Life Goes On The Same
-
న్యూఇయర్... నిర్ణయాలు అమలు చేయండిలా!
రాత్రంతా బాగా అల్లరిచేసి, ఆనందించి, పార్టీతో న్యూఇయర్‌కు స్వాగతం పలికి ఉంటారు. ఆ సందర్భంగా కొత్త నిర్ణయాలు కూడా తీసుకుని ఉంటారు కదా. మీరేకాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం నుంచి 50శాతం మంది కొత్త సంవత్సరం సందర్బంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అందులో మెజారిటీ.. రోజూ ఎక్సర్సైజ్ చేయాలి, బరువు తగ్గించాలి, సిగిరెట్లు మానెయ్యాలి, మద్యం మానెయ్యాలి లాంటివే ఉంటాయి. మరికొందరు పుస్తకాలు చదవడాన్నో లేదా సినిమాలు చూడడాన్నో లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం యువతలో ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఆ ఆసక్తి తగ్గుతుంది. కొత్త సంవత్సరం నిర్ణయాలు తీసుకున్నవారిలో 75శాతం మంది మొదటివారం తమ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. కానీ, జనవరి చివరికి వచ్చేసరికి కేవలం 40 శాతం మాత్రమే తమ మాటపై నిలబడతారు. ఆర్నెళ్ల తిరిగేసరికి కమిట్మెంట్తో ఉండేది ఎంతమందో తెలుసా? కేవలం 19శాతం. ఆర్నెళ్ల తర్వాత అది మరింత తగ్గుతుంది. చివరకు కేవలం ఎనిమిది శాతం మంది మాత్రమే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ను నెరవేర్చుకుంటారని స్క్రాంటన్ యూనివర్సిటీ అధ్యయనం తెలుపుతోంది. అందులోనూ మహిళల సంఖ్య ఎక్కువని న్యూసైంటిస్ట్ సర్వేలో వెల్లడైంది. ఎందుకిలా జరుగుతుంది? ఎందుకిలా జరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా చాలామంది సైకాలజిస్ట్‌లు, యూనివర్శిటీలు అధ్యయనాలు చేశాయి. అవాస్తవిక లక్ష్యాలను లేదా చాలా లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని చేరుకోవడానికి సరైన ప్లాన్, మోటివేషన్ లేకపోవడం కారణమని స్క్రాంటన్ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. మార్పు వచ్చేంతవరకూ వేచి చూసే ఓపిక లేకపోవడం, జరిగిన తప్పుల నుంచి నేర్చుకునే అలవాటు లేకపోవడం కారణాలని సైకాలజీ టుడే పత్రిక పేర్కొంది. ఎవరినో మెప్పించాలనే తప్ప, తనకు తానుగా నిర్దేశించుకోవడం వల్ల మనసు లోపలి నుంచి ఉత్సాహం, ప్రేరణ లేకపోవడం. ఇలా అనేకానేక కారణాలున్నాయి. అందుకే నెలకో, ఆర్నెళ్లకో అవి మన జీవితం నుంచి మాయమైపోతాయి. మళ్లీ పాత అలవాట్లే పునరావృతమవుతాయి. మళ్లీ కొత్త సంవత్సరానికి అవే పాత గోల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. మరేం చెయ్యాలి? ఇలాగైతే ఎలా? న్యూ ఇయర్ రిజల్యూషన్స్ నెరవేర్చుకోవడానికి ఏదో ఒక మార్గం చూపాలి కదా అని సైకాలజిస్టులు, యూనివర్శిటీలు అధ్యయనాలు జరిపాయి. వాటి సారాంశాన్ని అర్థం చేసుకుని, ఆచరించడం ద్వారా మన లక్ష్యాలను చేరుకోవచ్చు. కొత్త సంవత్సరంలో స్మార్ట్ గోల్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చని అదే స్క్రాంటన్ యూనివర్శిటీ అధ్యయనం పేర్కొంది. అంటే specific, measurable, achievable, relevant, and time-bound గోల్స్ ఏర్పాటు చేసుకోవాలి. పెద్ద పెద్ద గోల్స్‌ను చిన్న చిన్న స్టెప్స్‌గా మార్చుకోవాలని హెర్జింగ్ యూనివర్శిటీ పేర్కొంది. అంటే, 2024లో పది కిలోల బరువు తగ్గాలనుకుంటే దాన్ని నెలకో కిలోగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. కొత్త పుస్తకం రాయాలనుకుంటే రోజుకో ఐదు పేజీలు రాయడం లక్ష్యంగా పెట్టుకోవాలి. పర్ఫెక్షన్ గురించి కాకుండా ప్రోగ్రెస్‌పై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మోటివేషన్ వస్తుందని సైకాలజీ టుడే మేగజైన్ తెలిపింది. అంటే, రోజుకో ఐదు పేజీల లక్ష్యంలో మూడు పేజీలు మాత్రమే రాసినా డీలా పడిపోకూడదు. ఆ చిన్న విజయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అకౌంటబిలిటీ పార్టనర్‌ను లేదా సపోర్ట్ సిస్టమ్‌ను పెట్టుకోవడం వల్ల కూడా ఫలితాలుంటాయి. అంటే మనం పెట్టుకున్న లక్ష్యాన్ని కుటుంబ సభ్యులకో, స్నేహితులకో చెప్పండి. వారానికి ఐదు రోజులు వాకింగ్ అని లక్ష్యంగా పెట్టుకుంటే, అలా వెళ్లనప్పుడు వారిని గుర్తుచేయమనండి. ఏ అలవాటూ ఒక్కరోజులో పోదని లేదా 21 రోజుల్లో రాదనీ గుర్తించండి. ఒక కొత్త అలవాటు కావాలంటే కనీసం 60 నుంచి 70 రోజులు ప్రాక్టీస్ చేయాలి. లక్ష్యసాధనలో తడబాటుపడ్డప్పుడు, తప్పులు చేసినప్పుడు చాలామంది డీలా పడిపోతారు. ఎలాగూ తప్పు చేశామని మళ్లీ పాత మార్గానికే వెళ్లిపోతారు. అలాక్కాకుండా లక్ష్యసాధనలో తప్పులు, తడబాట్లు సహజమని గుర్తించండి. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందడుగు వేయాలి లక్ష్యాలు ఎవరినో మెప్పించాలని కాకుండా మనకోసం మనం పెట్టుకున్నప్పుడు మనసులోంచి ప్రేరణ ఉంటుంది. అందువల్ల గోల్స్ ఎప్పుడూ మీ విలువలకు సరిపోయేవిగా ఉండాలి. ఇవన్నీ చేసినా మీ అడుగులు తడబడుతుంటే, ఫిబ్రవరి లేదా మార్చిలో సైకాలజిస్ట్‌ను కలవండి. మీ ఆలోచనలు, ప్రవర్తనలో అవసరమైన మార్పుల కోసం వారు సహాయం చేస్తారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066 psy.vishesh@gmail.com -
అపజయమే విజయానికి దారి!
‘‘విజయసాధనలో తొలి కీలక మెట్టు.. ఎదురయ్యే వైఫల్యాలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం’’ స్పెయిన్‌కు చెందిన పదేళ్ల బాలుడు జూలియో ఇగ్లేషియాస్కు ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా మంచి పేరుతెచ్చుకోవాలనే కల ఉండేది. తనకు ఎంతో ఇష్టమైన రియల్ మాడ్రిడ్ క్లబ్ తరపున ఆడాలని ఆశపడేవాడు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు. బెస్టు గోల్‌కీపర్ అయ్యేందుకు రాత్రింబవళ్లూ కఠోర సాధన చేశాడు. 20 ఏళ్లు వచ్చేసరికి ఆటలో రాటుదేలాడు. అతడు స్పెయిన్‌లోనే నెంబర్‌వన్ గోల్‌కీపర్ కావడం ఖాయమని క్రీడాపండితులు జోస్యం చెప్పారు. ఎట్టకేలకు జూలియో కల నెరవేరే రోజు వచ్చింది. రియల్ మాడ్రిడ్ క్లబ్ తరపున ఆడేందుకు సంతకం చేశాడు. కానీ, ఇంతలోనే విధి వక్రించింది. 1963లో ఓ రోజు సరదాగా గడిపేందుకు జూలియో తన స్నేహితులతో కలిసి కారులో బయల్దేరాడు. ఆ రోజు రాత్రి అతడి పాలిట కాళరాత్రిగా మారింది. కారు ఘోర ప్రమాదానికి గురైంది. స్పెయిన్‌లో అత్యుత్తమ గోల్‌కీపర్‌గా అభిమానులను అలరించాల్సిన జూలియో ఆస్పత్రి పాలయ్యాడు. అతడి శరీరం నడుము కిందిభాగం నుంచి పూర్తిగా చచ్చుబడిపోయింది. జూలియో మళ్లీ లేచి నడవలేడని, ఇక ఫుట్‌బాల్ మైదానంలో అడుగుపెట్టడం అసాధ్యమని వైద్యులు తేల్చేశారు. కళ్లలో నీరు, చేతిలో కలం జూలియోలో నిరాశ, నిస్పృహ పెరిగిపోయాయి. తనను తాను చూసుకొని తీవ్రంగా కలత చెందేవాడు. రాత్రిపూట మౌనంగా రోదించేవాడు. బాధను మర్చిపోయేందుకు పాటలు, గేయాలు రాసేవాడు. కనుల నిండా నీరు, చేతిలో కలం. ఇదీ జూలియో పరిస్థితి. అతడిలో ఉత్సాహం నింపేందుకు ఆస్పత్రి నర్సు ఒక గిటార్‌ను బహుమతిగా ఇచ్చింది. జూలియో ఆ సంగీత పరికరంపై సాధన చేయడం ప్రారంభించాడు. తాను రాసిన పాటలను పాడుతూ గిటార్‌పై సరిగమలను పలికించేవాడు. 18 నెలల తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికి చేరాడు. క్రమంగా కోలుకోవడం మొదలుపెట్టాడు. ప్రమాదం జరిగిన ఐదేళ్ల తర్వాత సంగీత పోటీలో పాల్గొన్నాడు. ‘లైఫ్ గోస్ ఆన్ ద సేమ్’ అనే పాట పాడి, మొదటి బహుమతి సాధించాడు. అతడు మళ్లీ ఎప్పుడూ ఫుట్‌బాల్ ఆడలేదు. కానీ, చేతిలో గిటార్, గొంతులోంచి వచ్చే మధురమైన పాటలతో సంగీత చరిత్రలో తొలి 10 మంది అత్యుత్తమ గాయకుల్లో ఒకడిగా ప్రఖ్యాతిగాంచాడు. జూలియో నుంచి వెలువడిన పాటల ఆల్బమ్‌లు ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లు అమ్ముడయ్యాయి. కారు యాక్సిడెంట్ జరగకపోతే ఏమయ్యేదో ఒకసారి ఊహించండి. జూలియో యూరప్‌లోని చాలా మంది ఫుట్‌బాల్ గోల్కీపర్లలో ఒకడిగా మాత్రమే మిగిలిపోయేవాడు. మరో తలుపు తెరిచే ఉంటుంది గాయకుడు జూలియోకు జరిగిన యాక్సిడెంట్ లాంటిదే మనలో కూడా ఎవరికైనా జరగొచ్చు. ఒక ప్రమాదం.. ఒక వైఫల్యం.. ఎదురుకాగానే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక తలుపు మూసుకుపోతే ఇక దారిలేదనే ఆందోళన పనికిరాదు. మరొక తలుపు తెరిచే ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. వైఫల్యాలను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. పరాజయం మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా జాగ్రత్త పడండి. ప్రతి ఒక్కరిలో తప్పనిసరిగా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. దేనికీ పనికిరాని వ్యక్తులంటూ ఎవరూ ఉండరు. మీరు ఏదైనా కోర్సులో ప్రవేశానికి ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో అర్హత సాధించలేకపోయారా? అయితే ఆ కోర్సు మీకు సరిపోకపోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించలేకపోయాడు. అంతమాత్రాన ఆయనలో టాలెంట్ లేదని చెప్పగలమా? ఒకచోట విఫలమైనా మరోచోట మంచి భవిష్యత్తు మీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మీపై మీరు నమ్మకం పెంచుకోండి చాలా ఏళ్ల క్రితం కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి చదువులో ఎంతో చురుగ్గా ఉండేవాడు. డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడు తప్పకుండా గొప్ప డాక్టరవుతాడని అందరూ అనుకునేవారు. ఆ విద్యార్థి మెడిసిన్‌లో ప్రవేశానికి పరీక్ష రాశాడు. కానీ, పరాజయమే పలకరించింది. ఫలితం చూసి కుంగిపోకుండా బీఎస్సీలో చేరాడు. తర్వాత మాస్టర్ డిగ్రీ పూర్తిచేశాడు. ఓ ఐటీ కంపెనీలో చేరాడు. తర్వాత ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకడిగా మారాడు. ఆయన పేరు క్రిష్ గోపాలకృష్ణన్. ఒకవేళ మెడికల్ ఎంట్రెన్స్ టెస్టులో ఆయన అర్హత సాధిస్తే కేరళలో ఓ సాధారణ వైద్యుడిగా మాత్రమే ఉండిపోయేవారు. జూలియో, క్రిష్ గోపాలకృష్ణన్‌ల నుంచి ఈనాటి యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఒక తలుపు మూసుకుపోతే, మరొకటి తెరిచే ఉంటుంది. మొదట మీపై మీరు నమ్మకం పెంచుకోండి. ఈసారి అపజయం ఎదురైతే బాధపడుతూ కూర్చోకుండా లేచి మరో తలుపును తెరవండి. -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో...