బీమా పథకాలపై అవగాహన కల్పించాలి
కలెక్టర్ రఘునందన్‌రావు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి మండల ఐకేపీ, ఈజీఎస్ సిబ్బంది, బ్యాంకు మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన పథకాలన్నీ తక్కువ మొత్తంతో ఎక్కువ లబ్ధి కలిగించేవిగా ఉన్నాయన్నారు.
ఈ పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రెండు పథకాల కింద జిల్లాలో కనిష్టంగా 10 లక్షల మంది నుంచి ప్రీమియం కట్టించేలా చూడాలని పేర్కొన్నారు. ఇందుకుగాను గ్రామాల్లో ప్రత్యేకంగా సభలు నిర్వహించి ప్రచారం చేయాలని, ప్రతి ఒక్కరికీ ఈ పథకాలపై వివరించాలన్నారు. ఈ నెల 25లోగా అర్హులంతా బ్యాంకుల్లో బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత ప్రీమియం చెల్లించేవారు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి, డ్వామా పీడీ చంద్రకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.