బంగారు’కొండ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన మన యాదగిరీశుడి గుట్ట పరిసరాల్లో ‘హైటెక్’ హంగులు సమకూరనున్నాయి. నరసింహుడి చెంత దేశంలోనే ఎత్తై హనుమంతుడు కొలువు దీరనున్నాడు. ఆయన గోపురంపై బంగారు తాపడ కాంతులు వెదజల్లనున్నాయి. గుట్ట సమీపంలో సుగంధాల సువాసనలు.. జంతుసంపదతో కళకళలాడే అభయారణ్యం అభివృద్ధి కానున్నాయి. నృసింహుడి కరుణా కటాక్షాల కోసం వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా బహుళ అంతస్తుల భవనాలు, కల్యాణ మండపాలు ఏర్పాటు కానున్నాయి... ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోనే పేరొందిన ఆధ్యాత్మిక కేంద్రమైన వాటికన్ సిటీ తరహా అభివృద్ధికి ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం గుట్ట అభివృద్ధిపై జరిపిన ప్రత్యేక సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే బడ్జెట్లో గుట్ట అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని ఈ సమీక్షలో సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రణాళికలతోపాటు అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ కోసం శిల్పారామం ప్రత్యేక అధికారిగా పనిచేస్తోన్న జి.కిషన్‌రావును కూడా నియమించారు.
ఇప్పటికే భూసేకరణ పనిలో పడిన కలెక్టర్
గుట్ట అభివృద్ధి కోసం 2వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన నేపథ్యంలో కలెక్టర్ టి.చిరంజీవులు ఇప్పటికే ఆ పనిలో పడ్డారు. గత శనివారం ఆయన గుట్టకు వెళ్లి పరిసరాల్లో ఉన్న భూములను పరిశీలించారు. గుట్ట అభివృద్ధి కోసం బడ్జెట్లో పెట్టిన రూ.100 కోట్లతో పాటు దేవస్థానం కింద ఉన్న రూ.50 కోట్ల రిజర్వ్ నిధులను కూడా కలిపి అభివృద్ధి పనులు చేపడతామని ఆయన వెల్లడించారు. తిరుపతి తరహా మాస్టర్‌ప్లాన్ తయారు చేస్తున్నామని కలెక్టర్ చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సమీక్ష నిర్వహించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రార ంభించాలని అధికారులకు ఆదేశాలివ్వడం గమనార్హం.
కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల్లో మరికొన్ని..
గుట్ట సమీపంలో రెండు వేల ఎకరాలు సేకరించి ల్యాండ్‌స్కేపింగ్ చేయాలి.
నరసింహుడి అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలి.
వేద పాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటు.
రీజనల్ రింగ్‌రోడ్డు గుట్ట మీదుగా మళ్లింపు
గుట్ట పవిత్రతను కాపాడేలా పరిసరాల్లో ప్రైవేటు కట్టడాలపై నిషేధం.