అపజయమే విజయానికి దారి! | Failure lead to success! | Sakshi
Sakshi News home page

అపజయమే విజయానికి దారి!

Published Sun, Jul 6 2014 11:58 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

అపజయమే విజయానికి దారి! - Sakshi

‘‘విజయసాధనలో తొలి కీలక మెట్టు.. ఎదురయ్యే వైఫల్యాలను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం’’
 
స్పెయిన్‌కు చెందిన పదేళ్ల బాలుడు జూలియో ఇగ్లేషియాస్‌కు ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా మంచి పేరుతెచ్చుకోవాలనే కల ఉండేది. తనకు ఎంతో ఇష్టమైన రియల్ మాడ్రిడ్ క్లబ్ తరపున ఆడాలని ఆశపడేవాడు. అందుకోసం ఎంతో కష్టపడ్డాడు.  బెస్టు గోల్‌కీపర్ అయ్యేందుకు రాత్రింబవళ్లూ కఠోర సాధన చేశాడు. 20 ఏళ్లు వచ్చేసరికి ఆటలో రాటుదేలాడు. అతడు స్పెయిన్‌లోనే నెంబర్‌వన్ గోల్‌కీపర్ కావడం ఖాయమని క్రీడాపండితులు జోస్యం చెప్పారు. ఎట్టకేలకు జూలియో కల నెరవేరే రోజు వచ్చింది. రియల్ మాడ్రిడ్ క్లబ్ తరపున ఆడేందుకు సంతకం చేశాడు.

కానీ, ఇంతలోనే విధి వక్రించింది. 1963లో ఓ రోజు సరదాగా గడిపేందుకు జూలియో తన స్నేహితులతో కలిసి కారులో బయల్దేరాడు. ఆ రోజు రాత్రి అతడి పాలిట కాళరాత్రిగా మారింది. కారు ఘోర ప్రమాదానికి గురైంది. స్పెయిన్‌లో అత్యుత్తమ గోల్‌కీపర్‌గా అభిమానులను అలరించాల్సిన జూలియో ఆస్పత్రి పాలయ్యాడు. అతడి శరీరం నడుము కిందిభాగం నుంచి పూర్తిగా చచ్చుబడిపోయింది. జూలియో మళ్లీ లేచి నడవలేడని, ఇక ఫుట్‌బాల్ మైదానంలో అడుగుపెట్టడం అసాధ్యమని వైద్యులు తేల్చేశారు.
 
కళ్లలో నీరు, చేతిలో కలం
 
జూలియోలో నిరాశ, నిస్పృహ పెరిగిపోయాయి. తనను తాను చూసుకొని తీవ్రంగా కలత చెందేవాడు. రాత్రిపూట మౌనంగా రోదించేవాడు. బాధను మర్చిపోయేందుకు పాటలు, గేయాలు రాసేవాడు. కనుల నిండా నీరు, చేతిలో కలం. ఇదీ జూలియో పరిస్థితి. అతడిలో ఉత్సాహం నింపేందుకు ఆస్పత్రి నర్సు ఒక గిటార్‌ను బహుమతిగా ఇచ్చింది. జూలియో ఆ సంగీత పరికరంపై సాధన చేయడం ప్రారంభించాడు. తాను రాసిన పాటలను పాడుతూ గిటార్‌పై సరిగమలను పలికించేవాడు.

18 నెలల తర్వాత ఆస్పత్రి నుంచి ఇంటికి చేరాడు. క్రమంగా కోలుకోవడం మొదలుపెట్టాడు. ప్రమాదం జరిగిన ఐదేళ్ల తర్వాత సంగీత పోటీలో పాల్గొన్నాడు. ‘లైఫ్ గోస్ ఆన్ ద సేమ్’ అనే పాట పాడి, మొదటి బహుమతి సాధించాడు. అతడు మళ్లీ ఎప్పుడూ ఫుట్‌బాల్ ఆడలేదు. కానీ, చేతిలో గిటార్, గొంతులోంచి వచ్చే మధురమైన పాటలతో సంగీత చరిత్రలో తొలి 10 మంది అత్యుత్తమ గాయకుల్లో ఒకడిగా ప్రఖ్యాతిగాంచాడు. జూలియో నుంచి వెలువడిన పాటల ఆల్బమ్‌లు ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్లు అమ్ముడయ్యాయి. కారు యాక్సిడెంట్ జరగకపోతే ఏమయ్యేదో ఒకసారి ఊహించండి. జూలియో యూరప్‌లోని చాలా మంది ఫుట్‌బాల్ గోల్‌కీపర్‌లలో ఒకడిగా మాత్రమే మిగిలిపోయేవాడు.
 
మరో తలుపు తెరిచే ఉంటుంది


గాయకుడు జూలియోకు జరిగిన యాక్సిడెంట్ లాంటిదే మనలో కూడా ఎవరికైనా జరగొచ్చు. ఒక ప్రమాదం.. ఒక వైఫల్యం.. ఎదురుకాగానే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఒక తలుపు మూసుకుపోతే ఇక దారిలేదనే ఆందోళన పనికిరాదు. మరొక తలుపు తెరిచే ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. వైఫల్యాలను ధీటుగా ఎదుర్కొనే సామర్థ్యం ఉండాలి. పరాజయం మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకుండా జాగ్రత్త పడండి. ప్రతి ఒక్కరిలో తప్పనిసరిగా కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. దేనికీ పనికిరాని వ్యక్తులంటూ ఎవరూ ఉండరు. మీరు ఏదైనా కోర్సులో ప్రవేశానికి ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లో అర్హత సాధించలేకపోయారా? అయితే ఆ కోర్సు మీకు సరిపోకపోవచ్చు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించలేకపోయాడు. అంతమాత్రాన ఆయనలో టాలెంట్ లేదని చెప్పగలమా? ఒకచోట విఫలమైనా మరోచోట మంచి భవిష్యత్తు మీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది.
 
మీపై మీరు నమ్మకం పెంచుకోండి

చాలా ఏళ్ల క్రితం కేరళలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థి చదువులో ఎంతో చురుగ్గా ఉండేవాడు. డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడు తప్పకుండా గొప్ప డాక్టరవుతాడని అందరూ అనుకునేవారు. ఆ విద్యార్థి మెడిసిన్‌లో ప్రవేశానికి పరీక్ష రాశాడు. కానీ, పరాజయమే పలకరించింది. ఫలితం చూసి కుంగిపోకుండా బీఎస్సీలో చేరాడు. తర్వాత మాస్టర్ డిగ్రీ పూర్తిచేశాడు. ఓ ఐటీ కంపెనీలో చేరాడు. తర్వాత ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకడిగా మారాడు. ఆయన పేరు క్రిష్ గోపాలకృష్ణన్. ఒకవేళ మెడికల్ ఎంట్రెన్స్ టెస్టులో ఆయన అర్హత సాధిస్తే కేరళలో ఓ సాధారణ వైద్యుడిగా మాత్రమే ఉండిపోయేవారు. జూలియో, క్రిష్ గోపాలకృష్ణన్‌ల నుంచి ఈనాటి యువతరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఒక తలుపు మూసుకుపోతే, మరొకటి తెరిచే ఉంటుంది. మొదట మీపై మీరు నమ్మకం పెంచుకోండి. ఈసారి అపజయం ఎదురైతే బాధపడుతూ కూర్చోకుండా లేచి మరో తలుపును తెరవండి.
                   
 -‘కెరీర్స్ 360’ సౌజన్యంతో...
 

Advertisement
 
Advertisement
 
Advertisement