భయం నిజం కాదనే విషయాన్ని తెలియపరచాల్సి ఉంది. * యువకుల్లో పెరుగుతున్న అవగాహన * నేడు జాతీయ రక్తదాన దినోత్సవం చేవెళ్ల, దోమ: ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏదంటే రక్తదానమని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి నిత్యం ఎంతో మంది రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాంటి అభాగ్యుల ప్రాణ రక్షణకై రక్తం అత్యవసరంగా మారింది. కావాల్సిన రక్తాన్ని వారికి అందించడం వల్ల వారికి పునర్జన్మను ఇచ్చినవాళ్లమవుతాం. ప్రతి ఏటా గాంధీ జయంతి, అమరవీరుల సంస్మరణ దినోత్సవం, దేశ నాయకులు, సినీ నటులు, క్రీడాకారుల పుట్టిన రోజుల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రక్తదానాలు చేస్తూ ప్రాణదాతలుగా మారుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రెడ్ క్రాస్ వంటి అనేక స్వచ్ఛంద సంస్థలు దాతల నుండి సేకరించిన రక్తాన్ని భద్ర పరిచి అవసరమున్న వారికి సరఫరా చేస్తున్నాయి. రక్తదానంలో విద్యార్థులే టాప్ రక్తదానానికి ముందుకు వస్తున్న వారిలో విద్యార్థులు అందరికన్నా ముందంజలో ఉన్నారు. ఏటా రక్తదానం చేస్తున్న వారిలో 70 శాతం విద్యార్థులే కావడం గమనార్హం. విద్యార్థులను మినహాయిస్తే పురుషుల కన్నా ఎక్కువగా మహిళలు రక్తదానానికి ఆసక్తి కనబరుస్తున్నట్లు సర్వేల్లో వెల్లడైంది. జిల్లాలో 17 రక్త సేకరణ కేంద్రాలు జిల్లాలో మొత్తం 17 రక్త సేకరణ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఏషియన్ బ్లడ్ బ్యాంక్, కూకట్‌పల్లిలోని జనని వాలంటరీ బ్లడ్ బ్యాంక్, జీవనధార బ్లడ్ బ్యాంక్, కామినేని బ్లడ్ బ్యాంక్, లైఫ్ వాలంటరీ బ్లడ్ బ్యాంక్, ఎంఎం వాలంటరీ బ్లడ్ బ్యాంక్, ఎన్ఎస్ ఏహెచ్ వికారాబాద్, ఉషా ముళ్లపూడి కార్డియాక్ సెంటర్లతో పాటు భాస్కర్, షాదన్, ఏడీఆర్ఎం, అవేర్, బీబీఆర్, వీఆర్కే ఉమెన్స్, మల్లారెడ్డి, మెడీసిటీ, పౌలోమి మెడికల్ కళాశాలలు, ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబర్ 21వ తేదీన వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో పోలీసులతో పాటుగా యువకులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున రక్తదానం చేస్తున్నారు. రక్తంలో గ్రూపులు రక్తం గ్రూపులను 4 రకాలుగా గుర్తించారు. ఓ గ్రూపు, ఏ గ్రూపు, బీ గ్రూపు, ఏబీ గ్రూపులుగా విభజించారు. ఓ గ్రూపును విశ్వదాత అని, ఏబీ గ్రూపును విశ్వగ్రహీతయని గుర్తించారు. రక్తంలో ప్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్లరక్త కణాలు, క్రయో రకాలు ఉంటాయి. ప్లాస్మాలో లవణాలు, ప్రోటీన్లు మొదలైనవి ఉంటాయి. శరీరం కాలిన వారికి ఈ రక్తాన్ని అందజేస్తారు. తెల్లరక్త కణాలలో శరీరాన్ని బయటినుంచి దాడిచేసే అనేక సూక్ష్మ క్రిములు, బాక్టీరియా, వైరస్ల నుంచి కాపాడే శక్తి ఉంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి, ప్లేట్లెట్లు తక్కువగా ఉన్నవారికి ఈ రక్తాన్ని అందజేస్తారు. క్రయో రకాన్ని ఏదైనా గాయమైనప్పుడు నిరంతరం ఆగకుండా రక్త స్రావమైతున్నట్లయితే అలాంటివారికి అందజేస్తారు. రక్తాన్ని దానం చేసి ప్రాణాలను కాపాడండి తీవ్రంగా కొరత ఉన్న రక్తాన్ని దానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడినవారమవుతాం. ఏడేళ్లుగా చేవెళ్ల పరిసర ప్రాంతాల్లోనే కాకుండా హైదరాబాద్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, తదితర ప్రాంతాల్లో ఇప్పటికి 37 రక్తదాన శిబిరాలను నిర్వహించాం. నాలుగు వేలకు పైగా దాతల నుంచి రక్తాన్ని సేకరించి ప్రభుత్వాస్పత్రులకు అందజేశం. - పీ రామకృష్ణారావు, రక్తబంధు అవార్డు గ్రహీత, ఉపాధ్యాయుడు అర్హులైన ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి సమాజ అవసరాల దృష్ట్యా అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానికి ముందుకు రావాలి. రక్తదానం ఆరోగ్యానికి కూడా మంచిది. రక్తదానం చేస్తే బలహీనంగా మారతామనేది అపోహే. రక్తదానం చేసినా, చేయకపోయినా మన శరీరంలో రక్తనాళాలు కొద్ది రోజులకు నశించడం, కొత్తవి ఉత్పత్తి కావడం జరుగుతూనే ఉంటుంది. నేను ఇప్పటి వరకు 80 సార్లు రక్తదానం చేశాను. - టీ సాయిచౌదరి, రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ కార్యదర్శి. రక్తంలో రకాలు 1900 సంవత్సరం ప్రాంతంలో కార్ల్‌లాండ్ స్ట యినర్ అనే వైద్యుడు రక్తం గ్రూపులను కనుగొన్నాడు. ఇందుకుగాను 1930 సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది. ఈయ న జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటారు. ప్ర తి ఏడాది అక్టోబర్ 1న భారతదేశంలో జాతీ య రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. జీవితకాలంలో 168 సార్లు రక్తాన్ని దానం చేయవచ్చు ఆరోగ్య కరమైన వ్యక్తి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య కాలంలో మూడు నెలల కోసారి రక్తాన్ని దానం చేసినట్లయితే 168 సార్లు తన జీవిత కాలంలో ఇవ్వవచ్చు. దీనివల్ల ఎలాంటి బలహీనతరాదు. ఒకసారి రక్తదానం చేసినట్లయితే దానితో నలుగురి ప్రాణాలను కాపాడవచ్చు. వాస్తవానికి ఒక వ్యక్తిలో ఆరు నుంచి ఏడు లీటర్ల రక్తం ఉంటుంది. అందులో ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి కేవలం 250 నుంచి350 మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే సేకరిస్తారు. ఇది కేవలం రెండు వారాల్లో తిరిగి శరీరంలో ఉత్పత్తి అవుతుంది.