తెగిపోయిన ఓవర్‌హెడ్‌వైర్
సాక్షి, ముంబై: ముంబై లైఫ్లైన్లుగా పేర్కొనే లోకల్ రైళ్లకు అంతరాయం కలిగింది. ఘాట్కోపర్ రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం 7.16 గంటలకు ‘స్లో ట్రాక్’పై ఓవర్‌హెడ్ వైర్ తెగిపోయింది. తత్ఫలితంగా రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ములూండ్-మాటుంగా రైల్వేస్టేషన్ల మధ్య లోకల్ రైళ్ల రాకపోకలు చాలాసేపు పూర్తిగా నిలిచిపోయాయి.
అయితే ఈ ఘటన అనంతరం స్లో ట్రాక్‌పై నడిచే లోకల్ రైళ్లను ములూండ్-మాటుంగా రైల్వేస్టేషన్ల మధ్య ఫాస్ట్ ట్రాక్‌పై మళ్లించి నడిపించారు. దీంతో ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. అయితే అంతా విధులకు వెళ్లే సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనేకమంది విధులకు ఆలస్యంగా చేరుకోగా మరికొందరు విధులకు వెళ్లకుండానే ఇంటికి వెనుదిరిగారు. మరోవైపు రైళ్లు ఆలస్యంగా నడవడంతో ఆయా స్టేషన్లలో రద్దీ కనిపించింది.
ప్లాట్‌ఫాంలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. సుమారు నాలుగు గంటల అనంతరం రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. అయినప్పటకీ రైళ్లు సాయంత్రం వరకు ఆలస్యంగానే నడిచాయి. మరోవైపు పలు రైళ్లను రద్దు చేయాల్సివచ్చింది. మరోవైపు అనేకమంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు బెస్టు బస్సులతోపాటు ఆటో ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. దీంతో బెస్టు సంస్థ కూడా అదనంగా బస్సులను నడిపింది. తత్ఫలితంగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది.