110 మంది హెచ్ఎంలకు జీతాలు నిలుపుదల
డిప్యూటీ డీఈవో లింగేశ్వరరెడ్డి
నిధుల వ్యయంలో నిర్లక్ష్యం ఫలితం
మాకవరపాలెం : నిధుల వ్యయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 110 ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల జీతాలు నిలిపి వేస్తున్నట్టు డిప్యూటీ డీఈవో లింగేశ్వరరెడ్డి తెలిపారు. మాకవరపాలెం, వజ్రగడ జడ్పీ ఉన్నతపాఠశాలలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలతోపాటు తరగతులను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకం మెనూ, ఇప్పటివరకు పూర్తయిన సిలబస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ యలమంచిలి డివిజన్లోని ఉన్నత పాఠశాలలు ఒక్కో దానికి రూ. 75 వేల చొప్పున రాష్ట్రీయ మాథ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్ఏ)నుంచి నిధులు మంజూరయ్యాయన్నారు. వీటిని సకాలంలో ఖర్చు చేసి వివరాలను అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 110 మంది హెచ్ఎంలకు ఈ నెల జీతం నిలుపుదల చేస్తున్నామన్నారు.
విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నప్పుడు ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకూడదన్నారు. తమ తనిఖీల్లో ఎవరైనా సెలవులుపై వెళితే ఆయా పాఠశాలల హెచ్ఎంలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుపాను హెచ్చరికల సందర్భంగా శనివారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించామన్నారు. శనివారం తాను తనిఖీలు చేస్తానని ప్రైవేటు పాఠశాలల తెరచి ఉంటే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట ఎంఈవో మూర్తి ఉన్నారు.
ముగ్గురికి షోకాజ్ నోటీసులు
మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను శుక్రవారం ఉదయం 9.20 గంటలకు డిప్యూటీ డీఈవో లింగేశ్వరరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసమయంలో ఇద్దరు ఉపాధ్యాయులు ఆలస్యంగా పాఠశాలకు వచ్చారు. అయినప్పటికీ హెచ్ఎం వారికి ఆబ్సెంటు వేయకపోవడంతో ఆయనకు , ఆలస్యంగా వచ్చిన ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సమయానికి పాఠశాలకు రాకపోతే సహించేదిలేదని హెచ్చరించారు.