రాత్రంతా బాగా అల్లరిచేసి, ఆనందించి, పార్టీతో న్యూఇయర్‌కు స్వాగతం పలికి ఉంటారు. ఆ సందర్భంగా కొత్త నిర్ణయాలు కూడా తీసుకుని ఉంటారు కదా. మీరేకాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం నుంచి 50శాతం మంది కొత్త సంవత్సరం సందర్బంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.
అందులో మెజారిటీ.. రోజూ ఎక్సర్సైజ్ చేయాలి, బరువు తగ్గించాలి, సిగిరెట్లు మానెయ్యాలి, మద్యం మానెయ్యాలి లాంటివే ఉంటాయి. మరికొందరు పుస్తకాలు చదవడాన్నో లేదా సినిమాలు చూడడాన్నో లక్ష్యంగా పెట్టుకోవచ్చు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం యువతలో ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ ఆ ఆసక్తి తగ్గుతుంది. కొత్త సంవత్సరం నిర్ణయాలు తీసుకున్నవారిలో 75శాతం మంది మొదటివారం తమ నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు.
కానీ, జనవరి చివరికి వచ్చేసరికి కేవలం 40 శాతం మాత్రమే తమ మాటపై నిలబడతారు. ఆర్నెళ్ల తిరిగేసరికి కమిట్మెంట్‌తో ఉండేది ఎంతమందో తెలుసా? కేవలం 19శాతం. ఆర్నెళ్ల తర్వాత అది మరింత తగ్గుతుంది. చివరకు కేవలం ఎనిమిది శాతం మంది మాత్రమే న్యూ ఇయర్ రిజల్యూషన్స్‌ను నెరవేర్చుకుంటారని స్క్రాంటన్ యూనివర్సిటీ అధ్యయనం తెలుపుతోంది. అందులోనూ మహిళల సంఖ్య ఎక్కువని న్యూసైంటిస్ట్ సర్వేలో వెల్లడైంది.
ఎందుకిలా జరుగుతుంది?
ఎందుకిలా జరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా చాలామంది సైకాలజిస్ట్‌లు, యూనివర్శిటీలు అధ్యయనాలు చేశాయి. అవాస్తవిక లక్ష్యాలను లేదా చాలా లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని చేరుకోవడానికి సరైన ప్లాన్, మోటివేషన్ లేకపోవడం కారణమని స్క్రాంటన్ యూనివర్శిటీ అధ్యయనంలో తేలింది. మార్పు వచ్చేంతవరకూ వేచి చూసే ఓపిక లేకపోవడం, జరిగిన తప్పుల నుంచి నేర్చుకునే అలవాటు లేకపోవడం కారణాలని సైకాలజీ టుడే పత్రిక పేర్కొంది. ఎవరినో మెప్పించాలనే తప్ప, తనకు తానుగా నిర్దేశించుకోవడం వల్ల మనసు లోపలి నుంచి ఉత్సాహం, ప్రేరణ లేకపోవడం. ఇలా అనేకానేక కారణాలున్నాయి. అందుకే నెలకో, ఆర్నెళ్లకో అవి మన జీవితం నుంచి మాయమైపోతాయి. మళ్లీ పాత అలవాట్లే పునరావృతమవుతాయి. మళ్లీ కొత్త సంవత్సరానికి అవే పాత గోల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి.
మరేం చెయ్యాలి?
- ఇలాగైతే ఎలా? న్యూ ఇయర్ రిజల్యూషన్స్ నెరవేర్చుకోవడానికి ఏదో ఒక మార్గం చూపాలి కదా అని సైకాలజిస్టులు, యూనివర్శిటీలు అధ్యయనాలు జరిపాయి. వాటి సారాంశాన్ని అర్థం చేసుకుని, ఆచరించడం ద్వారా మన లక్ష్యాలను చేరుకోవచ్చు.
- కొత్త సంవత్సరంలో స్మార్ట్ గోల్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల లక్ష్యాన్ని చేరుకోవచ్చని అదే స్క్రాంటన్ యూనివర్శిటీ అధ్యయనం పేర్కొంది. అంటే specific, measurable, achievable, relevant, and time-bound గోల్స్ ఏర్పాటు చేసుకోవాలి.
- పెద్ద పెద్ద గోల్స్‌ను చిన్న చిన్న స్టెప్స్‌గా మార్చుకోవాలని హెర్జింగ్ యూనివర్శిటీ పేర్కొంది. అంటే, 2024లో పది కిలోల బరువు తగ్గాలనుకుంటే దాన్ని నెలకో కిలోగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. కొత్త పుస్తకం రాయాలనుకుంటే రోజుకో ఐదు పేజీలు రాయడం లక్ష్యంగా పెట్టుకోవాలి.
- పర్ఫెక్షన్ గురించి కాకుండా ప్రోగ్రెస్‌పై దృష్టి పెట్టాలి. చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం వల్ల మోటివేషన్ వస్తుందని సైకాలజీ టుడే మేగజైన్ తెలిపింది. అంటే, రోజుకో ఐదు పేజీల లక్ష్యంలో మూడు పేజీలు మాత్రమే రాసినా డీలా పడిపోకూడదు. ఆ చిన్న విజయాన్ని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి.
- అకౌంటబిలిటీ పార్టనర్‌ను లేదా సపోర్ట్ సిస్టమ్‌ను పెట్టుకోవడం వల్ల కూడా ఫలితాలుంటాయి. అంటే మనం పెట్టుకున్న లక్ష్యాన్ని కుటుంబ సభ్యులకో, స్నేహితులకో చెప్పండి. వారానికి ఐదు రోజులు వాకింగ్ అని లక్ష్యంగా పెట్టుకుంటే, అలా వెళ్లనప్పుడు వారిని గుర్తుచేయమనండి.
- ఏ అలవాటూ ఒక్కరోజులో పోదని లేదా 21 రోజుల్లో రాదనీ గుర్తించండి. ఒక కొత్త అలవాటు కావాలంటే కనీసం 60 నుంచి 70 రోజులు ప్రాక్టీస్ చేయాలి.
- లక్ష్యసాధనలో తడబాటుపడ్డప్పుడు, తప్పులు చేసినప్పుడు చాలామంది డీలా పడిపోతారు. ఎలాగూ తప్పు చేశామని మళ్లీ పాత మార్గానికే వెళ్లిపోతారు. అలాక్కాకుండా లక్ష్యసాధనలో తప్పులు, తడబాట్లు సహజమని గుర్తించండి. చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని ముందడుగు వేయాలి
- లక్ష్యాలు ఎవరినో మెప్పించాలని కాకుండా మనకోసం మనం పెట్టుకున్నప్పుడు మనసులోంచి ప్రేరణ ఉంటుంది. అందువల్ల గోల్స్ ఎప్పుడూ మీ విలువలకు సరిపోయేవిగా ఉండాలి.
- ఇవన్నీ చేసినా మీ అడుగులు తడబడుతుంటే, ఫిబ్రవరి లేదా మార్చిలో సైకాలజిస్ట్‌ను కలవండి. మీ ఆలోచనలు, ప్రవర్తనలో అవసరమైన మార్పుల కోసం వారు సహాయం చేస్తారు.
సైకాలజిస్ట్ విశేష్
+91 8019 000066
psy.vishesh@gmail.com
Comments
Please login to add a commentAdd a comment