‘ఆ.. ఏం న్యూ ఇయర్ అండీ.. తిని నిద్రపోక’.. ‘మేం ఎక్కడికీ వెళ్లం.. ఎవరినీ పిలవం.. టీవీ చూసి నిద్రపోతాం’.. అంత నిర్లిప్తత... నిరాసక్తత ఎందుకు? న్యూ ఇయర్ అంటే కొత్త కాలెండర్.. కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం.. అర్ధరాత్రి పొద్దుపొడుపు.. లోలోపల నిర్లిప్తత ఉంటే కాలం బ్రైట్‌గా ఎలా షేక్‌హ్యాండ్ ఇవ్వగలదు? మన కోసం 2024 అనే అతిథి వస్తోంది. నలుగురితో కలిసి హుషారుగా ఆహ్వానించండి. కుటుంబమంతా కలిసి సెలబ్రేట్ చేయండి. మంచి ప్రారంభం సంతోషాలకు తొలిమెట్టు.'
2024 వస్తోంది.. వస్తే.. మనకేం సంబంధం?
అదేంటి? 2024 ఊరికే వస్తుందా? కొత్త కాలచక్రాన్ని తీసుకుని వస్తుంది. పండుగ సెలవులు, ఇంక్రిమెంట్ సమయాలు, ప్రమోషన్ల ఆంకాక్షలు, పరీక్షల రిజల్ట్‌లు, పై తరగతుల అడ్మిషన్లు, జాబ్ ఇంటర్వ్యూలు, అమెరికా వీసాలు, పెళ్లి ముహూర్తాలు, ఎండల మామిడిపండ్లు, వానలతో ΄ారే ఏర్లు, దసరా సంబరాలు, అభిమాన హీరోల బ్లాక్‌బస్టర్లు... ఎన్నెన్ని తెస్తుందది. ఏమో.. కుదిరితే ప్రజాహితమైన మరిన్ని పాలనా విధానాలు కూడా తేవచ్చు. ఇవన్నీ ప్రత్యేక్షంగానో పరోక్షంగానో మనతో ముడిపడి ఉంటాయి. అందుకే కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా ఆహ్వానం పలకాలి. హాయ్ చెప్తూ వెల్‌కమ్ చేయాలి. మాకై మంచి మంచి సంతోషాలను మోసుకురా సుమా అని ఆకాంక్షించాలి.
నలుగురు ఉంటే సరదా..
వేడుక సమయాల్లో ఎప్పుడూ నలుగురు ఉంటేనే సరదా. డిసెంబర్ 31 రాత్రి అంటే మరీ ఆర్భాటం అక్కర్లేదు. నిషా ఉండాలన్న నియమం లేదు. హాయిగా కుటుంబ సమేతంగా గడిపి, విందు భోజనంతో, చక్కని ΄ాటలు వింటూ, కబుర్లు చెప్పుకుంటూ, ఆరుబయట చలిమంట వేసుకుంటూ గడిపి కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించవచ్చు. లేదా సమీపంలో ఉన్న దగ్గరి బంధువులనో, ఆప్త మిత్రులనో లిమిటెడ్‌గా పిలిచి ఎంజాయ్ చేయవచ్చు. ఇష్టమైన మనుషులు ఉంటే మానసికంగా చాలా ఉత్తేజం ఉంటుంది. మరీ ముఖ్యం.. ఇవాళ చాలామంది మిత్రుల పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. భార్యాభర్తలు మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. అలాంటి మిత్రుల్ని పిలిచి ఈ సంతోష సమయాలను పంచవచ్చు.
అలంకరణలూ ఆనందమే..
కొత్త సంవత్సరం కొత్త కాంతులు తేవాలని అందరికీ అనిపిస్తుంది. అలాంటి సమయాల్లో ఇంటిని డల్‌గా ఉంచొద్దు. చక్కగా సర్దుకోవాలి. ΄పాత సామాన్లు తీసి బయట ΄పారేయాలి. వీలైతే కొత్త కర్టెన్లు, బెడ్‌షీట్లు మార్చవచ్చు. రంగు కాగితాలు, బెలూన్లు శోభను తెస్తాయి. మార్కెట్‌లో లేదా అమేజాన్‌లో తక్కువ ధరకే సీరియల్ లైట్లు దొరుకుతున్నాయి. అవి కొన్ని ఇంట్లో వెలిగిస్తే చాలా బాగుంటుంది. మంచి అగర్‌బత్తీలతో, రూమ్ స్ప్రేయర్లతో ఇంటిని పరిమళ భరితం చేసి కొత్త సంవత్సర ఆగమన ఘడియలకు సిద్ధమవ్వాలి.
మంచి విందు.. చాలా పసందు!
నలుగురూ కలిసి ఇలాంటి సమయంలో ఛలోక్తులతో, చతురోక్తులతో వంట చేస్తే బాగుంటుంది. ఆడవాళ్లకు యధావిధిగా వంట భారం అప్పజెప్పక పోవడమే మంచిది. పార్టీలు గట్రా ఉంటే స్నాక్స్ బయట నుంచి తెప్పించుకున్నా మెయిన్ కోర్స్‌ను ముచ్చట కొద్దీ వండుకోవచ్చు. అదో పద్ధతి. లేదంటే మిత్రులు కొన్ని పదార్థాలు వండుకుని వస్తే, కొన్ని పదార్థాలు మనం వండ వచ్చు. కష్టమూ సంతోషమూ పంచుకున్నట్టు అవుతుంది. చివరలో కేక్ ఎలాగూ కట్ చేస్తారనుకోండి.
ఆటలూ పాటలూ..
దాగివున్న విద్యలు బయటపెట్టే సందర్భాలు ఇవి. ఎప్పుడో కాలేజీ రోజుల్లో పాడి ఉంటారు. ఇప్పుడు పాడండి. ఏవో ఇష్టమైన డైలాగులు అభినయించి ఉంటారు. ఇప్పుడూ చేయండి. పిల్లలతో కలిసి సరదాగా నాలుగు స్టెప్పులేయండి. ఇరుగు పొరుగుకు అభ్యంతరం లేని మోతాదులో సందడి చేయండి. వినడానికి ఘంటసాల, పి.సుశీల డ్యూయెట్లా, ఇళయరాజా తమిళ పాటలా అనే వాదనలు కూడా ఇలాంటి సమయాల్లో బాగుంటాయి.
చివరగా..
నిద్రపోయే ముందు మనస్ఫూర్తిగా లోకంలో ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరంలో సంతోషంగా ఉండాలని కామనలు సృష్టికి తెలపండి. అలకలు, ఫిర్యాదులు ఏవైనా ప్రకృతికి ఉంటే దాని మనసు మెత్తబడేలా మనస్ఫూర్తిగా అందరి కోసం ప్రార్థన చేయండి. 'ప్రకృతి వింటుంది. కాలానికి చెబుతుంది. సృష్టి శిరసావహిస్తుంది. శుభమ్!'
Comments
Please login to add a commentAdd a comment