మరో బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభం
హైదరాబాద్: నగరవాసులకు మరో బ్యాడ్మింటన్ అకాడమీ అందుబాటులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని బొంగ్లూర్ గ్రామంలో భారత మాజీ కోచ్ బాస్కర్బాబు నెలకొల్పిన ‘లినింగ్ బ్యాడ్మింటన్ అకాడమీ’ సోమవారం ప్రారంభమైంది. జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, స్థానిక ఎమ్మెల్యే కిషన్రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి అకాడమీని ప్రారంభించారు. ‘ప్రపంచదేశాలను తలదన్నేలా భారత క్రీడాకారులను తయారుచేసే బాధ్యత అకాడమీలపైనే ఉంది.
ఈ మధ్య కాలంలో బ్యాడ్మింటన్లో భారత్ ఎంతో పురోగతి సాధించింది. కామన్వెల్త్, ఒలింపిక్స్ క్రీడల్లో మన ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఒకప్పుడు చిన్న దేశాలతో పోటీకి భయపడే స్థాయి నుంచి టాప్ సీడ్ ఆటగాళ్లను నిలువరించే స్థాయికి భారత బ్యాడ్మింటన్ ఎదిగింది’ అని గోపీచంద్ హర్షం వ్యక్తం చేశారు. బాస్కర్బాబు అకాడమీ దేశానికి పేరు తెచ్చే క్రీడాకారులను అందించాలని ఎమ్మెల్యే కిషన్రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాతీయ జమ్నాస్టిక్ కోచ్ రామ్మోహన్, బీబీబీఏ చైర్మన్ భాస్కరబాబు, క్రీడాకారులు నీలిమా చౌదరి, చేతన్ అనంద్, శ్రీకాంత్ పాల్గొన్నారు.