6నెలల్లో 85సార్లు జన్మనిచ్చిందట!
గౌహతి: అవకాశం రావాలే గానీ గుడినీ, గుళ్లో లింగాన్ని మింగేసే ప్రబుద్ధులు చాలామందే ఉంటారు. అసోంలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పురుడు పోసుకునే మహిళలకు ప్రోత్సహం కింద ఇచ్చే ప్రభుత్వ పథకాన్ని సొమ్ము చేసుకోవాలని చూసిన ఓ ప్రభుత్వ ఆసుపత్రి నర్సు అడ్డంగా బుక్కయింది.
వివరాల్లోకి వెళితే ప్రభుత్వ గ్రామీణ వైద్యశాలల్లో పురుడు పోసుకునే తల్లులకు ఇచ్చే డబ్బులపై కన్నేసిన ఆసుపత్రి నర్సు లిల్లీ బేగం అవినీతికి పాల్పడింది. కరీంగంజ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరునెలల కాలంలో సుమారు 160 ప్రసవాలు అయినట్టుగా ఆసుపత్రి రికార్డులో చూపించిన లిల్లీ బేగం వీటిలో సగానికి పైగా కేసులను తన పేరుతో నమోదు చేసింది. అంతేకాకుండా ఏకంగా తాను 85 సార్లు బిడ్డకు జన్మనిచ్చినట్టుగా తప్పుడు రికార్డులు సృష్టించింది. తద్వారా 40,000 రూపాయలను దక్కించుకుంది. అయితే ఈ ప్రసవాలను నమోదు చేసే అధికారం తన చేతిలోనే ఉండటంతో లిల్లీ బేగం పని మరింత సులువయింది.
ఈ ఉదంతంపై అందిన ఫిర్యాదుతో మేల్కొన్న ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంతో లిల్లీ బేగం బండారం బయటపడింది. అవినీతి జరిగినట్టు తమ విచారణలో తేలినందున ఆమెను విధులనుంచి తొలగించినట్టు సీనియర్ ప్రభుత్వ అధికారి సర్ఫరాజ్ ప్రకటించారు. 'నర్సులుగా మేం చాలా చాకిరీ చేస్తాం.. మా పనికి తగ్గ వేతనాలు లభించడంలేదు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. తప్పు చేశానంటూ లిల్లీ క్షమాణలు కోరింది.