శ్రీకాకుళం, పాలకొండ రూరల్: ప్లాస్మా థెరపీ.. కరోనాపై పలు రకాల మందులు ప్రయోగిస్తున్న తరుణంలో వైద్యుల నమ్మకం సంపాదించిన వైద్య విధానం. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి నుంచి తీసుకున్న ప్లాస్మాను అత్యవసర స్థితిలో ఉన్న మరో కరోనా రోగికి ఇచ్చి బతికిస్తున్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలను అందిస్తుండడంతో వైద్యులు ఈ ప్రక్రియపై దృష్టి సారిస్తున్నారు. అనేక దేశాల్లో వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు సాగిస్తున్నప్పటికీ ప్రస్తుతం అవి ప్రయోగ దశల్లోనే ఉండడంతో ప్లాస్మా థెరపీపైనే వారంతా దృష్టి సారించారు. ఆయా దేశాలతోపాటు మనదేశంలోని అనేక రాష్ట్రా ల్లో ప్లాస్మా థెరపీ ప్రారంభమైంది. మన రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. శ్రీకాకుళంలో ఇంకా ప్రక్రియ మొదలుపెట్టాల్సి ఉంది.
ఏ గ్రూపు వారికి ఆ గ్రూపే..
రక్తం ఏ గ్రూపు వారికి ఆ గ్రూపు రక్తాన్ని ఎక్కించినట్లుగానే ప్లాస్మాను కూడా ఎక్కించాల్సి ఉంటుంది. కోలుకున్న వ్యక్తుల నుంచి 350 మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తే దాని నుంచి 300 మిల్లీలీటర్ల వరకు ప్లాస్మాను వేరు చేయవచ్చు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు 500 మిల్లీలీటర్ల ప్లాస్మాను ఎక్కిస్తే సంబంధిత వ్యక్తి కోలుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్లాస్మాను ఎక్కించిన వారిలో 85 నుంచి 90 శాతం వరకు కోలు కుంటున్నట్లు అనేక దేశాల్లోను, మనదేశంలోను రుజువైంది. ప్రస్తుతం ప్లాస్మా థెరపీ తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలవుతోంది.
ప్లాస్మా థెరపీ అంటే..
ప్లాస్మా థెరపీ అంటే కరోనా నుంచి కోలుకున్న రోగి నుంచి రక్తాన్ని సేకరించి దాని నుంచి ఎర్ర రక్తకణాలను వేరు చేస్తే మిగిలిన దాన్ని ప్లాస్మాగా పిలుస్తారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో రెండు రకాల యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. ఐజీఎం అనే యాంటీబాడీ 7 నుంచి 10 రోజులు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇది సంబంధిత వ్యక్తి పూర్తిగా కోలుకునేందుకు ఉపయోగపడతాయి. వీటిని స్వల్పకాలిక యాంటీబాడీలుగా పిలుస్తారు. రెండో రకాన్ని ఐజీజీగా పిలుస్తారు. ఇది దీర్ఘకాలిక యాంటీబాడీలు. ఈ యాంటీబాడీల వల్లనే రోగి రెండోసారి వ్యాధి బారిన పడకుండా తనను తాను రక్షించుకోగలుగుతాడు. అయితే ప్లాస్మా ఇవ్వడానికి ఈ రోగులు ముందుకు రావడం వల్ల సంబంధిత వ్యక్తులకు ఎలాంటి హాని ఉండదు. రక్తాన్ని ఇచ్చినప్పటికీ ఇంకా సంబంధిత వ్యక్తిలో ఐజీజీ యాంటీబాడీలు ఉంటాయి. అందువల్ల ఎలాంటి హానీ ఉండదు.
ఎవరి నుంచి సేకరిస్తారు..?
ఇప్పటికే మన దేశంలో (ఐసీఎంఆర్) అనుమతులు ఇవ్వ టంతో ఈ ప్రక్రియపై ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. అందరికి ప్లాస్మా ఉపయోగించి వ్యాధులు అరికట్టవచ్చు అనుకుంటాం. కానీ ఈ ప్లాస్మా సేకరణకు కొన్ని నిబంధనలున్నాయి. ముఖ్యంగా దాత వయస్సు, తాజా ఆరోగ్య స్థితిని పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా వయస్సు 18 –60 ఏళ్ల మధ్య ఉండాలి. దాతలు వ్యాధి నుంచి కోలుకుని రెండు వారాల సమయం గడవాలి. దాతకు హెచ్‌ఐవీ, హెపసైటిస్–బి, సీ, సెఫిలిస్ వంటి వ్యాధులు ఉండకూడదు. దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారి శరీరానికి ప్లాస్మెపెరిసిస్ అనే పరికరం అమర్చి ప్లాస్మా ఎక్సే్చంజ్ ద్వారా దీన్ని సేకరిస్తారు. అలా సేకరించిన స్లాస్మాను నేరుగా రోగి శరీరంలోకి ఎక్కించవచ్చు. లేదా –30డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో ఏడాది కాలం భద్రపరుస్తారు.
ప్రోత్సాహకాన్ని అందజేస్తున్న ప్రభుత్వం
రక్తదానం చేసినట్లుగానే కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు రక్తదానం చేస్తే వారికి రూ. 5వేల ప్రోత్సాహకాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించి దీన్ని ప్రకటించింది. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినప్పుడు రూ. 2వేలను సహాయంగా అందజేస్తుండగా ప్లాస్మా దానం చేస్తే మరో రూ. 5వేలను పొందేందుకు వీలవుతుంది. ఈ ప్రోత్సాహం గురించి కాకపోయినా ప్లాస్మా దానం చేస్తే ఒకరికి ప్రాణం దానం చేసినట్లుగానే అవుతుంది.
ప్లాస్మా బ్యాంకుల కోసం జిల్లా అధికారుల కృషి..
కలెక్టర్ నివాస్ శ్రీకాకుళంలో కూడా ప్లాస్మా బ్యాంకు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారు. కోవిడ్ ఆస్పత్రులైన రిమ్స్, జెమ్స్‌లతోపాటు రెడ్‌క్రాస్‌లలోని రక్త నిధుల్లో ప్లాస్మా తయారుచేసే సౌకర్యాలున్నాయి. అందువల్ల ఆయా ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేయాలని కలెక్ట ర్ యోచిస్తున్నారు. జిల్లాలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని యంత్రం ద్వారా పిచికారీ చేయించడంతోపాటు కరోనా పరీక్షలు ఇతర జిల్లాల్లో కంటే ఎక్కువ చేయించడం, మరె న్నో పకడ్బందీ చర్యలను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మన వద్ద చేపట్టినట్లుగానే ప్లాస్మా థెరపీ కూడా తొలిదశలో చేపట్టిన జిల్లాగా పేరుండిపోతుంది. యువత ముందుకు వస్తే జిల్లాలోని ఎందరో ప్రాణాలను కాపాడగలుగుతారు.
వ్యాక్సిన్ కంటే ఉపయోగకరం
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కంటే ప్లాస్మా థెరపీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. తీవ్రస్థాయిలో బాధపడుతున్న కరోనా రోగికి 500 ఎంఎల్ ప్లాస్మాను ఎక్కిస్తే తీవ్రత తగ్గి త్వరగా కోలుకోవడానికి వీలుంటుంది. వ్యాక్సిన్ వచ్చే వరకు యువత ముందుకు వచ్చి ప్లాస్మా దానం చేస్తే ప్రాణదాతలవుతారు.
– డాక్టర్ లుకలాపు ప్రసన్నకుమార్, ఆర్థోపెడిక్ సర్జన్, రిమ్స్
అపోహలు అవసరం లేదు
ప్లాస్మా అందించటంతో ఎలాంటి ఇబ్బందులు లేవు. దీనిపై అపోహలు వీడాలి. కోవిడ్ బారిన పడి కోలుకున్న యువత, సంపూర్ణ ఆరోగ్యవంతులు ముందుకు రావాలి. దీని వల్ల మీ కుటుంబ సభ్యులకు లేక ఇతరులకు ప్రాణదాతలు కావవచ్చు. ప్లాస్మా థెరపీతో మరణాలను తగ్గించవచ్చు. ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని ప్రకటించటం హర్షణీయం. అలాగే ప్లాస్మా సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రజల్లో మరింత చైతన్యం తెచ్చే లా అవగాహన కార్యక్రమాలపై ప్రచారం చేయాలి.
– డాక్టర్ బి.శ్రీనివాసరావు, ఎండీ జనరల్ మెడిషన్, ఏరియా ఆసుపత్రి, పాలకొండ
Comments
Please login to add a commentAdd a comment