గంటపాటు లిఫ్టులో నరకం
సాక్షి, ఆరిలోవ(విశాఖపట్నం) : హెల్త్‌సిటీ ఈఎస్ఐ ఆస్పత్రిలో బుధవారం లిఫ్ట్ మొరాయించింది. కింద నుంచి పైఅంతస్తుకు రోగులు, వారి బంధువులు వెళుతుండగా మధ్యలో నిలిచిపోయింది. దీంతో లిఫ్టులో ఉన్నవారు హాహాకారులు చేశారు. సుమారు గంటపాటు నరకం చూశారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో రెండు లిఫ్ట్‌లున్నాయి. వాటిలో ఇప్పటికే ఒకటి మొరాయించి మూలకు చేరింది. ఉన్నది కూడా ఇప్పుడు మొరాయించింది.
ఉదయం 10 గంటల సమయంలో ఆస్పత్రి గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీ నమోదు చేసుకొని మూడో ఫ్లోర్లో ఉన్న వైద్యులను కలవడానికి కొందరు రోగులు, వారికి తోడుగా వచ్చిన బంధువులు లిఫ్ట్‌లో వెళ్లదలచారు. చిన్న లిఫ్ట్ కావడంతో దానిలో నలుగురు మాత్రమే పట్టే సామర్థ్యం ఉంది. కానీ ముగ్గురు రోగులతో పాటు మరో నలుగురు వారి సహాయకులు (మొత్తం ఏడుగురు) లిఫ్ట్‌లో ఎక్కేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో వారు ఎక్కిని వెంటనే లిఫ్ట్ తలుపులు మూసుకొన్నాయి. ఒక్క అడుగు పైకి లేచి లిఫ్టు అక్కడే నిలిచిపోయింది.
ఆ తలుపులు తెరుచుకోలేదు. దీంతో లోపల ఉన్నవారంతా పెద్ద కేకలు పెడుతూ రక్షించడంటూ బయట ఉన్నవారిని వేడుకున్నారు. దీంతో ఆస్పత్రిలో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువలు లిఫ్ట్ వద్దకు పారొచ్చారు. లిఫ్ట్ తలుపులు తెరవడానికి నానా హైరాన పడ్డారు. బోల్టులు విప్పినా తలుపులు తెరుచుకోలేదు. ఇనుప రాడ్లు తీసుకొచ్చి సిబ్బంది తలుపులు బద్దలుగొట్టడానికి ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు.
లిఫ్ట్ లోపలకు ఆక్సిజన్
మరో పక్క లోపల ఉన్నవారికి గాలి ఆడక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. అసలే చిన్న లిఫ్ట్‌లో ఏడుగురు ఉన్నారు. అప్పటికే సుమారు గంట నుంచి లోపల ఉండిపోయారు. లోపల ఉక్కపోతతో పాటు ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. వైద్యుల సలహాతో సిబ్బంది ఆక్సిజన్ సిలిండరు తీసుకొచ్చి లిఫ్ట్ లోపలకు పైపు ద్వారా పంపించారు. దీంతో లోపల ఉన్నవారికి ఊరట కలిగింది. అయినా బయటపడతామోలేదోనని కేకలు వేస్తున్నారు.
కొంతసేపటికి మొదటి ఫ్లోర్‌లోకి కొందరు వెళ్లిరాడ్లు, రెంచీలు సహాయంతో పైనుంచి లిఫ్ట్ బోల్టులు విప్పి తలుపులు పక్కకు నెట్టారు. అప్పుడు గాని లోపల ఉన్నవారు బయటకు రావడానికి వీలుపడలేదు. ఈతతంగమంతా సుమారు గంటకు పైగా పట్టింది. లిఫ్ట్‌లో ఉన్నవారంతా క్షేమంగా బయటకు రాగలగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నానా హైరానాతో సిబ్బంది ప్రత్యామ్నాయ చర్యలతో వారిని క్షేమంగా బయటకు తీసుకురావడంతో అంతా అభినందించారు. అనంతరం పాడయిన ఆ లిఫ్ట్ ఎవరూ ఎక్కకుండా మూసేశారు.